V. Nagireddy
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల గందరగోళంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌రన్ ప్రారంభించడం వంటివి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి టీపీసీసీ ఫిర్యాదు చేసింది. ఇంటర్ ఫలితాలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారని, ఈ సమీక్షపై ముందుగా ఎస్ఈసీ అనుమతి తీసుకుని విధానపరమైన నిర్ణయాలను ముందుగానే వెల్లడించి ఉంటే బాగుండేదని పేర్కొంది. ఇకముందైనా సీఎంకు ఎస్ఈసీ ఈ విషయంలో తగిన సూచనలు చేయకపోతే అదే పద్ధతిని పాటించే అవకాశముందని పేర్కొంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లబ్ధి పొందేందుకు అనుసరించిన విధానాలనే సీఎం ఇప్పుడు అనుసరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు టీపీసీసీ ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్ కమిషనర్‌కి లేఖ రాశారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందు కు మే మొదటి వారంలో పెంచిన ఆసరా పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమవుతోందన్నారు. ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు కేసీఆర్ వివిధ రూపాల్లో జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని.. పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడకుండా ఆదేశించాలని కోరారు. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ కాళేశ్వరం వెట్‌రన్‌ను ప్రారంభించడం, సీఎస్ ఎస్కే జోషి రెండో పంప్ ట్రయల్‌రన్‌ను ప్రారంభించనుండడం కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేందుకేనని, అందువల్ల ఇక ముందు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని కోరారు. -
20 కల్లా పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20 కల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 18–20 తేదీల్లోగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఎక్కువ సంఖ్యలో జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలున్నచోట, శాంతిభద్రతల పరిస్థితిని బట్టి కొన్ని జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలుండొచ్చు. మిగతా జిల్లాల్లో ఒకటి లేదా రెండు విడతల్లోనే ఎన్నికలు ముగిస్తాం. 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన అనంతరం ఏయే జిల్లాల్లో మూడు విడతలుంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ నెల 20 కల్లా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో 18–20 తేదీల్లోగా నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అందులో నామినేషన్ల దాఖలు మొదలు ఎన్నికల వరకు 3 విడతల్లో ఏయే జిల్లాల్లో, ఏయే మండలాల్లో ఎప్పుడప్పుడు ఎన్నికలుంటాయి, తదితరాలపై స్పష్టమైన వివరాలు, సమాచారం ఉంటుంది’అని చెప్పారు. వసతుల కల్పనపై చర్చ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రధానంగా చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, మండువేసవిలో వీటిని నిర్వహిస్తున్నందున పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్లకు ఎండదెబ్బ తగలకుండా తగిన నీడ, మంచినీటి వసతి కల్పించడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకురావడం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యయ అంచనా, దాని కేటాయింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ బాక్స్‌లు, బ్యాలెట్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల సీనియర్ అధికారులు రాజేశ్వర్ తివారీ, కె.రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, అధర్‌సిన్హా, సునీల్‌శర్మ, బి.జనార్దనరెడ్డి, నీతూకుమారి ప్రసాద్, అశోక్, సీనియర్ ఐపీఎస్‌లు తేజ్‌దీప్‌కౌర్ మీనన్, జితేందర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్, జయసింహారెడ్డి పాల్గొన్నారు. నాగిరెడ్డి వెల్లడించిన సమీక్ష వివరాలివీ.. 32,007 పోలింగ్ కేంద్రాలు మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధిలోని 535 మండల ప్రజా పరిషత్‌లలోని 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఇందుకోసం 32,007 పోలింగ్ స్టేషన్లను వినియోగిస్తాం. ఇటీవలి లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 1.57 కోట్ల గ్రామీణ ఓటర్లున్నారు. పరిషత్ నోటిఫికేషన్ వెలువడే వరకు జాబితాలో చేరేవారికి కూడా ఓటు హక్కు కల్పించనున్నందున వీరి సంఖ్య 1.60 కోట్లకు చేరవచ్చని అంచనా. అధికారులు తీసుకోవాల్సిన చర్యలు పరిషత్ ఎన్నికల సందర్భంగా కొత్త పథకాల ప్రకటనగాని, వాటిపై హామీలుగాని ఇవ్వకూడదు. కొత్తగా ఆర్థికపరమైన మంజూరు చేయొద్దు. కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు. ఎస్ఈసీ అనుమతి లేకుండా ఏ అధికారినీ బదిలీ చేయరాదు. ప్రజాధనంతో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదు. భద్రతాపరంగా... ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరమన్న దాని ప్రాతిపదికన భద్రతా దళాలపై అంచనా వేయాలి. వివిధ జిల్లాలు, మండలాల్లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని బట్టి భద్రతా సిబ్బందిని మోహరించాలి. ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిళ్లు, భయాలకు గురికాకుండా ఓటువేసేందుకు ప్రజలకు విశ్వాసం కలిగించేలా భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలి. మొత్తంగా 55 వేలమంది వరకు పోలీసు, భద్రతా సిబ్బంది అవసరమవుతారు. నోటిఫికేషన్ వరకు... ఓటు నమోదుకు స్పెషల్ డ్రైవ్ అంటూ ఏమి ఉండదని, మార్పులు, చేర్పులు, కొత్త ఓటు నమోదుకు నోటిఫికేషన్ వెలువడే వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. గత పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి లెక్కలు చూపించని వారి వివరాలు ఉన్నాయి. వారిపై నిఘా పెడతాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎంతమంది పోటీ చేసినా ఎన్నికలు నిర్వహిస్తాం. నామినేషన్ల ఉపసంహరణ అనంతరమే బ్యాలెట్‌ను ముద్రిస్తామన్నారు. గతంలో నల్లగొండ జిల్లాలో 400 మందికిపైగా అభ్యర్థులు పోటీ చేసినా ఆ మేరకు పేపర్బ్యాలెట్ను ముద్రించి ఎన్నికలను సవ్యంగా నిర్వహించిన అనుభవం మనకుంది. ఎన్నికల సామగ్రి సిద్ధం... ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి మొత్తం సిద్ధమైంది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి బ్యాలెట్ బాక్స్‌లు తెప్పించాం. బ్యాలెట్‌పత్రాల ముద్రణ మాత్రం కొంత క్లిష్టంగా ఉంటుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థులు తేలాక బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తాం. ఈ పత్రాల ముద్రణకు 3, 4 రోజుల సమయం పడుతుంది. అయినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. జిల్లాస్థాయిలో బ్యాలెట్ పత్రాల ముద్రణాకేంద్రాలను సైతం ఖరారు చేశాం. పోలింగ్ సిబ్బందికి నియామకపత్రాలు జారీచేశాం. గులాబీ రంగే ఉంటుంది... గతం నుంచే ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలను గులాబీరంగు బ్యాలెట్‌పేపర్‌తో నిర్వహిస్తున్నాం. అందువల్ల ఈసారి కూడా వీటిరంగు అదే ఉంటుంది. ప్రస్తుతం పింక్ కలర్ ఒక పార్టీకి సంబంధించిన రంగు అయినా గతం నుంచి ఇదే పద్ధతిలో సాగుతున్నందున దానినే కొనసాగిస్తాం. జడ్పీటీసీ ఎన్నికలను తెలుపురంగు బ్యాలెట్ పేపర్‌తో నిర్వహిస్తాం. ఈ రంగులు కొత్తగా ఇచ్చినవి కాదు. గతం నుంచి కొనసాగుతున్నవే. 23 రోజుల్లో పూర్తి ఎన్నికల నిర్వహణకు 15 రోజులు, మూడో నోటిఫికేషన్ల విడుదలకు 8 రోజులు కలుపుకుని మొత్తం పరిషత్ ఎన్నికల ఓటింగ్ 23 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలను అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో విడుదల చేసి ప్రదర్శించాం. వీటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేశాం. ఓటరు జాబితా ఇంకా ఎవరికైనా కావాలంటే తగిన రుసుం చెల్లించి తీసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. 18న పోలింగ్ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తాం. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశాం. పోలింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు, ఇతర అధికారులకు శిక్షణ కూడా పూర్తవుతుంది. ప్రతి మండలంలో ఒక్కో జెడ్పీటీసీ సీటు ఉంటుంది కాబట్టి ప్రతి మండలానికి ఒక రిటర్నిం గ్ అధికారి, మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి ఒక ఆర్వో ఉంటారు. మిగిలిన పోలింగ్ సిబ్బంది, అధికారులకు త్వరలోనే శిక్షణ పూర్తవుతుంది. ఎన్నికల నిర్వహణకు (మొత్తం మూడు విడతలకు కలుపుకుని) 1.80 లక్షల సిబ్బంది అవసరం అవుతారు. దీనికి సంబంధించి సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కేసులు
సూర్యాపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. రుజువైతే పదవిని కోల్పోతారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా శాంతినగర్‌లోని పోలీస్‌గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వేలం పాటల ద్వారా గ్రామ పంచాయతీ పదవులను ఏకగ్రీవాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సంక్రాంతి సెలవుల్లో సైతం సిబ్బంది పనిచేయడం హర్షణీయమన్నారు. ఎంపీడీఓలు సర్పంచ్ పదవికి అభ్యర్థులు ఖర్చు చేసే వ్యయాలను లెక్కిస్తారని పేర్కొన్నారు. పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించామని తెలిపారు. అయితే ఓటర్లను ప్రలోభపెడితే పోలీస్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికలు శాసనసభ ఎన్నికల మాదిరిగా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తున్నామని వాటికి అవసరమైన బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే ముద్రించి అన్ని మండలాలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా ఖర్చు చేస్తే అభ్యర్థి ఎన్నిక రద్దు అవుతుందని వెల్లడించారు. అలాగే న్యాయస్థానం ద్వారా విచారణ ఎదుర్కోవాలని.. అలాంటి సందర్భంలో అవసరమైతే ఏడాది జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఆయన వెంట జిల్లా పరిశీలకుడు టి.చిరంజీవులు, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు ఉన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)కమిషనర్ వి.నాగిరెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధి, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పంచా యతీ ఎన్నికల కోడ్ వర్తించదని తెలిపారు. ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులు నమోదు కాలేదని చెప్పారు. శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్లో పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఆయా వర్గాలపై ఒత్తిళ్లు తెచ్చి బలవంతంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. అ లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే రీ పోలింగ్ జరిపేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇ చ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో పోలీసులు అందుబాటులో ఉంటారని, అవసరమైతే అదనపు బలగాలూ అందుబాటులో ఉంటాయ న్నారు. ఎన్నికల్లో నిర్దేశించిన వ్యయ పరిమితిని మించి ఖర్చుచేస్తే చర్యలు తీసుకుంటా మన్నారు. గత ఎన్నికల్లో ఖర్చులు చూపెట్టని వారి ని అనర్హులుగా ప్రకటించినట్లుగానే, ఈసారి కూడా ఎన్నికల ఖర్చు అధికంగా చేస్తే కఠిన చర్య లుంటాయన్నారు. పంచాయతీల్లో ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. గ్రామ పంచాయితీలకు సం బంధించిన కొత్త పథకాలు మాత్రం చేపట్టేందుకు వీల్లేదని తెలిపారు. సమావేశంలో పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల సం ఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఎన్నికల పరిశీలకు లు, ఆడిట్ అధికారులు పాల్గొన్నారు. వీరికి 2018 కొత్త పంచాయతీ చట్టం, ఎన్నికల విధులు, విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యయ పరిశీలకులకు జిల్లాలు కేటాయించినట్లు తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై పరిశీలకులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు.. ఈ నెలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వి.నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికలపై ఉన్నతస్థాయి సమీక్ష.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, వీటితో ముడిపడిన అంశాలపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న వివిధ ప్రాంతాల్లోని శాంతి భద్రతలు, బడ్జెట్, రవాణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది నియామకాలపై చర్చించారు. సమావేశంలో సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, అదనపు డీజీపీ జితేందర్, రాష్ట్ర ఎన్నికల సం ఘం కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
సాధారణ పరిశీలకుల నియామకం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 26 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. వీరికి తోడు మరో 39 మంది అధికారులకు వ్యయ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 26 మంది సాధారణ పరిశీలకులు ఎన్నికల సంఘం వద్ద డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లుగా భావించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. వీరి టీఏ, డీఏ ఇతరత్రా ఖర్చులు వారి ప్రస్తుతం పనిచేసే ప్రభుత్వ శాఖ బడ్జెట్ పద్దు నుంచి ఖర్చుచేయాలని నిర్దేశించారు. త్వరలో అబ్జర్వర్స్‌తో ఎన్నికల సంఘం సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సాధారణ పరిశీలకులు వీరే రాష్ట్ర ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్లుగా నియమించిన వారిలో పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెం కటేశం, గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఉన్నతవిద్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సర్వే, భూరికార్డుల కమిషనర్ ఎల్.శశిధర్, చేతివృత్తుల కార్పొరేషన్ ఎండీ శైలజా రామయ్యార్, పరిశ్రమల కమిషనర్ అహ్మద్ నదీమ్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితా రాజేంద్ర, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, క్రీడాపాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.దినకర్‌బాబు, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టియాన చౌంగ్తు, గజిటీర్స్ కమిషనర్ జి.కిషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ టి.చిరంజీవులు, పాఠశాల విద్య డైరెక్టర్ టి.విజయకుమార్, కాలు ష్య నియంత్రణ బోర్డు సభ్యకార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (హైదరాబాద్) బి.బాలమాయాదేవి, సీసీఎల్ఏ డైరెక్టర్ వాకాటి కరుణ, ఆయిల్ ఫెడ్ ఎండీ కె.నిర్మల, మున్సిపల్ పాలన శాఖ అదనపు కార్యదర్శి ఎల్.శర్మణ్, హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఎం.చంపాలాల్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంయుక్త కార్యదర్శి బి.భారతి లక్పతి నాయక్, మహిళా, శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ విజేంద్ర, ఉపాధి–శిక్షణ విభాగం డైరెక్టర్ కేవై. నాయ క్, సెర్ఫ్ సీఈవో పౌసుమి బాసు, ప్రొటోకాల్ సంయుక్త కార్యదర్శి ఎస్.అర్విందర్ సింగ్, ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్ ప్రీతి మీనా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ అలగు వర్షిణి ఉన్నారు. -
జోరుగా ప్యాక్స్ ఎన్నికల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వీటిని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసిన వ్యవసాయశాఖ, ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి శుక్రవారం లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 906 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ నిమిత్తం 11,778 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆ లేఖలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 12,946 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని కోరారు. ఎన్నికల వ్యయాన్నిప్యాక్స్లే భరించాలి ఎన్నికల నిర్వహణ ఖర్చును ప్యాక్స్‌లే సమకూర్చుకోవాలని వ్యవసాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అందుకోసం రూ. లక్షను జిల్లా సహకార సొసైటీ ఎన్నికల ఖాతాలో జమ చేయాలని పార్థసారథి ఆదేశించారు. ఒకవేళ ప్యాక్స్లకు ఆస్థాయిలో ఆర్థికంగా భరించే స్థోమత లేకపోతే డీసీసీబీలు సమకూర్చాలని కోరారు. డీసీసీబీలకు కూడా స్థోమత లేకపోతే టెస్కాబ్ అడ్వాన్స్ ఇవ్వాలన్నారు. ఏఏ ప్యాక్స్లకు ఎన్నికల ఖర్చు భరించే స్థోమత లేదో అటువంటి వాటిని గుర్తించాలని కోరారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా కాంట్రా క్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు రకాల పోస్టుల్లో అప్పటి అవసరాల కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను తీసుకున్నారు. వీరిని ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగాల్లో పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం లో గతనెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 40 వేల మంది కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ కమిటీని నియమించింది. వూర్గదర్శకాలపై రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సర్పంచ్‌లకు చెక్‌పవర్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్ల సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతల ఆందోళన నేపథ్యంలో, సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెక్‌పై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కలసి సంతకం చేయడం సర్పంచ్‌లకే అవమానవుంటూ పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో గతంలోని జారుుంట్ చెక్‌పవర్ ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వి. నాగిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అయితే పంచాయతీల్లో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆంక్షలు విధించారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి చెల్లింపులకూ వీల్లేదని, ప్రతి చెల్లింపునూ రిజిష్టర్‌లో, క్యాష్‌బుక్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనువుతులు లేని పనులు చేపట్టరాదని, నగదు రూపంలో చెల్లింపు కుదరదని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ప్రొక్యూర్మెంట్ విధానానికి అనుగుణంగా కొనుగోళ్లు ఉండాలన్నారు. చెక్‌బుక్‌లు, రిజిష్టర్లు ఇళ్లలో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీ వసూలు చేసే డబ్బును ముందుగా ట్రెజరీలో జమ చేయాల్సిందేనన్నారు. నిధుల వ్యయానికి గ్రామ కార్యదర్శి కూడా బాధ్యత వహించాలని, వ్యయానికి సంబంధించి మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, ఏమాత్రం నిర్లక్ష్యంఉన్నా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ల సంఘం హర్షం: పంచాయతీల నిధుల వ్యయంలో జారుుంట్ చెక్‌పవర్‌ను రద్దు చేసి సర్పంచ్‌లకు పూర్తిస్తాయి చెక్‌పవర్ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపట్ల రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి, గౌరవ సలహాదారు పిల్లి సత్తిరాజు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడాన్ని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్వాగతించారు. సర్పంచ్‌కు గౌరవవేతనాన్ని ఆరువందల రూపాయలను 20 వేల రూపాయలకు పెంచాలని ఆయున డిమాండ్ చేశారు.