vigilant
-
సదా అప్రమత్తంగా ఉండండి
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఎల్లప్పుడూ అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఉదాసీనతకు చోటులేకుండా సవాళ్ల పట్ల జాగరూకత వహించాలన్నారు. పటిష్ట బ్యాంకింగ్‌కు సంబంధించి నిరంతర పరస్పర చర్యల్లో భాగంగా గవర్నర్ కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు. ఫైనాన్షియల్ విధుల నిర్వహణలో భారత్ బ్యాంకింగ్ చక్కటి పురోగతి సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. అయితే చక్కటి బ్యాలెన్స్ సీట్స్ నిర్వహణ, వ్యక్తిగత రుణాలపై పర్యవేక్షణ, సహ–రుణ మార్గదర్శకాలను పాటించడం, ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల అందజేత, ద్రవ్య లభ్యత సవాళ్లు, ఐటీ– సైబర్ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల పటిష్ట నిర్వహణ, డిజిటల్ మోసాల నివారణ వంటి అంశాలపై అన్ని సమయాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంటూ... ఫైనాన్షియల్ వ్యవస్థ రక్షణ, స్థిరత్వలో ఇది కీలకమని అన్నారు. ఆర్బీఐ ఫిన్‌టెక్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి బ్యాంకులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్‌రావు, స్వామినాథన్సహా నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. -
ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది. ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌తో బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల చెరువుల నుంచి కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరింది. దీంతో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నిండు కుండల్లా ఉన్న చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున గండ్లు పడటం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని అన్ని చెరువులను, కట్టల పరిస్థితిని పరిశీలించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రమాదానికి ఆస్కారమున్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. -
సైబర్ వల.. కేవైసీ అప్డేట్ అంటూ..
గుంటూరు నగరానికి చెందిన రవికి గత నెలలో ఓ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘మీ కేవైసీ సమాచారం అప్డేట్ చేసుకోండి’ అంటూ అందులో ఉంది. వివరాల కోసం ఫోన్ చేయమని మెసేజ్‌లో సూచించిన నంబర్‌కు రవి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసిన వ్యక్తి పేటీఎం యాప్ వివరాలు అడిగాడు. అవతలి వ్యక్తి అడిగిన వివరాలన్నింటినీ చెప్పాడు. చివరగా వివరాలు అప్డేట్ చేయడానికి ‘ఎనీ డెస్క్ యాప్’ను డౌన్ లోడ్ చేసి, రూ.10 బదిలీ చేయమని సూచించడంతో ఆ పనిని కూడా పూర్తి చేశాడు. అరగంట అనంతరం రవి ఖాతా నుంచి రూ.45 వేలు బదిలీ చేసినట్టు అలర్ట్ వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. సాక్షి, గుంటూరు: మీ బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు, కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలు అసంపూర్తిగా ఉన్నాయంటారు.. వెంటనే అప్డేట్ చేయాలని లేకపోతే ఖాతా, కార్డు బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తారు. కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నమ్మించి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటారు. అనంతరం ఓ యాప్ డౌన్లోడ్ చేసి అందులో అన్ని వివరాలు అప్డేట్ చేయమంటూ ఆ కస్టమర్లను బురిడీ కొట్టించి ఖాతా వివరాలు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రహస్య నంబర్ తెలుసుకుని క్షణాల్లో ఖాతా నుంచి డబ్బు మాయం చేస్తారు. కంటికి కనిపించకుండా ఖాతాల్లో నగదు కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న మార్గం కేవైసీ అప్డేట్ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యాప్‌ల లింక్‌తో సొమ్ము స్వాహా... కేవైసీ వివరాలు అప్డేట్ చేయడం కోసం ఎనీ డెస్క్, టీం వ్యూయర్ వంటి యాప్‌లు డౌన్ లోడ్ చేయడం కోసం పంపే లింక్ ద్వారా మన ఫోన్, ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లు సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. యాప్ డౌన్లోడ్ చేసిన అనంతరం ఒక రూపాయి, రూ.10, రూ.100 ఇలా ఎంతో కొంత బదిలీ చేయమని సూచించి ఆ సమయంలో యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్, యూజర్‌నేమ్ వంటి వివరాలను పసిగట్టి ఖాతాలు ఖాళీ చేస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦కేవైసీ అప్డేట్తో సైబర్ నేరగాళ్లు వేసే వలలో పడకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ♦కేవైసీ అప్డేట్ల రూపంలో వచ్చే మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు. ♦కస్టమర్ కేర్ ప్రతినిధుల మంటూ గుర్తుతెలియని వ్యక్తులు సూచించే యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవద్దు. వాళ్లు సూచించినట్టు తనిఖీ కోసమని నగదు బదిలీ చేయవద్దు. ♦పరిజ్ఞానం యాప్‌లు, అప్లికేషన్ల జోలికి వెళ్లొద్దు. కేవైసీ అప్డేట్ అంటూ సెల్‌కు వచ్చే అలర్ట్లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. వెంటనే పోలీసులను సంప్రదించండి మీకు తెలియకుండా ఖాతాల నుంచి నగదు బదిలీ అయిన వెంటనే పోలీసులను సంప్రదించండి. సంబంధిత ఖాతా కలిగిన బ్యాంక్‌లో సంప్రదించి ఖాతా నుంచి మీకు తెలియకుండా నగదు బదిలీ అవుతున్న విషయాన్ని తెలియజేయండి. అపరిచితులకు మీ బ్యాంక్ ఖాతా, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయకండి. – ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ ఎవరూ ఫోన్లు, మెసేజ్‌లు చేయరు.. కేవైసీ అప్డేట్ చేసుకోమని బ్యాంక్, పేమెంట్ యాప్‌ల ప్రతినిధులు ఎవరూ ఫోన్లు, మెసేజ్‌లు చేయరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కేవైసీ అప్డేట్ పేరుతో మీకు ఫోన్, మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. వాళ్లు సూచించే విధంగా స్పందించకండి. – విశాల్ గున్నీ, రూరల్ జిల్లా ఎస్పీ -
కరోనా: నలభై దాటితే అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లు పైబడిన హైరిస్క్ గ్రూపు వారు కూడా కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊపిరితిత్తులు, ఆస్తమా సంబంధింత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే కాకుండా ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా తక్షణమే సమీపంలో వైద్యులను సంప్రదించాలన్నారు. ‘104’ టోల్ ఫ్రీ నంబర్, వైఎస్సార్ టెలీ మెడిసిన్ ‘14410’ నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. వెంటనే స్థానిక ఆశా వర్కర్, వార్డు వాలంటీర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. గతంలో ఆస్తమా, ఆయాసం ఉన్నా ఏమీ కాలేదన్న ధీమా ను విడనాడాలని జవహర్‌రెడ్డి అన్నారు. (అక్కడ మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు..) బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారితో పాటు, హై రిస్క్ గ్రూపునకు చెందినవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరిలో శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా దగ్గరలోని కొవిడ్ కేర్ సెంటర్లో తక్షణం సంప్రదించాలన్నారు. వారికి పరీక్షలు చేసి తగిన వైద్యసేవల్ని అందిస్తారన్నారు. అవసరమైతే ఐసోలేషన్‌కు తరలిస్తారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడి 40 నుండి 49 ఏళ్ల మధ్య వయస్సున్న వారు 14 మంది, 50 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్నవారు 22 మంది మరణించారని జవహర్‌రెడ్డి తెలిపారు. (ఏపీలో మరో 376 కరోనా కేసులు) -
అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కడవెండి (దేవరుప్పుల) : వరద బాధితులకు సాయం అందించడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మండలంలోని కడవెండి, మాధాపురం, దేవరుప్పుల, పెద్దమడూరు, సీతారాంపురం గ్రామాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలతో కలిగే అనర్థాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాలతో ప్రమాదం పొంచి ఉన్న చెరువులు, కుంటలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో వర్షాలతో జరిగిన నష్టాన్ని పారదర్శకంగా పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కోడూరు చెరువుకు గండి కోడూర్ (రఘునాథపల్లి) : భారీ వర్షాలతో మండలంలోని కోడూరు పెద్ద చెరువుకు శనివారం గండి పడింది. రెండు రోజుల క్రితం చెరువు క ట్టకు బుంగ పడగా.. ఇరిగేష¯ŒS అధికారులు, కాంట్రాక్టర్ ఇటాచీతో దా నిని పూడ్చినా ఫలితం లేకుండా పోయింది. చెరువు కింద కోడూరుతో పాటు రామన్నగూడెంకు చెందిన 212 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువును పునరుద్ధరించేందుకు మిష¯ŒS కాకతీయ –2లో ప్రభుత్వం రూ. 60.90 లక్షలు మంజూరు చేసింది. కాగా, కాంట్రాక్టర్, అధికారులు పనులను నిర్లక్ష్యం చేయడంతో చెరువుకు ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమం లో తెల్లవారుజామున చెరువుకు గండి పడి నీరంతా వృథాగా పోతోంది. మిష¯ŒS కాకతీయలో ప్రభుత్వం లక్షలు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి గండిని పూడ్చి నీటి వృథాను అరికట్టాలని కోరారు. ఈ విషయమై డీఈ యశ్వంత్‌ను వివరణ కోరగా.. కోడూరు చెరువుకు గండి పడిన విషయాన్ని ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు రింగ్ బండ్ వేస్తామన్నారు. మత్తడి పరవళ్లు గోవిందరావుపేట : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని లక్నవరం సరస్సు, గుండ్లవాగు ప్రాజెక్టులు మత్తళ్లు పోస్తూ జలకళను సంతరించుకున్నాయి. జులై నెలాఖరులో నిండిన సరస్సులు.. తర్వాత ఖరీఫ్ కోసం సాగునీటి విడుదల చేయడంతో తగ్గాయి. మూడు రోజుల క్రితం వరకు లక్నవరం సరస్సులో 30 అడుగుల 9 అం గుళాల నీరు ఉండగా.. ప్రస్తుతం 34 అడుగులకు చేరి మత్తడి పడుతోంది. దీంతో దయ్యాలవాగు, గుండ్లవాగులు ఉధృతంగా ప్రహహిస్తున్నాయి. ఇప్పటికే ముత్తాపురం, మొట్లగూడెం, ఇప్పలగడ్డ వాసులకు వాగులతో ఇబ్బందులు ఎదురవుతుండగా..మరోసారి వర్షం పడిందంటే వారు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. వరదకు తెగిన వల్మిడి–ముత్తారం రోడ్డు పాలకుర్తి : మండలంలో నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ మేరకు శనివారం ఉదయం వరద ఉధృతికి మండలం లోని వల్మిడి– ముత్తారం గ్రామాల మధ్య ఉన్న బీటి రోడ్డు సగం వరకు తెగిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాగా, అయ్యంగారిపల్లి గ్రామంలోని మొండి కుంటకు కూడా గండి పడింది. ఉప్పుగల్లులో ఉబికి వస్తున్న నీరు జఫర్‌గఢ్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూగర్భజలాలు బాగా పెరిగి నీరు ఉరకలెత్తుతోంది. మండలంలోని ఉప్పుగల్లుకు చెందిన నల్లబోయిన రమేష్ అనే రైతు గత వేసవిలో తన చేనులో 100 ఫీట్ల లోతుతో బోరు వేయించాడు. అయితే అప్పుడు బోరులోంచి నీరు రాకపోవడంతో మరో చోట వేయించాడు. కాగా, ముందుగా వేయించిన బోరులో నుంచి ఏకధాటిగా నీరు ఉబికి వస్తుండడంతో రమేష్ సంతోష పడుతున్నాడు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు గతంలో 250 ఫీట్ల లోతుతో బోర్లు వేయించుకున్నా చుక్క నీరు రాకపోవడం గమనార్హం. మొలకెత్తిన మక్కలు సంగెం : భారీ వర్షాలతో మండలంలో వివిధ రకాల పంటలు దెబ్బతింటున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చేతికి వచ్చిన మొక్కజొన్న, పత్తి, పెసర, నువ్వు పంటలు పాడైపోతున్నాయి. కోసిన మక్కలను ఆరబెట్టుకుంటున్న సమయంలో వానలు పడుతుండడంతో మొలకెత్తుతున్నాయి. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పంటలను సాగు చేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. -
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్రావు చండ్రుగొండ : వ్యాధులు ప్రబలే సీజన్ అయినందున వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్రావు ఆదేశించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు హై అలర్డ్ పీరియడ్ అని, ఈ సీజన్లోనే గ్రామాల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 658 గ్రామాలను హైరిస్క్‌గా గుర్తించామన్నారు. ఇప్పటికే ర్యాపిడ్ ఫీవర్ సర్వే పూర్తి చేసి.. తగిన చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో ఉన్న 28 మంది డాక్టర్లు పైచదువులు నిమిత్తం సెలవుపై వెళ్లారన్నారు. వారి స్థానాలను అదనంగా ఉన్న డాక్టర్లతో తాత్కాలికంగా పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న 25.. 104 వాహనాలు మరమ్మతులకు గురికాగా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో వాటిని బాగు చేయించామని తెలిపారు. హరిత వనాలు చేస్తాం.. జిల్లాలో ఉన్న 60 పీహెచ్‌సీల ప్రాంగణాలను హరిత వనాలుగా మారుస్తామని, ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించామని డీఎంహెచ్ఓ తెలిపారు. లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టామన్నారు. చండ్రుగొండలో పీహెచ్సీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామన్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా అధికారి ఏ.రాంబాబు, క్లస్టర్ అధికారి భాస్కర్‌నాయక్, వైద్యాధికారి సీతారాంప్రసాద్, సీహెచ్ఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.