vamsadhara canal
-
బాలుడిని మింగేసిన కాలువ
సాక్షి, శ్రీకాకుళం : రోజూ మారిదిగానే ఆ బాలుడు గ్రామం చెంతనే ఉన్న వంశధార కుడి కాలువ గట్టుకు స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. కాలువలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారిపోవడంతో కొట్టుకుపోయాడు. ఈ విషాద సంఘటన హిరమండలం మేజర్ పంచాయతీ పరిధిలోని చిన్నకోరాడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చిన్నకోరాడకు చెందిన చోడి రాము, స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు స్థానిక కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు దామోదరరావు (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గ్రామం పక్కనే ఉన్న వంశధార కుడి కాలువలో ప్రతి రోజూ కాలకృత్యాలు తీర్చుకోవడానికి దామోదరరావు వెళ్తుండేవాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో కాలువ వైపు వెళ్తానని ఇంటి వద్ద చెప్పాడు. కాలకృత్యాలు తీర్చుకుని కాలువలోకి దిగాడు. కాలుజారిపోవడంతో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు కేకలు వేసుకుంటూ గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బాలుడి కోసం కాలువలో దిగి వెతికారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కె.గోవిందరావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాక సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లతో బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వంశధార అధికారులతో మాట్లాడి కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. రాత్రి 7 గంటల సమయంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. దసరా సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు పెద్దెఎత్తున అక్కడకు చేరుకున్నారు. తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. నిరుపేద కుటుంబమైనా పిల్లలిద్దరూ చదువులో చురుగ్గా ఉండేవారు. నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
తల్లిని చూసేందుకు వచ్చి...
మృత్యు ఒడిలోకి చేరిన చిన్నారి వంశధార వరద కాలువలో పడి మృతి కొత్తూరు: పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో వంశధార ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్న తల్లి వద్దకు చేరిన చిన్నారిని... మూడు రోజులు గడవకు ముందే మృత్యువు మింగేసింది. వలస కూలీ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వంశధార పనుల్లో మహబూబ్నగర్ జిల్లా దానపల్లి మండలం పాంపల్లి గ్రామానికి చెందిన బొంగురాలు లక్ష్మి కూలీగా చేరింది. కొత్తూరు మండలంలోని గూనభద్రలో కాంట్రాక్టర్ కల్పించిన బసలో ఆరునెలలుగా ఉంటూ పనుల్లో పాల్గొంటోంది. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో ఆరో తరగతి చదువుతున్న రాజేశ్వరి(12) తల్లి లక్ష్మి వద్దకు స్వగ్రామం నుంచి మూడు రోజుల కిందట చేరుకుంది. బట్టలు ఉతికేందుకు సమీపంలో నిర్మాణంలో ఉన్న వంశధార వరద కాలువకు మరో బాలికతో కలసి రాజేశ్వరి వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపోయింది. వెంటనే తోడుగా వచ్చిన బాలిక కేకలు వేయడంతో బస నుంచి పలువురు కూలీలు చేరుకున్నారు. మునిగిపోయిన బాలికను ఒడ్డుకు చేర్చి పాతపట్నం సీహెచ్సీకి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యాధికారి నేతాజీ నిర్ధారించారు. బాలిక మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ విజయకుమార్ తెలిపారు. కుమార్తె మృతితో లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతివార్తను వేరే చోట పనిచేస్తున్న రాజేశ్వరి తండ్రి తిరుపతయ్యకు స్థానికులు చేరవేశారు. వంశధార నిర్మాణ కంపెనీ పీఆర్వో తిరుమలరావు చిన్నారి మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. -
వంశధార కాల్వ పనుల వద్ద ఉద్రిక్తత
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనబద్ర కాలనీ వద్ద వంశధార రిజర్వాయరు వరదకాల్వ పనులను బుధవారం ఉదయం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ కాలనీని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ గ్రామస్తులతో చర్చించారు. ఇంజనీరింగ్ అధికారులతో సర్వే చేయించి ముంపు ప్రాంతం అని తేలితే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.