పిడుగు కాటు
అరండల్‌పేట(గుంటూరు) : జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన చెందిన బండారు ఆనందరావు(చిన్నోడు, 50) పశుగ్రాసం తీసుకువచ్చేందుకు పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఒక్కసారిగా పిడుగుపడటంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే ఉన్న గొల్లపూడి మధు, అనపర్తి దానియేలు, మందా నాగమేల్లేశ్వరి, మందా మనీషా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అదేవిధంగా చేబ్రోలులో గౌడపాలేనికి చెందిన ఉయ్యూరు వెంకటనారాయణ(60) పొలానికి వెళ్లగా పిడుగుపాటుకు మృతి చెందారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామానికి చెందిన పిన్నక శివరాంబాబు(60) హరిశ్చంద్రాపురంలోని తన పొలంలో దమ్ము పనులు జరుగుతుండగా పరిశీలించడానికి వెళ్లారు. అన్న వెంకటేశ్వర్లు దమ్ముచేస్తుండగా ఆయన గొడుగుతో పొలంగట్టుపై నిల్చొని ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో శివన్నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.
తప్పిన పెను ప్రమాదం..
మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ - త్రిపుర అండర్-19 మహిళల జట్ల ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిపివేసి క్రీడాకారులంతా డ్రస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం సుమారు 2.15 గంటల సమయంలో డ్రస్సింగ్రూమ్కు వందమీటర్ల దూరంలో ఉన్న ఓ తాడిచెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి క్రీడాకారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అలాగే జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్లలో కుండపోత వర్షం కురిసింది. దీంతో గోళ్ళపాడు ప్రధాన ర హదారిపై నీరు నిలిచిపోయింది. తెనాలి పట్టణం, రూరల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలాగే చేబ్రోలు మండలం నారాకోడూరు, గుండవరం, గొడవర్రు తదితర గ్రామాల్లోని దొండ, కాకర, చిక్కుడు పందిరి తోటలు కూలిపోయాయి. దీంతో కూరగాయ రైతులకు వేలాది రూపాయిల పంట నష్టం చేకూరింది. కొత్తరెడ్డిపాలెం సెంటర్లోని వందేళ్ల చరిత్ర ఉన్న మహావృక్షం ఈదురుగాలులకు వేళ్లతో సహా కూలిపోయింది. గుంటూరు నగరంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైన్లుపొంగి ప్రవహించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.