Use of helmet
-
'హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ వేయండి'
హైదరాబాద్: రాష్ట్రంలో హెల్మెట్ల వాడకంపై సోమవారం హైకోర్టులో విచారణ చేపట్టారు. హెల్మెట్ వాడకంపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ విధించాలని న్యాయస్ధానం ఆదేశించింది. హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ ఏజీ చైన్ స్నాచింగ్ ల కారణంగా హెల్మెట్ వాడకంపై కఠినంగా వ్యవహరించడం లేదని తెలిపింది. అయితే ఏజీ వాదనలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. -
హెల్మెట్ వాడకంపై ఏమి చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించించింది. ఇందుకు 15 రోజుల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది. హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించేలా చూడాలని అన్ని జిల్లాల రవాణాశాఖ అధికారులను ఆదేశిస్తూ కమిషనర్ ఈ నెల 2న జారీచేసిన సర్క్యులర్‌ను ఎంతమేర అమలుచేశారో తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హెల్మెట్ వాడకంపై మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని కఠినంగా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ 2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హైకోర్టు గత ఆదేశాల మేరకు తెలంగాణ రవాణాశాఖ కమిషనర్ తన కౌంటర్‌ను సోమవారం ధర్మాసనం ముందుంచారు. కౌంటర్ దాఖలుతో సమస్య పరిష్కారం కాదని, హెల్మెట్‌ను తప్పనిసరిగా వాడే విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అండేపల్లి సంజీవ్‌కుమార్ సమాధానమిస్తూ, వాహనం కొనుగోలు చేసేటప్పుడు హెల్మెట్ కొనుగోలు కూడా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశామని, హెల్మెట్ కొనుగోలు రసీదును సమర్పిస్తేనే వాహనం రిజిష్టర్ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ‘ఈ నిబంధన హెల్మెట్ తయారీదారుల కోసమేనని అందరికీ తెలుసు. హెల్మెట్ కొనడం ముఖ్యం కాదు. హెల్మెట్ కొని ఇంట్లో పెడితే సరిపోతుందా? దానిని వాడటం ముఖ్యం. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్‌ను తప్పనిసరిగా వాడేం దుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. మేం ప్రతీ రోజూ రోడ్లపై చూస్తూనే ఉన్నాం.. ఎంతో మంది హెల్మెట్ లేకుండా పోతున్నా పోలీసులు వారిని ఆపుతున్న దాఖలాలే లేవు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్‌లతో సహా 92,164 మందిపై కేసులు పెట్టామని ఎస్‌జీపీ చెప్పగా, ఇవికాక ఇంకేం చర్యలు తీసుకున్నారని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏమైనా ప్రకటనలు ఇస్తున్నారా? అని ధర్మాసనం అడిగింది. మీకు 15 రోజుల గడువునిస్తున్నామని, ఈ లోపు ఏం ఫలితాలు సాధించారో తమ ముందుంచాలని కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. -
ప్రాణమే ముద్దు ‘ఆకాష్’మే హద్దు
హెల్మెట్ వాడకంపై చిన్నారి వినూత్న ప్రచారం ఒక పుస్తకం పది చెడు అలవాట్ల్లను దూరం చేస్తుంది.... ఒక సంఘటన పది మందికి సాయపడేలా ప్రేరణ కలిగిస్తుంది. 2013వ సంవత్సరం మహాబలిపురం వద్ద జరిగిన ఒక సంఘటన ఐదేళ్ల చిన్నారిలో ప్రేరణ కలిగించింది. హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపి ప్రమాదానికి గురైన సంఘటనతో చలించి పోయిన ఆకాష్‌ను హెల్మెట్‌పై ప్రచారం చేసేలా ఉసిగొల్పింది... ఎంతగా అంటే.... హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన ముఖ్యమంత్రినే నిలదీసేంతగా... రాష్ట్ర సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రినే మెప్పించిన ఐదేళ్ల చిన్నారి ఆకాష్ ఉదంతమిది. తిరువళ్లూరు: 2013వ సంవత్సరం తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం రోడ్డులో ఆకాష్‌తో కలిసి షికారుకు బయలుదేరాం. ఎప్పుడూ రద్దీగా ఉండే మాంబళం రోడ్డులో వాహనాలు రాకెట్లా దూసుకెళ్తున్నాయి. హెల్మెట్ లేకుండా చాలా మంది వాహనాలను నడుపుతూనే ఉన్నారు. సరిగ్గా ఆరు గంటల సమయంలో మా వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తలపై తప్ప మరెక్కడా గాయం లేదని అప్పట్లో జరిగిన సంఘటనను వివరించాడు ఆకాష్ తండ్రి ఆనందన్. బహుశా ఇదే సంఘటన హెల్మెట్‌పై ప్రచారం నిర్వహించాలనే ఆలోచన ఆకాష్‌కు కలిగివుండవచ్చని వివరించాడు ఆనందన్. కాంచీపురం జిల్లా మహాబలిపురం ప్రాంతానికి చెందిన పెయింటర్ ఆనందన్. తల్లి యోగలక్ష్మి. గృహణి. వీరి ఐదేళ్ల కుమారుడు ఆకాష్ . చెన్నైలోని ప్రయివేటు పాఠశాలల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. మాంబళం రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ప్రతి చోటా సమయం దొరికినప్పడు హెల్మెట్‌పై ప్రచారం చేసేవాడు. అలా ప్రారంభమైన ప్రచారం ఆంధ్ర, కర్ణాటక, కేరళా, తమిళనాడు, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో హెల్మెట్‌పై ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు లక్షల కరపత్రాలను పంపిణీ చేసి, పది లక్షల మందిని కలిసి హెల్మెట్ ధరించాలని విన్నవించాడు. ఇతని బృందంలోని సభ్యులు మణిమేఘలై. 2014లో పాండిచ్చేరిలో హెల్మెట్‌పై ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రంగస్వామి ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా వస్తున్నారు. రంగస్వామి వద్దకు వెళ్లిన ఆకాష్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం సరికాదంటూ సలహా ఇచ్చాడు. వెంటనే గుర్తించి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చిన్న పిల్లోడు మీరెవరో తెలియకుండా వాహనాన్ని ఆపేసాడంటూ క్షమాపణ కోరాం. కాని రంగస్వామి మాత్రం ఆకాష్ చేస్తున్న ప్రచారానికి మురిసిపోయాడు. అప్పటికప్పడు హెల్మెట్ తెప్పించి వేసుకోవడంతో పాటు తన చాంబర్‌కు తీసుకెళ్లి సన్మానించి ఆకాష్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు జరిపించాడు. ఈ ఘటన తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని వివరించాడు ఆకాష్ బృందంలోని ఓ సభ్యుడు తమిళ్‌సెల్వన్. ప్రచారం ఇలా హెల్మెట్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించిన ఆకాష్‌కు తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. ఆకాష్ చేస్తున్న హెల్మట్ ప్రచారాన్ని గమనించిన 20 మంది బృందంలో చేరారు. ఆకాష్‌కు పాఠశాల సెలవు రోజుల్లో హెల్మెట్ ప్రచారం కోసం వెళ్లేవాడు. ప్రచారం ఎలా నిర్వహించాలి. ఎక్కడ నిర్వహించాలి అనే విషయాన్ని ఆకాష్ నిర్ధేశించేవాడు. 20 మంది వేర్వేరు చోట నిలబడి కరపత్రాలను పంపిణీ చేసే వాడు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించి ఇంటికి వచ్చే వాళ్లం. మా ప్రచారాన్ని పోలీసులు స్వాగతించేవారు. అదే సమయంలో ఐదేళ్ల చిన్నారి ెహ ల్మెట్పై చేస్తున్న పోరాటంపై పలువురు ప్రశంసించే సమయంలో తాము పొందే ఆనందానికి అవధులు లేవంటూ మురిసిపోయారు మణిమేఖలై. ఒక పువ్వు- ఒక నవ్వు మంచి పనులకు ముహూర్తం చూడకూడదని తాతగారు చెప్పేవారు. ప్రమాదం జరిన తీరును చూసి తన వంతుగా హెల్మెట్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించి తల్లిదండ్రులకు చెప్పా. ఈ ప్రచారం వలన చదువు పాడైపోతుందని బాధపడ్డారు తల్లిదండ్రులు. పాఠశాలకు ఒక్క రోజు కూడా నిలిచిపోనని చెప్పడంతో వారు ఓకే చెప్పారు. రెండు సంవత్సరాల్లో వంద శాతం పాఠశాలకు హాజరుకావడంతో అవార్డు వచ్చింది. అయితే నేను చేస్తున్న ప్రచారం కొంత వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతోనే హెల్మెట్‌తో వాహనాలను నడిపే వారిని సన్మానించేలా పూల బొకే ఇవ్వడం, లేకుంటే ఒక నవ్వు నవ్వి కరపత్రాన్ని ఇవ్వడం ఇది దినచర్య అంటూ వివరించాడు ఆకాష్. మిడిమిడి జ్ఞానం. అసలే ఆరేళ్లు దాటని వయస్సులో చిన్నారి చేస్తున్న అవగాహన ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. వందలాది అవార్డులు.. ప్రశంసలు వచ్చినా ఆత్మసంతృప్తి లేదంటూనే తన ఆశయం కోసం నిరంతరం శ్ర మిస్తున్న ఆకాష్‌ను మనసారా దీవిద్దాం. -
ఆగస్టు 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 1 నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి కానుంది. వివిధ కారణాల నేపథ్యంలో జూలై 1 నుంచి అమలు చేయాలన్న నిర్ణయాన్ని మరో నెల పాటు పోలీసు విభాగం వాయిదా వేసింది. అనేక కారణాలను విశ్లేషించిన పోలీసు విభాగం ఆగస్టు 1 నుంచి అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నెల రోజుల పాటూ వాహనచోదకులకు హెల్మెట్ వినియోగంపై కౌన్సిలింగ్ ఇచ్చి, వచ్చే నెల 1 నుంచి జరిమానా విధింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తున్నారు.