సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. నివారిస్తామని ఎన్నేళ్లుగా చెబుతున్నా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. కనీసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను కూడా నిషేధించలేదని దుస్థితి నుంచి జీహెచ్‌ఎంసీ ప్లాస్టిక్ కట్టడికి ఒక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా క్లాత్‌బ్యాగుల ఏటీఎం మిషన్‌ను ప్రజల సదుపాయార్థం వినియోగంలోకి తెచ్చింది. ఏ మాల్‌కు వెళ్లినా, ఆఖరుకు వైన్స్ షాప్‌లో సైతం క్యారీబ్యాగ్స్ ఉచితంగా ఇవ్వడం లేదు. ప్లాస్టిక్ నిషేధం పేరిట అసలు బ్యాగ్స్ ఇవ్వడం మానేశారు. కావాలనుకున్నవారికి ఇష్టానుసారం రేట్లతో మందమైన ప్లాస్టిక్ బ్యాగులు కానీ పేపర్‌బ్యాగులు కానీ అంటగడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే క్లాత్‌బ్యాగులు అందుబాటులో ఉండే ఏటీఎంలను జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తెస్తోంది.
తొలిప్రయత్నంగా కూకట్‌పల్లి జోన్‌లోని ఐడీపీఎల్ ఫ్రూట్‌మార్కెట్‌లో శనివారం అందుబాటులోకి తెచ్చారు. ఏటీఎం మిషన్‌లో రూ. 10 రూలు వేస్తే క్లాత్‌బ్యాగ్ ఆటోమేటిక్‌గా బయటకు వస్తుంది. నగరంలో ఇంకా ఇలాంటి మిషన్లు అన్నిప్రాంతాల్లో అందుబాటులోకి రావాల్సి ఉంది. తద్వారా ప్లాస్టిక్ ముప్పు తగ్గడమే కాదు.. ప్రజలకు పునర్వినియోగానికి పనికొచ్చే బ్యాగు లభిస్తుంది. ఇది పర్యావరణానికే కాదు.. వీటిని తయారు చేస్తున్న సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళల ఆదాయాన్ని పెంచుతుంది. స్వయం ఉపాధి మెరుగై వారు సాధికారత సాధించేందుకూ ఉపకరించే సా‘ధనం’గా మారనుంది. జీహెచ్‌ఎంసీ ఇలాంటి మెషిన్లు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనాఉంది. ప్లాస్టిక్ నిరోధానికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ కార్యక్రమమంటూ ఒక్కటి కూడా చేపట్టని జీహెచ్‌ఎంసీ.. ఈ ఏటీఎం ఏర్పాటుతో ఒక మంచిపని చేసిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ఇలాంటి సదుపాయం ఇదే ప్రథమం
దేశంలో ఏటా దాదాపు 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. అవి అంతర్థానమయ్యేందుకు దాదాపు వెయ్యేళ్లు పడుతుంది. ప్లాస్టిక్ సమస్యల పరిష్కారానికి, ప్రజల ప్రవర్తనలో మార్పురావడానికి కూరగాయలు, పండ్ల మార్కెట్ల వద్ద ఇలాంటి మెషిన్లు ఏర్పాటు చేసేందుకు మూవేట్ అనే సంస్థ సీఎస్సార్ కింద యునైటెడ్‌వే ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది.
సోలార్ ఎనర్జీతో..
ఈ మెషిన్‌కు విద్యుత్ అవసరం లేదు. సోలార్ ఎనర్జీతో పనిచేస్తుంది. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూప్ మహిళలకు క్లాత్‌ను అందజేస్తారు. వారు దాన్ని బ్యాగులుగా కుట్టి మెషిన్‌లో ఉంచుతారు. ఈ మెషిన్‌లో 500 బ్యాగులు పడతాయి. ఒక సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌కు నెలకు దీనివల్ల దాదాపు రూ. 75వేల ఆదాయం లభిస్తుంది. వినియోగదారులకు రీయూజ్‌కూ ఉపయోగపడుతుంది. సర్క్యులర్ ఎకానమీకి ఉపకరిస్తుంది. ఇందులో పదిరూపాయల నోటు కానీ, కాయిన్ కానీ వేయవచ్చు. యూపీఐ పేమెంట్లకు సైతం సదుపాయం ఉంటుంది.
అద్భుతమైన ప్రయత్నం..
ఇది అద్భుతమైన ప్రయత్నమని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.ట్విట్టర్ వేదికగా వీటి ఏర్పాటుకు మూడు నెలలుగా కృషి చేసిన జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(పారిశుద్ధ్యం), కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమతను అభినందించారు.
ప్రస్తుతానికి రెండు మెషిన్లు..
జేఎన్‌టీయూ రైతుబజార్ దగ్గర కూడా మరొకటి ఏర్పాటుచేస్తున్నాం.రైతుబజార్‌లోనే ఏర్పాటు చేసేందుకు మార్కెట్ కమిటీ నుంచి అనుమతి రాలేదు. దాంతో మార్కెట్ బయట ఏర్పాటు చేస్తున్నాం. మెషిన్లు ఏర్పాటు చేస్తున్న సంస్థకు, సెల్ఫ్‌హెల్ప్‌గ్రూప్‌లకు మధ్య ఒప్పందం కుదిర్చాం. బ్యాగులు కుట్టిన గ్రూపులు వాటిని మెషిన్లలో ఉంచుతాయి.వారికి రావాల్సిన మొత్తం వారి బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్తుంది.
– వి.మమత, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్
Only For 10₹ ATM Jute Bag pic.twitter.com/QW7OrzaQes
— Chattam TV (@TvChattam) April 8, 2023
Comments
Please login to add a commentAdd a comment