Vending Machine
-
ఏటీఎం బ్యాగ్ మెషిన్ భలే బ్యాగుంది
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. నివారిస్తామని ఎన్నేళ్లుగా చెబుతున్నా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. కనీసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను కూడా నిషేధించలేదని దుస్థితి నుంచి జీహెచ్ఎంసీ ప్లాస్టిక్ కట్టడికి ఒక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా క్లాత్బ్యాగుల ఏటీఎం మిషన్‌ను ప్రజల సదుపాయార్థం వినియోగంలోకి తెచ్చింది. ఏ మాల్‌కు వెళ్లినా, ఆఖరుకు వైన్స్ షాప్‌లో సైతం క్యారీబ్యాగ్స్ ఉచితంగా ఇవ్వడం లేదు. ప్లాస్టిక్ నిషేధం పేరిట అసలు బ్యాగ్స్ ఇవ్వడం మానేశారు. కావాలనుకున్నవారికి ఇష్టానుసారం రేట్లతో మందమైన ప్లాస్టిక్ బ్యాగులు కానీ పేపర్బ్యాగులు కానీ అంటగడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే క్లాత్‌బ్యాగులు అందుబాటులో ఉండే ఏటీఎంలను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెస్తోంది. తొలిప్రయత్నంగా కూకట్పల్లి జోన్‌లోని ఐడీపీఎల్ ఫ్రూట్‌మార్కెట్‌లో శనివారం అందుబాటులోకి తెచ్చారు. ఏటీఎం మిషన్‌లో రూ. 10 రూలు వేస్తే క్లాత్‌బ్యాగ్ ఆటోమేటిక్‌గా బయటకు వస్తుంది. నగరంలో ఇంకా ఇలాంటి మిషన్లు అన్నిప్రాంతాల్లో అందుబాటులోకి రావాల్సి ఉంది. తద్వారా ప్లాస్టిక్ ముప్పు తగ్గడమే కాదు.. ప్రజలకు పునర్వినియోగానికి పనికొచ్చే బ్యాగు లభిస్తుంది. ఇది పర్యావరణానికే కాదు.. వీటిని తయారు చేస్తున్న సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళల ఆదాయాన్ని పెంచుతుంది. స్వయం ఉపాధి మెరుగై వారు సాధికారత సాధించేందుకూ ఉపకరించే సా‘ధనం’గా మారనుంది. జీహెచ్ఎంసీ ఇలాంటి మెషిన్లు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనాఉంది. ప్లాస్టిక్ నిరోధానికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ కార్యక్రమమంటూ ఒక్కటి కూడా చేపట్టని జీహెచ్ఎంసీ.. ఈ ఏటీఎం ఏర్పాటుతో ఒక మంచిపని చేసిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి సదుపాయం ఇదే ప్రథమం దేశంలో ఏటా దాదాపు 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. అవి అంతర్థానమయ్యేందుకు దాదాపు వెయ్యేళ్లు పడుతుంది. ప్లాస్టిక్ సమస్యల పరిష్కారానికి, ప్రజల ప్రవర్తనలో మార్పురావడానికి కూరగాయలు, పండ్ల మార్కెట్ల వద్ద ఇలాంటి మెషిన్లు ఏర్పాటు చేసేందుకు మూవేట్ అనే సంస్థ సీఎస్సార్ కింద యునైటెడ్వే ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. సోలార్ ఎనర్జీతో.. ఈ మెషిన్‌కు విద్యుత్ అవసరం లేదు. సోలార్ ఎనర్జీతో పనిచేస్తుంది. సెల్ఫ్హెల్ప్గ్రూప్ మహిళలకు క్లాత్‌ను అందజేస్తారు. వారు దాన్ని బ్యాగులుగా కుట్టి మెషిన్లో ఉంచుతారు. ఈ మెషిన్లో 500 బ్యాగులు పడతాయి. ఒక సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌కు నెలకు దీనివల్ల దాదాపు రూ. 75వేల ఆదాయం లభిస్తుంది. వినియోగదారులకు రీయూజ్కూ ఉపయోగపడుతుంది. సర్క్యులర్ ఎకానమీకి ఉపకరిస్తుంది. ఇందులో పదిరూపాయల నోటు కానీ, కాయిన్ కానీ వేయవచ్చు. యూపీఐ పేమెంట్లకు సైతం సదుపాయం ఉంటుంది. అద్భుతమైన ప్రయత్నం.. ఇది అద్భుతమైన ప్రయత్నమని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.ట్విట్టర్ వేదికగా వీటి ఏర్పాటుకు మూడు నెలలుగా కృషి చేసిన జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(పారిశుద్ధ్యం), కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను అభినందించారు. ప్రస్తుతానికి రెండు మెషిన్లు.. జేఎన్టీయూ రైతుబజార్ దగ్గర కూడా మరొకటి ఏర్పాటుచేస్తున్నాం.రైతుబజార్లోనే ఏర్పాటు చేసేందుకు మార్కెట్ కమిటీ నుంచి అనుమతి రాలేదు. దాంతో మార్కెట్ బయట ఏర్పాటు చేస్తున్నాం. మెషిన్లు ఏర్పాటు చేస్తున్న సంస్థకు, సెల్ఫ్హెల్ప్గ్రూప్లకు మధ్య ఒప్పందం కుదిర్చాం. బ్యాగులు కుట్టిన గ్రూపులు వాటిని మెషిన్లలో ఉంచుతాయి.వారికి రావాల్సిన మొత్తం వారి బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్తుంది. – వి.మమత, కూకట్పల్లి జోనల్ కమిషనర్ Only For 10₹ ATM Jute Bag pic.twitter.com/QW7OrzaQes — Chattam TV (@TvChattam) April 8, 2023 -
రైల్వే శాఖ తొలి వినూత్న ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీః రైలు ప్రయాణీకుల సౌకర్యార్ధం, రైల్వే శాఖ ఒక వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కాఫీ, టీ తదితర వాటికోసం పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే శాఖ ట్విటర్లో ఒక వీడియోను షేర్ చేసింది. ట్యాబ్లెట్ ఆధారంగా ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లు ప్రయాణికులకు సేవలను అందించనున్నాయని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. తద్వారా రైలు ప్రయాణికులు తమకు అవసరమైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటి తినుబండారాలు, శీతల పానీయాలు, కాపీ, టీ, ప్రూట్ జ్యూస్ లను ఈ వెండింగ్ మెషిన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కోయంబత్తూరు-బెంగుళూరు మధ్య నడిచే ఉదయ్ (UDAY ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి) ఎక్స్ ప్రెస్ లోని మూడు బోగీల్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వెండింగ్ మెషిన్ వద్ద వున్న టాబ్లెట్ తో కాఫీ, టీ సహా తమకు కావాల్సిన పదార్ధాలను ఎంపిక చేసుకుని వాటికి సరిపడా నగదు చెల్లించాలి. ప్రస్తుతం నగదు చెల్లింపుదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో వుంది. First ever food vending machine in running train installed in- Coimbatore - Bengaluru UDAY Express over Southern Railway pic.twitter.com/1C2ezhxNiT — Ministry of Railways (@RailMinIndia) June 9, 2018 -
ఎరక్కపోయి ఇరుక్కున్నాడు
మెల్బోర్న్: 'చెంబులో చేయెందుకు పెట్టావ్?' అనే మాట మనల్ని ఇప్పటికీ నవ్విస్తుంటుంది. సరదాగా మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం. మనలాగే ఆస్ట్రేలియాలో ఓ తండ్రి తన కుమారుడిని ఇలాగే ప్రశ్నించాడు. అయితే చెంబులో అని కాకుండా వెండింగ్ మెషిన్లో చెయ్యెందుకు పెట్టావని. ఆస్ట్రేలియాలో బిస్కట్లు, చాక్లెట్లువంటివాటికి ప్రత్యేక వెండింగ్ మెషిన్లు ఉంటాయి. లోన్ స్డేల్ వీధిలోని ఓ కాంప్లెక్స్ వద్ద బిస్కెట్ల వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లిన లియో అనే నాలుగేళ్ల పిల్లాడు మెషిన్ లోపలికి చేయిపెట్టాడు. దాంతో అది కాస్త ఇరుక్కుపోయింది. ఎంతకీ భయటకు రాకపోవడంతో ఏడ్వడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ప్రయత్నించారు. ఫలితం లేకుండాపోయింది. ఆఖరికి అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. చివరకు వెండింగ్ మెషిన్‌ను కట్ చేసి ఆరు గంటల తర్వాత అతడి చేతిని భయటకు తీశారు. అతడు చిన్నపిల్లాడు కావడం, బిస్కెట్లు చూసి ఆకర్షణకు లోనై తెలియక లోపల చేయిపెట్టడం వల్ల ఈ సంఘటన జరిగిందని బాలుడి తండ్రి చెప్పాడు. -
బిస్కెట్ల కోసం చేయి పెట్టి...
మెల్ బోర్న్: ఎదురుగా బిస్కెట్లు ఊరిస్తుంటే ఆబగా అందుకుందామని వెండింగ్ మెషీన్ లో చేయి పెట్టిన ఆసీస్ చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు. ఆరు గంటల తర్వాత ప్రమాదం నుంచి బయటపెట్టాడు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఈ ఘటన చేసుకుంది. నాలుగేళ్ల లియో బిస్కెట్ల కోసం వెండింగ్ మిషన్ లో చేయి పెట్టాడు. బిస్కెట్లు తీసుకునేలోపు అతడి చేయి మిషన్ లో ఇరుక్కుపోయింది. దీంతో లియో బాధతో విలవిల్లాడు. పెద్దగా కేకలు పెట్టాడు. సమాచారం అందుకున్న మెల్ బోర్న్ అగ్నిమాపక సిబ్బంది లొన్స్ డేల్ స్ట్రీట్ లోని మిషన్ వద్దకు చేరుకున్నారు. 6 గంటల పాటు శ్రమించి చిన్నారికి విముక్తి కల్పించారు. తన కుమారుడు వెండింగ్ మిషన్ ను చూడడం ఇదే మొదటిసారని లియో తండ్రి ఆరోన్ షర్తోవుస్ తెలిపారు. బిస్కట్లు, ఇతర తినుబండారాలు మిషన్ లో కనపడడంతో అందులో చేయి పెట్టి ఉంటాడని పేర్కొన్నారు. లియో పెట్టిన కేకలు వీధంతా వినిపించాయని ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారు. లియో సురక్షితంగా ఉన్నప్పటికీ ముందుజాగ్రత్త కోసం అతడిని రాయల్ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారని స్థానిక మీడియా తెలిపింది. -
పండ్ల మీద పన్ను..
కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా పన్నుల మోతకు ఎవరూ అతీతం కాదు. ఆదాయపు పన్ను కావొచ్చు లేదా అమ్మకం పన్ను కావొచ్చు.. ప్రాపర్టీ ట్యాక్సు కావొచ్చు ఏదో ఒక రూపంలో వడ్డన ఉంటూనే ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని దేశాల్లో కొన్ని చిత్ర విచిత్ర పన్నులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని.. వెండింగ్ మెషీన్ ఫ్రూట్ ట్యాక్స్.. తాజా పండ్లు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, అమెరికాలోని కాలిఫోర్నియాలో వెండింగ్ మెషీన్ల నుంచి కొంటే మాత్రం పర్సుకు చేటు చేస్తాయి. ఎందుకంటే.. మెషీన్ల నుంచి తాజా ఫలాలపై కాలిఫోర్నియాలో 33% పన్ను వడ్డిస్తారట. అమెరికాలో టాప్ 10 అసాధారణ పన్నుల్లో ఇది చోటు దక్కించుకుంది. సిగరెట్ల మోత.. సిగరెట్ల మీద భారీ ట్యాక్స్‌లతో ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల గురించి తెలిసిందే. అయితే, చైనాలోని హుబై ప్రావిన్స్ మరో అడుగు ముందుకెళ్లింది. ప్రజలు మరింత ఎక్కువగా సిగరెట్లు తాగేలా ప్రోత్సహించి.. తద్వారా మరింత పన్నులను రాబట్టుకోవడంపై దృష్టి పెట్టింది. సంక్షోభాల నుంచి ఎకానమీ సురక్షితంగా ఉండాలంటే అధికారులు ఏటా 400 కార్టన్ల సిగరెట్లు ఊదిపారేయాలంటూ 2009లో హుబై ప్రావిన్స్‌లోని ఒక గ్రామం ఆదేశించింది. టీచర్లకు కూడా స్మోకింగ్ కోటా విధించింది. టార్గెట్లు అందుకోకపోయినా.. పక్క రాష్ట్రాల కంపెనీల సిగరెట్లు తాగుతూ పట్టుబడినా జరిమానాలతో వాతలు పెట్టింది. టాటూలపై ట్యాక్స్ అమెరికాలోని ఆర్కాన్సాస్ ప్రభుత్వం 2005లో టాటూలపైనా ట్యాక్స్ విధించి ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రోలసిస్ ట్రీట్మెంట్ను కూడా ఇందులోకి చేర్చింది. -
మెట్రో స్టేషన్లలో కండోమ్‌ల విక్రయం!
న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్లలో ఇక నుంచి ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. వివిధ మెట్రో స్టేషన్లలో వెండింగ్ మెషీన్ల ద్వారా ఇవి ప్రయాణికులకు అందేలా మెట్రో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేరళకు చెందిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ సహాకారంతో దీనికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన స్టేషన్లలో వెండింగ్ మెషీన్లలో శానిటరీ నాప్కిన్స్, గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లు, అయుర్వేదిక ఉత్పత్తులు ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 21 మెట్రో స్టేషన్లలో తొలి విడతలో 25 వెండింగ్ మెషీన్లు అమరుస్తామని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ చైర్మన్ ఎం.అయ్యప్పన్ తెలిపారు. భారత కరెన్సీ నోట్లు, బిల్లలు మెషీన్లలో ఇన్సర్ట్ చేస్తే ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు వస్తాయన్నారు.