సీటివ్వకపోతే చచ్చిపోతా..!
తాడేపల్లిగూడెం/తణుకు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ ఏలూరు(టూటౌన్)/గోకవరం: పదేళ్లపాటు టికెట్ ఇస్తానని నమ్మబలికి ఇప్పుడు తణుకు టికెట్‌ను పొత్తులో టీడీపీకి కేటాయించడం న్యాయం కాదని, తనకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు హెచ్చరించారు. టికెట్ కేటాయింపుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో ఆయన సోమవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్‌తోపాటు ఇతర నాయకులు చేపట్టిన బుజ్జగింపులు ఫలించలేదు.
తనకు సీటు కేటాయించకపోవడంపై సోమవారం రాత్రి మనోహర్‌ను ప్రశ్నించేందుకు ఆయన బస చేసిన గెస్ట్‌హౌస్‌కు నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లిన విడివాడను మనోహర్ కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విడివాడ తణుకు వెళ్లిపోయారు. తొలుత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. తణుకు టికెట్‌ను పవన్ గతంలో హామీ ఇచ్చిన విధంగా విడివాడ రామచంద్రరావుకు కాకుండా టీడీపికి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో రగిలిపోతున్న జనసేన కార్యకర్తలు, నాయకులు జనసేన పీఏసీ చైర్మన్ మనోహర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
పెంటపాడు మండలం అలంపురం సమీపంలోని జయా గార్డెన్లో ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన జనసేన, టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఈ క్రమంలో తణుకు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కన్వినర్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన బస చేసిన గెస్ట్‌హౌస్‌ని ముట్టడించారు. మనోహర్ బయటికి రావాలని, విడివాడకు న్యాయం చేయాలంటూ నినాదాలిచ్చారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో లోపల ఉన్న మనోహర్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రగిలిపోయిన శ్రేణులు తోపులాటకు దిగాయి. ఆ పార్టీ జిల్లా స్థాయి నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినా శ్రేణుల ఆగ్రహం చల్లారలేదు.
ఈ క్రమంలో సహనం నశించిన కార్యకర్తలు గెస్ట్‌హౌస్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడానికి యత్నించారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను శాంతింపజేసేందుకు పార్టీ నేతలు బొలిశెట్టి శ్రీను, కొటికలపూడి గోవిందరావు తదితరులు ప్రయత్నించినా ఎవ్వరూ లెక్కచేయలేదు. ఈ సందర్భంగా విడివాడ మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ పంచాయితీని తణుకులోనే తేల్చుకుంటామని తన అనుచరులతో కలసి వెనుదిరిగారు. అనంతరం మనోహర్ సూచనలతో జిల్లా నాయకులు తణుకు చేరుకొని రాత్రి తొమ్మిది గంటల సమయంలో విడివాడ గెస్ట్ హౌస్‌కు తీసుకొచ్చారు. పదేళ్లపాటు జనసేన టికెట్ ఇస్తామని నమ్మబలికి చివరికి టికెట్ల పంపకాల్లో మొండిచేయి చూపడంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ ప్లెక్సీలను చించేస్తూ జనసేన అధినేత పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ
పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు నన్ను కాదని మరో వ్యక్తికి తణుకు టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన విడివాడ మండపాక గ్రామ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో తనను కాదని మరో వ్యక్తికి టిక్కెట్ ఇచ్చినా సహించానని, పదేళ్లుగా రూ. కోట్లు ఖర్చు పెట్టానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు.
పార్టీ కోసం కష్టపడిన నాయకుడిని పక్కన పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తే సహకరిస్తామని, అంతే తప్ప తెలుగుదేశం జెండా మోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జనసేన పార్టీకి సంబంధం లేని వారిని టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తనతో పాటు తిప్పుకోవడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. మరోవైపు నెల్లూరులో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. నెల్లూరు సిటీ లేదా నెల్లూరు రూరల్ సీటు ఇస్తారని ఆశ పెట్టుకున్న మనుక్రాంత్‌రెడ్డికి పవన్ కళ్యాణ్ పెద్ద షాకిచ్చారు.
పవన్‌కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని టికెట్ వస్తుందని ఆశిస్తే అన్యాయం చేశారని మండిపడుతున్నారు. సోమవారం నెల్లూరులోని మినీబైపాస్‌లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు మాయలోపడి పవన్ మోసపోయాడని వారు మండిపడ్డారు. టీడీపీకి ఓటేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ నిరసన సమయంలో మనుక్రాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు.
రెడ్డి అప్పలనాయుడు కన్నీటిపర్యంతం
పొత్తులో భాగంగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. దీనిపై జనసేన, టీడీపీ నేతలు వపన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి సీటును జనసేనకు కేటాయించాలని జనసేన పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య కేడర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మాకు న్యాయం చేయాలి’, ‘రెడ్డి అప్పలనాయుడుకు సీటు ఇవ్వాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అవసరమైతే జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు రెబల్‌గా పోటీలో నిలవాలంటూ నినదించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్‌ను టీడీపీకి కేటాయించడం పట్ల ఏలూరు నియోజకవర్గ జనసైనికులు అసంతృప్తికి లోనయ్యారన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే జనసేన పార్టీకి అత్యధికంగా బలం ఉన్న నియోజకవర్గం ఏలూరు అని సర్వేలో మొదటి స్థానం వచ్చిన ఏలూరు సీటుపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని కోరారు.
రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినాయకత్వం స్పందించని పక్షంలో ఏం చేయాలనే దానిపై కార్యాచరణ ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా ఏడుగురు సభ్యులతో కమిటీని వేశారు. గత ఐదున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమించిన రెడ్డి అప్పలనాయుడుకు పొత్తుల పేరుతో మొండిచేయి చూపడాన్ని పార్టీ కార్యకర్తలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కార్యకర్తల సమావేశం నుంచి లోపలికి వెళుతూ కన్నీరు పెట్టుకున్నారు.
దీన్ని చూసిన జనసైనికులు పెద్దగా నినాదాలు చేశారు. కార్యాలయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఉన్న ఫ్లెక్సీల్లోని చంద్రబాబు ఫొటోలను చించేశారు. కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించి, తనకు అన్యాయం చేయడంపై జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర గోకవరం మండలంలోని అచ్యుతాపురం కనకదుర్గమ్మ ఆలయం వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షా శిబిరాన్ని సోమవారం వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులను పరామర్శించారు.