దైవాన్నే నమ్ముకున్నా!
ఏ వృత్తిలోనైనా రాణించాలంటే ప్రతిభ ఉండాలంటారు. అయితే ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం తోడవ్వాలంటారు మరి కొందరు. అదృష్టం ఉన్నా దైవానుగ్రహం కావాలంటారు ఇంకొందరు. నటి వేదిక ఈ మూడో కోవకు చెందిన వారే. అదృష్టంకన్నా దైవాన్నే నమ్ముతానంటున్న ఈ భామ నటిగా మాత్రం మంచి ప్రతిభాశాలినేనని చెప్పక తప్పదు. ఆ మధ్య వచ్చిన పరదేశి, ఇటీవల తెరపైకి వచ్చిన కావ్య తలైవన్లాంటి చిత్రాలే వేదిక ప్రతిభా పాఠవాలకు నిదర్శనం. ఈ ముద్దుగుమ్మ నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ స్టార్‌గా ఎదగలేకపోయూరు. అయితే తాజాగా ఈమె అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ ఖాతాను ప్రారంభించనున్నారట. అందులో అభిమానులతో ఆమె అనుభవాలు, అనుభూతులు పంచుకోవడంతోపాటు చిత్ర లేఖనాలు, తన చిత్ర విశేషాలు, వీడియో క్లిప్పింగ్స్ లాంటివి పొందుపరచనున్నారట.
దీని గురించి వేదిక తెలుపుతూ తానిప్పటివరకు నటించిన చిత్రాల్లో బాలా దర్శకత్వంలో పరదేశి చిత్రంలో పాత్ర తనకు చాలా నచ్చిందన్నారు. అది నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్ర అని చెప్పారు. అదే విధంగా వసంతబాలన్ దర్శకత్వంలో చేసిన కావ్యతలైవన్ చిత్రంలో వైవిధ్యభరిత పాత్రను పోషించానని తెలిపారు. ఇది 1930 దశాబ్దంలో ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించిన చిత్రమని, దీని కోసం తొలి నాటక నటి సుందరాంబాల్ గురించి, అప్పటి ప్రజల నడవడికలను తెలుసుకోవడానికి ఎక్కువగానే శ్రమించానని వివరించారు.
ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో శివలింగ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. మరో విషయం ఏమిటంటే తాను అదృష్టం కంటే దైవాన్నే పూర్తిగా నమ్ముతానని చెప్పారు. మలయాళ చిత్రాలు నటించడం మొదలెట్టిన తరువాత గురువాయురప్ప భక్తురాలినయ్యానని వెల్లడించారు. అభిమానులు తనకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని వారి చిత్ర లేఖనాలను, వీడియోలను అభిప్రాయాలను తనతో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా వేదిక టాలెంట్ గ్యాలరీ పేరుతో ఫేస్‌బుక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.