వరద కాలువలో పడి మృతిచెందిన రాజేశ్వరి
మృత్యు ఒడిలోకి చేరిన చిన్నారి
వంశధార వరద కాలువలో పడి మృతి
కొత్తూరు: పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో వంశధార ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్న తల్లి వద్దకు చేరిన చిన్నారిని... మూడు రోజులు గడవకు ముందే మృత్యువు మింగేసింది. వలస కూలీ కుటుంబంలో విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వంశధార పనుల్లో మహబూబ్‌నగర్ జిల్లా దానపల్లి మండలం పాంపల్లి గ్రామానికి చెందిన బొంగురాలు లక్ష్మి కూలీగా చేరింది. కొత్తూరు మండలంలోని గూనభద్రలో కాంట్రాక్టర్ కల్పించిన బసలో ఆరునెలలుగా ఉంటూ పనుల్లో పాల్గొంటోంది. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో ఆరో తరగతి చదువుతున్న రాజేశ్వరి(12) తల్లి లక్ష్మి వద్దకు స్వగ్రామం నుంచి మూడు రోజుల కిందట చేరుకుంది.
బట్టలు ఉతికేందుకు సమీపంలో నిర్మాణంలో ఉన్న వంశధార వరద కాలువకు మరో బాలికతో కలసి రాజేశ్వరి వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపోయింది. వెంటనే తోడుగా వచ్చిన బాలిక కేకలు వేయడంతో బస నుంచి పలువురు కూలీలు చేరుకున్నారు. మునిగిపోయిన బాలికను ఒడ్డుకు చేర్చి పాతపట్నం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యాధికారి నేతాజీ నిర్ధారించారు. బాలిక మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విజయకుమార్ తెలిపారు. కుమార్తె మృతితో లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతివార్తను వేరే చోట పనిచేస్తున్న రాజేశ్వరి తండ్రి తిరుపతయ్యకు స్థానికులు చేరవేశారు. వంశధార నిర్మాణ కంపెనీ పీఆర్వో తిరుమలరావు చిన్నారి మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.