రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
కోదాడ : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం భీమారానికి చెందిన చిలుముల వరమ్మ (19) తన అన్న చిలుముల నాగార్జున, అక్క కొడుకు రవితో కలసి మోటార్ సైకిల్‌పై సోమవారం ఖమ్మం జిల్లా గోకినపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన డీసీఎం వీరి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆమెను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలితో పాటు ఉన్న ఆమె అక్క కుమారుడికి, మోటార్‌సైకిల్ నడుపుతున్న ఆమె అన్నకు స్పల్ప గాయాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు.