Video Creation
-
క్రియేటర్లకు యూట్యూబ్ భారీ షాక్!
క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ భారీ షాకిచ్చింది. చాట్‌జీపీటీ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుంటున్న పలువురు వీడియో క్రియేటర్లు ఏఐ సాయంతో వీడియోలు చేస్తున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై యూట్యూబ్ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఏఐ యాప్స్‌తో చేసే కంటెంట్‌కు యూట్యూబ్‌లో చోటు లేదని స్పష్టం చేసింది. వీడియోల నుంచి ఏఐ ఇమేజెస్ వరకు యూట్యూబ్ వీడియోల్లో వినియోగించడానికి వీలు లేదని తెలిపింది. ఇందుకోసం కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏఐ ఫోటోలు, వీడియోల్ని వినియోగిస్తే సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు తప్పని సరిగా ఈ కంటెంట్ ఏఐతో చేసినట్లు తెలపాలి. లేదంటే ఆయా వీడియోలను తొలగించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యూట్యూబ్ బ్లాగ్‌లో మార్గదర్శకాలపై సమాచారం ఇచ్చింది. యూజర్లు కంటెంట్ వీక్షిస్తున్న సందర్భంలో ఈ కంటెంట్‌ను ఏఐ సహాయంతో సృష్టించినట్లు చెబుతుందని పేర్కొంది. డిస్క్రిప్షన్లో ఏఐ లేబుల్‌కు ఆప్షన్ ఉంటుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలను పాటించని కంటెంట్ క్రియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంటెంట్‌ను తొలగించడంతో పాటు ఆయా ఛానెల్స్‌కు సంబంధించి మానిటైజేషన్ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. -
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
రైజెన్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా నిందితులు వీడియో రికార్డు చేశారని పోలీసులు బుధవారం వెల్లడించారు. తన సోదరికి సాయం చేసేందుకు 10వ తరగతి చదువుతున్న బాధితురాలు గుంగాకు వెళ్లింది. ఆమె సోదరి ఆస్పత్రిలో ఉండగా, బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో తమ బంధువు ఉన్నాడా అంటూ ఓ వ్యక్తి ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు మరో ఇద్దరితో కలసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటననంతా నిందితులు కలసి వీడియో కూడా తీశారు. బాలిక తిరిగి తన ఇంటికి వచ్చాక తండ్రికి ఈ విషయం చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
అదిరిపోయే వీడియో ఎడిటింగ్ యాప్స్ మీకోసం..
పిండి కొద్ది రొట్టెలాగే... టెక్నాలజీ కొద్ది వీడియో! టెక్నాలజీతో ‘బొమ్మ అదిరిపోయింది’ అనిపించడానికి బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకొని మీ వీడియోలకు సాన పెడితే ‘శబ్భాష్’ అనిపించుకోవడం ఎంతసేపని! వీడియో ఎడిటింగ్‌కు మీరు కొత్త అయితే ‘ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్’ బెటర్. ‘క్రియేట్ - ఎడిట్- ఆర్గనైజ్ -షేర్ యువర్ వీడియోస్’ అంటున్న ఎడోబ్ ప్రీమియర్ ఎలిమెంట్స్‌కు ఈజీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా పేరుంది. స్టెప్-బై-స్టెప్ తెలుసుకోవచ్చు. సెకండ్ల వ్యవధిలో వీడియోలను షార్ప్‌గా తీర్చిదిద్దవచ్చు. పర్ఫెక్ట్లెంత్తో మ్యూజిక్‌ను సెట్ చేయవచ్చు. ‘ఫైనల్ కట్ ప్రో’ను ప్రొఫెషనల్ టూల్‌గా చెబుతుంటారు. టాప్ యూట్యూబర్స్ దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. లాంగ్ టర్మ్ యూట్యూబర్స్కు ఎక్కువగా ఉపయోగపడే ‘ఫైనల్ కట్’లో ఫిల్టర్స్, మల్టీఛానెల్ ఆడియో టూల్స్, అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్ ఫీచర్లు ఉన్నాయి. మొబైల్‌ఫోన్ ఉపయోగించే సోషల్ మీడియా వీడియో క్రియేటర్స్ కోసం ‘ఎడోబ్ యాప్ ప్రీమియర్ రష్’ ఉపయోగపడుతుంది. వాయిస్ అండ్ మ్యూజిక్ మధ్య సౌండ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసే ‘ఆటో డకింగ్’ సదుపాయం అందుబాటులో ఉంది. ఆకట్టుకునే మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్స్ ఉన్నాయి. ‘షాట్‌కట్’ సాఫ్ట్‌వేర్‌తో సులభంగా వీడియోలు ఎడిట్ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన వీడియో, ఆడియో టూల్స్, 4కే లాంటి వైడ్‌రేంజ్ ఫార్మట్స్ ఉన్నాయి. ‘వీమియో’ అనేది బెస్ట్ ఏఐ-అసిస్టెడ్ ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనిపించుకుంది. వేలాది ఫోటోలు, వీడియోలు ఉన్న స్టాక్లైబ్రరీతో యాక్సెస్ కావచ్చు, లైసెన్స్డ్ మ్యూజిక్ లైబ్రరీ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడుకోవచ్చు. ‘ఇన్వీడియో’ అనేది ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్. సోషల్ మీడియా కోసం మాత్రమే కాకుండా కంపెనీ వెబ్సైట్ల కోసం ఆకట్టుకునేలా వీడియోలు క్రియేట్ చేయవచ్చు. అయిదువేలకు పైగా ప్రీ-మేడ్ టెంప్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్రీస్టాక్ లైబ్రరీ నుంచి ఫోటో,వీడియోలు,మ్యూజిక్‌ను ఉపయోగించవచ్చు. టెక్స్ - టు - వీడియో టూల్లాంటి స్రై్టకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ‘వుయ్వీడియో’ అనేది క్లౌడ్-బేస్డ్ ఆన్లైన్ ఎడిటర్. స్టాక్వీడియో లైబ్రరీ నుంచి వేలాది ఇమెజెస్, వీడియోలు, మ్యూజిక్‌తో యాక్సెస్ కావచ్చు. గ్రీన్‌స్క్రీన్, స్క్రీన్ రికార్డింగ్, కలర్గ్రేడింగ్... మొదలైన అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్స్‌తో వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు. స్లైడ్షోలు,ప్రచారయాత్రలతో పాటు సోషల్ మీడియాలో మార్కెటింగ్ వీడియోలు క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్ వీడియో మేకర్ బైటబుల్. స్టన్నింగ్ టెంప్లెట్స్ దీని సొంతం. వీడియోలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి హై రిజల్యూషన్‌తో కూడిన ఫోటోలు, స్టాక్వీడియోలు ఉన్నాయి. ఇక మీరు రెడియా! త్రినేత్రం అనుభవాన్ని మించిన జ్ఞానం ఏంఉంటుంది! తన అపారమైన అనుభవంతో అమెరికన్ ఫిల్మ్ఎడిటర్, డైరెక్టర్, సౌండ్ డిజైనర్ వాల్టర్ మర్చ్ ‘ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐ’ అనే మంచి పుస్తకం రాశారు. వీడియో లేదా ఫిల్మ్ ఎడిటింగ్‌కు సంబంధించి బోలెడు విషయాలు తెలుసుకోవచ్చు. డిజిటల్ ఎడిటింగ్‌లో వచ్చిన మార్పులు, డిజిటల్ ఎడిటింగ్ ఉపయోగాలు, పరిమితులు...మొదలైనవి తెలుసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం ఇది. -
టిక్‌టాక్.. తీసింది ప్రాణం!
హోసూరు: టిక్‌టాక్‌లో పేరుపొందాలనే తపనతో వినూత్నంగా విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టిక్‌టాక్ వీడియో తీస్తూ ప్రాణంతో ఉన్న చేపను మింగిన యువకుడు ఊపిరాడక చనిపోయిన సంఘటన గురువారం కర్ణాటక రాష్ట్రం హోసూరులో చోటు చేసుకొంది. హోసూరులోని కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన శరవణన్ కొడుకు వెట్రివేల్(22) డిగ్రీ విద్యార్థి. టిక్‌టాక్‌లో ప్రదర్శన కోసం ప్రాణంతో ఉన్న చేపను మింగాడు. అది గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక గిలగిల్లాడుతున్న వెట్రివేల్‌ను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ఫేస్ బుక్ లో సరికొత్త వీడియో క్రియేషన్ ఆప్షన్!
న్యూయార్క్: జీవితంలోని మధుర అనుభూతుల్ని, సంఘటనల్ని వీడియోల ద్వారా పంచుకోవడానికి వినియోగదారులకు 'వీడియో క్రియేషన్' టూల్ ను ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. తాము పోస్ట్ చేసిన సందేశాల్ని, ఫోటోలను, కొత్త థీమ్స్ ను కలిపి వ్యక్తిగతంగా ఓ వీడియో రూపొందించుకోవడానికి 'సే థ్యాంక్స్' అనే కొత్త ఆప్షన్ ను ప్రారంభించింది. తమ వ్యక్తిగత, మిత్రుల టైమ్ లైన్స్ పై వీడియోలను షేర్ చేసుకోవడానికి వినియోగదారులకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఫేస్ బుక్ లో www. facebook.com/thanks పేజికి వెళ్లి వీడియోను రూపొందించుకోవచ్చు. వ్యక్తులతో ఉన్న బంధాలు, సంబంధాలకు అనుగుణంగా ఫోటోలను ఎడిట్ చేసుకోవడానికి, వివిధ థీమ్స్ లలో వీడియోను రూపొందించుకోవడానికి కూడా ఫేస్ బుక్ అవకాశం కల్పించింది. వీడియోను రూపొందించిన తర్వాత పర్సనల్ మెసేజ్ ను కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంది. కొత్త ఆప్షన్ ఇంగ్లీష్, ఫ్రాన్స్, జర్మన్, ఇండోనేషియా, ఇటలీ, పోర్చుగీస్, స్పానిష్, టర్కీ దేశాల్లో డెస్క్ టాప్, మొబైల్ ద్వారా ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది.