
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వీటిని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసిన వ్యవసాయశాఖ, ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి శుక్రవారం లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 906 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ నిమిత్తం 11,778 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆ లేఖలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 12,946 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని కోరారు.
ఎన్నికల వ్యయాన్నిప్యాక్స్‌లే భరించాలి
ఎన్నికల నిర్వహణ ఖర్చును ప్యాక్స్‌లే సమకూర్చుకోవాలని వ్యవసాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అందుకోసం రూ. లక్షను జిల్లా సహకార సొసైటీ ఎన్నికల ఖాతాలో జమ చేయాలని పార్థసారథి ఆదేశించారు. ఒకవేళ ప్యాక్స్‌లకు ఆస్థాయిలో ఆర్థికంగా భరించే స్థోమత లేకపోతే డీసీసీబీలు సమకూర్చాలని కోరారు. డీసీసీబీలకు కూడా స్థోమత లేకపోతే టెస్కాబ్ అడ్వాన్స్ ఇవ్వాలన్నారు. ఏఏ ప్యాక్స్‌లకు ఎన్నికల ఖర్చు భరించే స్థోమత లేదో అటువంటి వాటిని గుర్తించాలని కోరారు.