
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మే 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు టీడీపీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రకటించారు. జగన్ నాయకత్వంలో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసేందుకు బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరంలో సోమవారం నిర్వహించనున్న వంచన వ్యతిరేక దీక్ష ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం ఆయన సభాస్థలి వద్దకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని యత్నాలు చేసినా వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు. యు.వి.రమణ మూర్తిరాజు (కన్నబాబురాజు) 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు.