అల్లూరి జిల్లాగా మార్చకుంటే నిరవధిక దీక్ష
అల్లూరి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రరావు హెచ్చరిక
నామమాత్రంగా పార్కు అభివృద్ధిపై అసంతృప్తి
గొలుగొండ: విశాఖ జిల్లాను అల్లూరి జిల్లాగా మార్చుతూ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో త్వరలో అల్లూరి పార్కులో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఆయన ఆదివారం కేడిపేటలో విలేకరులతో మాట్లాడుతూ, అల్లూరి పార్కును కోట్లాది రుపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం 20 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. దీనివల్ల పార్కు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని అసంతృప్తి వ్యక్తంచేశారు.
మాట ఇచ్చి తప్పారు
విశాఖ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని గత ఏడాది ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే, దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, దీక్ష విరమింపజేశారని గుర్తుచేశారు. తరువాత ఈ విషయం ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. త్వరలో మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సమయంలో మంప ప్రాంతంలో ఉన్న రహస్య గృహాలను అభివృద్ధి చేయాలని, అల్లూరి జయంతినే కాకుండా వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని కోరారు. కేడిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు మైత్రీ గంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ గుర్తించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.