విన్నపాలు వినవలె..
ఒంగోలు కలెక్టరేట్ : అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 24 గంటల్లోపు ఫీజు బోర్డులు ఉంచాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజుల పేరిట పేద, మధ్య తరగతి ప్రజల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న విషయమై బీసీ సంక్షేమ సాధన సమితి నాయకులు, పీపుల్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
స్పందించిన కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో జీఓ నం- 42 ప్రకారం తమ విద్యా సంస్థల ప్రాంగణంలో మూడు ప్రధాన చోట్ల ఫీజుల వివరాలు తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఎక్కడైనా బోర్డులు ఏర్పాటు చేయకుంటే సంబంధిత స్కూల్స్‌కు నోటీసులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్‌ను ఆదేశించారు.
ఉద్యోగం ఇవ్వాలి
తాను విధి నిర్వహణలో ఉండగా పక్షవాతం వచ్చి మంచానికే పరిమిత మ య్యానని, ఈ నేపథ్యంలో తన కుటుం బం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టోందని, తన ఉద్యోగాన్ని తన కుమారునికి ఇవ్వాలని హెడ్ కానిస్టేబుల్ బోడిపోగు అంకయ్య వేడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను భుజాలపై కలెక్టర్ వద్దకు మోసుకువచ్చారు. ఎస్పీ కార్యాలయంలో అడిగితే తిప్పుకుంటున్నారని వాపోయాడు.
ఎన్నికల ‘నగదు’ ఇప్పించాలి
ఎన్నికల విధులు నిర్వర్తించిన తమకు నగదు ఇప్పించాలని కనిగిరి నియోజకవర్గ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఇటీవల జరిగిన మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో 14 మంది వీడియోగ్రాఫర్లుగా సేవలు అందించారన్నారు. ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ నిర్వహణ తదితర విధులు కూడా నిర్వర్తించామన్నారు. నగదు గురించి నియోజకవర్గ ఏఆర్ఓ, కనిగిరి తహశీల్దార్ మల్లికార్జునరావు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు.
పింఛన్ల కోసం పండుటాకులు
నెలనెలా వచ్చే రెండు వందల రూపాయల పింఛన్‌ను ఆ వృద్ధులు మహాభాగ్యంగా భావిం చారు. నాలుగు నెలల నుంచి పింఛన్లు నిలిచిపోయాయి. అదేమని అడిగితే ఏమేమో చెబుతున్నారు. ఏమిచేయాలో పాలుపోని ఆ పండుటాకులు సోమవారం ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ప్రజా దర్బార్‌కు అతి కష్టం మీద వచ్చారు. అధికారులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనీయకుండా తాము పరిష్కరిస్తామని రాజకీయ నాయకుల మాదిరిగా హామీ గుప్పించి వెనక్కు పంపించేశారు. అంతకు ముందు ఆ పండుటాకులు విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీకారంకాలనీ, అన్నవరప్పాడు, కమ్మపాలెంతో పాటు మరికొన్ని కాలనీలకు చెందిన ఇరవైమంది వృద్ధ మహిళలు చేతుల్లో పింఛన్ పాస్ పుస్తకాలను పట్టుకొని వచ్చారు.
ఆ లిస్ట్ నడిచి రావాలా?
వృద్ధాప్య పింఛన్ల కోసం వచ్చిన వారిని తెలివిగా పంపించామన్న ఆనందం అధికారులకు లేకుండా పోయింది. పెద్ద సంఖ్యలో వచ్చిన వృద్ధ మహిళలను వెనక్కు పంపించామని సంబరపడిపోతున్న తరుణంలో ఒకరిద్దరు కలెక్టర్‌ను కలిసి పింఛన్లు ఆగిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ పింఛన్లు ఆగిపోతే ఏమి చేస్తున్నారని డీఆర్డీఏ పీడీ పద్మజ, నగర పాలక సంస్థ కమిషనర్‌ను నిలదీశారు. బ్యాంకు నుంచి లిస్ట్ రావాల్సి ఉందని కమిషనర్ విజయలక్ష్మి చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. ఆ లిస్ట్ నడిచి రావాలా, తెప్పించుకోవాల్సిన బాధ్యత మీపైలేదా.. అని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.