మంత్రా మజాకా.. పదవీ రక్షణ పూజలు
చెన్నై : తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో ఓ మంత్రి ఏకంగా పదవీ రక్షణ పూజలు సాగించారు. వరుణ యాగం నినాదం తెర మీదకు తెచ్చినా, వెను వెంటనే పదవీ రక్షణ పూజలు చేయడం గమనార్హం. నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఓఎస్ మణియన్‌కు మంత్రి పదవిని దివంగత సీఎం జయలలిత కేటాయించారు. అమ్మ మరణంతో చిన్నమ్మ శశికళకు విశ్వాసపాత్రుడిగా ఈ మంత్రి ఉన్నారని చెప్పవచ్చు. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్‌కు మద్దతుగా కూడా వ్యవహరించారు. సీఎం పళనిస్వామి శిబిరంతో అంటీఅంటనట్టుగా ఉన్న ఆయన తన పదవికి గండం సృష్టిస్తారేమోనన్న ఆందోళనలో పడ్డట్టుంది.
దీంతో ఆదివారం ఏకంగా 50 మేకపోతుల్ని బలి ఇచ్చి పూజలు చేయడం గమనార్హం. వేదారణ్యంలోని ప్రసిద్ధి చెందిన వేదారణేశ్వరర్ ఆలయంలో వరుణ యాగంకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ యాగంకు మంత్రి, అన్నాడీఎంకే వర్గాలు తప్ప, బయటకు వ్యక్తులు ఎవ్వరు లేరు. ఇక్కడ యాగం అనంతరం నేరుగా మంత్రి మునీశ్వర ఆలయానికి చేరుకుని 50 మేక పోతుల్ని బలి ఇచ్చి, తన బంధువులు, సహచరులకు విందుతో పూజలు సాగించారు. తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో మంత్రి ఈ పూజలు సాగించినట్టుగా చర్చ ఊపందుకుంది.