UV Ramanamurthy Raju
-
టీడీపీకి షాక్: కన్నబాబు రాజీనామా
రాంబిల్లి(యలమంచిలి): మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు), ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ యు. సుకుమారవర్మలు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర, రూరల్ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. తాజాగా కన్నబాబురాజు వైఎస్సార్సీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధిష్టానం పలు దఫాలు ఆయనతో చర్చలు జరిపి పార్టీని వీడవద్దని ఒత్తిడి తెచ్చింది. అయితే తాను వైఎస్సార్సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నానని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తెలిపారు. -
మే 5న వైఎస్సార్సీపీలో చేరుతున్నా: టీడీపీ నేత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మే 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు టీడీపీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రకటించారు. జగన్ నాయకత్వంలో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసేందుకు బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరంలో సోమవారం నిర్వహించనున్న వంచన వ్యతిరేక దీక్ష ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం ఆయన సభాస్థలి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని యత్నాలు చేసినా వైఎస్సార్సీపీలోకి వెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు. యు.వి.రమణ మూర్తిరాజు (కన్నబాబురాజు) 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు.