వైదిక్, హఫీజ్ భేటీపై ఆగని రభస
పార్లమెంటులో విపక్షాల నిరసన
న్యూఢిల్లీ: లష్కరే ఉగ్రవాదనేత హఫీజ్ సయీద్‌తో యోగా గురువు బాబా రామ్‌దేవ్ సన్నిహితుడైన జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ కావడంపై ప్రతిపక్షం నిరసనతో పార్లమెంటు వరుసగా రెండవరోజు మంగళవారం కూడా స్తంభించింది. రాజ్యసభ మూడుసార్లు, లోక్‌సభ ఒకసారి స్తంభించాయి. సమస్య తీవ్రత దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను రద్దుచేసి, వెంటనే స్పందించాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయసభలకూ ఉదయంనుంచే అంతరాయం కలిగింది.
వైదిక్, హఫీజ్ భేటీపై ఆందోళన వ్యక్తంచేస్తూ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో జీరో అవర్‌లోనూ మరోసారి అంతరాయం కలిగింది. లోక్‌సభలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దీనిపై మాట్లాడుతూ, పాకిస్థాన్‌లోని ఉగ్రవాది, ఒక జర్నలిస్టుల భేటీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని అన్నారు. హఫీజ్‌ను కలుసుకోబోతున్నట్టు వైదిక్ ఏ దశలోనూ తమకు తెలియజేయలేదని, సమావేశం ఆయన వ్యక్తిగతమని చెప్పారు.
వైదిక్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి.. రాహుల్..
మరోపక్క.. వైదిక్ ఆరెస్సెస్ వ్యక్తి అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దీన్ని వైదిక్ ఖండించారు. వైదిక్‌కు ఆర్ఎస్ఎస్తో సంబంధమే లేదని ఇటీవలే బీజేపీలో చేరిన ఆర్‌ఎస్‌ఎఎస్ నేత రామ్ మాధవ్ చెప్పారు.