V S Achuthanandan
-
అచ్యుతానందన్కు 100 ఏళ్లు
అలప్పుజ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వెలిక్కకత్తు శంకర్ అచ్యుతానందన్ శుక్రవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2006–11 సంవత్సరాల్లో ఆయన సీఎంగా చేశారు. 1991 నుంచి 2016 దాకా మూడుసార్లు విపక్ష నేతగా ఉన్నారు. వీఎస్గా ప్రసిద్ధుడైన ఆయన 82 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన నేతగానూ రికార్డు సృష్టించారు. స్ట్రోక్ నేపథ్యంలో ఐదేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరికి 2016 ఎన్నికల్లో కూడా కేరళలో వామపక్ష కూటమి వీఎస్నే ముందు పెట్టుకుని ప్రచారం చేసింది. కాంగ్రెస్ను ఓడించి అధికారం చేపట్టింది. అభిమానులు ఆయన్ను ఫిడెల్ క్యాస్ట్రో ఆఫ్ కేరళ అని పిలుచుకుంటారు. అలప్పుజ జిల్లా పున్నప్ర గ్రామంలో 1923లో జన్మించిన వీఎస్ 11 ఏళ్లప్పుడే కన్నవారిని పోగొట్టుకున్నారు. మరుసటేడే స్కూలు మానేసి అన్న టైలరింగ్ షాపులో పనికి కుదురుకున్నారు. 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్లో చేరారు. రెండేళ్ల తర్వాత సీపీఐలోకి మారి పారీ్టలో చకచకా ఎదిగారు. 1964లో సీపీఐ నుంచి బయటికొచ్చి సీపీఎంను ఏర్పాటు చేసిన 32 మంది నేతల్లో వీఎస్ ఒకరు. పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, ప్రముఖులు వీఎస్కు శుభాకాంక్షలు తెలిపారు. -
'పెద్దాయనకు పదవి ఇచ్చే ఆలోచన లేదు'
తిరువనంతపురం: సీపీఎం కురువృద్ధ నేత, మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కు కేబినెట్ స్థాయి పదవి ఇవ్వనున్నట్టు వచ్చిన వార్తలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. అటువంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. దీనిపై కేరళ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కాగా, తనకు పదవి కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగలేదని 93 ఏళ్ల అచ్యుతానందన్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి పోరాడతానని ఆయన ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి కోసం పినరయి విజయన్, అచ్యుతానందన్ పోటీ పడ్డారు. చివరకు విజయన్ వైపే పార్టీ పెద్దలు మొగ్గుచూపడంతో అచ్యుతానందన్ కు నిరాశ ఎదురైంది. -
ప్రతిపక్షనేత క్షమాపణ చెప్పాలి: సీఎం
కొచ్చిన్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీ, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన పై ప్రతిపక్షనేత దుష్ప్రాచారం చేస్తున్నారని ఉమెన్ చాందీ మండిపడ్డారు. కోర్టులో ఉమెన్ చాందీపై 31 కేసులు పెండింగ్లో ఉన్నాయని అచ్యుతానందన్ ఆరోపించారు. అయితే దీని పై చాందీ స్పందిస్తూ..'కోర్టులో నాపై ఉన్న కేసుల వివరాలు బహిర్గతం చేయాలి. నాపై ఒక్క కేసు కూడా పెండింగ్లో లేదు. దీనిపై అచ్యుతానందన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణచేప్పాలి' అన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరైనా కోర్టులో, పోలీసు స్టేషన్లోగానీ ఫిర్యాదు నమోదు చేసినంత మాత్రాన దాన్ని కేసుగా పరిగణించలేమన్నారు. కేసు ఎఫ్ఐఆర్ తో ప్రారంభమౌతుంది. తనపై నమోదైన ఏ కేసులోనైనా ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని అచ్యుతానందన్కు సవాలు విసిరారు. తన మంత్రివర్గసభ్యులపైన కూడా 131 కేసులు నమోదయ్యాయన్న వ్యాఖ్యల్లో వాస్తవంలేదన్నారు. కేవలం ఆర్థికమంత్రి కేఎం మణి పై ఒక్క కేసు మాత్రమే నమోదైందన్నారు. దీనిపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేసి కేసుకు సంబందించి పూర్తి వివరాలను కోర్టు సమర్పించిందని తెలిపారు.