రైతుల ఆత్మహత్యలతో ఏం సంబంధం?
న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ పడదు? పడితే ఎన్ని మిల్లీ మీటర్లు పడుతుంది, ఎన్ని సెంటీమీటర్లు పడుతుందీ.. అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)కన్నా కచ్చితంగా లెక్కేసి చెప్పగలమని చెప్పుకుంటున్న భారత వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేసే కంపెనీ 'స్కైమెట్' తాజాగా తీసిన వీడియో యాడ్‌పై వివాదం రాజుకుంటోంది. కంపెనీ వాణిజ్య ప్రకటన కోసం రైతుల ఆత్మహత్య సంఘటనలను సందర్భ శుద్ధిలేకుండా వాడుకుందన్నది ప్రధాన విమర్శ.
అందులో బడికెళ్లే ఓ పాప ప్రతి రోజు తండ్రి వెనకాలే ఆయనకు తెలియకుండా పొలందాక వెళ్లి తండ్రి పొలం పనులు చేసుకుంటున్నాడా లేక ఉరేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా? అన్న విషయాన్ని గమనిస్తుంటుంది. తండ్రి పొలం పనుల్లో నిమగ్నమయ్యాక అమ్మయ్యా, ఈ రోజుకు ఏంకాదులే అనుకొని బడికి వెళ్తుంది. ఇంట్లో తాడు కనిపిస్తే తండ్రి ఎక్కడ ఉరేసుకుంటాడేమోనని దాన్ని తీసి దాచి పెడుతుంది. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా తాను దాచి పెట్టిన తాడు కనిపించదు. అనుమానంతో పొలానికి పరుగెత్తుకెళుతోంది. అక్కడ చెట్టుకు తాడు కడుతూ తండ్రి కనిపిస్తాడు. ఆపుకోలేని దు:ఖంతో పరుగెత్తి తండ్రి ఒల్లో వాలుతుంది. చివరకు ఆ తాడును తనకోసం కట్టిన ఊయలగా గ్రహించి ఊపిరి పీల్చుకుంటుంది. దేశంలో గత 20 ఏళ్ల కాలంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే లెక్కలతో ఆ యాడ్ ముగుస్తుంది.
ఆ యాడ్‌లో తన తండ్రి ఏ రోజున ఆత్మహత్య చేసుకుంటాడో అన్న భయాందోళనల మధ్య ఆ పాప ప్రతి రోజు బతుకుతుందన్నదే ప్రధానాంశంగా కనిపిస్తుంది. ఏ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని ఈ యాడ్ రూపొందించారన్న విషయం అర్థం కాదు. వర్షాలు పడక, పంటలు ఎండిపోతే, అకాల వర్షాల వల్ల పంటనష్టం జరిగితే.. అందుకు ఎవరు బాధ్యులు? వాతావరణ పరిస్థితులను తెలుసుకోకపోవడం వల్లనే ఈ నష్టం జరిగిందా? అకాల వర్షాలు పడతాయన్నది ముందే తెలిస్తే రైతులు సరైన ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఈ దేశంలో ఉందా? ఈ 20 ఏళ్ల కాలంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయకపోవడమే కారణమా ?