శాఖల మార్పుపై జయ సంతకం చేశారా?
గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రకటనపై కరుణానిధి ఆశ్చర్యం
చెన్నై: ఆస్పత్రిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సూచన మేరకు.. ఆమె నిర్వహిస్తున్న శాఖలను ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తున్నట్లు గవర్నర్ విద్యాసాగర్‌రావు పేర్కొనడంపై డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జయ నిజంగానే తన శాఖలను పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తూ ఫైల్‌పై సంతకం చేశారా? అని కొందరు ప్రజల్లో ప్రశ్న తలెత్తుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, పోర్ట్పోలియోల మార్పును డీఎంకే కోశాధికారి, కుమారుడు స్టాలిన్ స్వాగతించిన తర్వాత కరుణానిధి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాహుల్‌గాంధీ, తన కుమారుడు స్టాలిన్ తదితరులకు ఆస్పత్రిలో ఉన్న జయను చూసే అవకాశం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం శాఖలను బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేసమయంలో గవర్నర్ రాజ్యాంగంలోని నిబంధనల మేరకే శాఖల బదలాయింపు నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు.