నెహ్రూకు ఘన నివాళి
విజయవాడ: స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రాభవన్ లో ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఎన్. నరహరిశెట్టి మాట్లాడుతూ నెహ్రు సేవలను కొనియాడారు. తొమ్మిదేళ్లు జైల్లో ఉన్నా కుంగిపోకుండా 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ' , 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' లతో పాటు తన జీవిత చరిత్రను రాసిన నెహ్రూను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపును తెచ్చారని కొనియాడారు. ఆయన కాలంలోనే భారీ ఆనకట్టలు, తాగునీటి ప్రాజెక్టులు, కుటీర పరిశ్రమలు, జలవిద్యుత్, అణుశక్తిని వినియోగించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో నెహ్రూ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఇందులో పీసీసీ కార్యదర్శి నాంచారయ్య, లీగల్ సెల్ చైర్మన్ మహావిష్ణు తదితరులు పాల్గొన్నారు.