vijaya mohan
-
సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!
అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు. బియ్యపు గింజపై కళాఖండాలు చెక్కి ఔరా! అనిపిస్తాడు. పెన్సిల్ మొనపై రాటుదేలిన తన పనితనంతో బొమ్మ చెక్కితే భూతద్దం పెట్టి చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటికే తన కళాతృష్ణతో రెండు సార్లు లిమ్కా బుక్ రికార్డులకెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి విజయమోహన్ తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ అబ్బురపరిచాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు చెక్కి గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. సూక్ష్మకళలో కొన్నేళ్ల నుంచి అద్భుతాలు సృష్టిస్తున్న అతను బియ్యపు గింజలపై వివిధ కళాఖండాలు చెక్కడంలో దిట్ట. బియ్యపు గింజ ఎంత చిన్నగా ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి గింజపై వేల కొద్దీ బొమ్మలు చెక్కిన ఘనత ఆయనది. ప్రస్తుతం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయ అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ ఎలాంటి సూక్ష్మదర్శిని వాడకుండా చిన్నపాటి సూదిమొనతో ఈ అద్భుతాలు సృష్టించడం విశేషం. – నరసాపురం బియ్యపు గింజలు, నువ్వుల గింజలు, కొబ్బరి పీచు ఇలా ఈ సూక్ష్మమోహనుడు పనితనానికి కాదేదీ అనర్హం. దేనిపైనైనా అద్భుతంగా బొమ్మలు చెక్కిచూపిస్తాడు. పదేళ్ల వయస్సులో పనికిరాని వస్తువులతో బొమ్మలు చేయడంతో ప్రారంభమైన ఇతని విజయ ప్రస్థానం ఈ రోజు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచం మొత్తంగా సూక్ష్మ కళాకారులు ఎంతో మంది ఉండగా.. బియ్యపు గింజపై బొమ్మలు చెక్కే వారు చాలా అరుదు. బియ్యపు గింజలపై పేర్లు రాయడం వంటివి చాలామంది చేస్తుంటారు. అయితే ఆ దశను మోహన్ దాటి మరింత ముందుకు వెళ్లాడు. ఇంత వరకూ బియ్యపు గింజలపై 3 వేల వరకూ బొమ్మలు చెక్కాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు, ప్రియురాలి హృదయం, దేశ నాయకులు ఇలా.. ఒక్కో బియ్యపుగింజపై ఒక్కో అద్భుత ఆకారాన్ని సృష్టించాడు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా.. ఒకే బియ్యపుగింజపై శ్రీరామ పట్టాభిషేకం దృశ్యం మొత్తం చెక్కడం ఆ యువకుడి ప్రతిభకు మరో తార్కాణం. పెన్సిల్ మొనలు, సుద్దముక్కలపై 5 వేల పైనే బొమ్మలు చెక్కాడు. నువ్వుల గింజ, కొబ్బరిపీచులో ఒక లేయర్‌పై బొమ్మలు వేస్తాడు. భవిష్యత్‌లో కొబ్బరిపీచు లేయర్‌పై కూడా బొమ్మ చెక్కే ప్రయత్నం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన విజయమోహన్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఢిల్లీ పిలిపించుకుని అభినందించారు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) తొలి ప్రయత్నంలోనే గిన్నిస్ రికార్డు బియ్యపు గింజలపై బొమ్మలే కాదు కాకుండా చెట్ల ఆకులపై సూదితో చిల్లులు పెడుతూ ఎవరి ఆకారాన్ని అయినా చెక్కేస్తాడు. అగ్గిపుల్లలు, కోడిగుడ్డు గుల్లలు, ఖాళీ బీరుబాటిళ్లు, పనికిరాని చెక్క ముక్కలు అతని కంటిలో పడితే అందాలు చిందే వస్తువులుగా మారిపోతాయి. ఇంజినీరింగ్ పూర్తిచేసి 2019 అక్టోబర్‌లో గ్రామసచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అయినా తన ప్రవృత్తిని వదిలిపెట్టకుండా బొమ్మలు చెక్కడం కొనసాగిస్తూ గిన్నిస్ రికార్డు సాధించాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు ఎలాంటి అతుకులు లేకుండా చెక్కి గిన్నిస్ సాధించాడు. అదీ తొలిప్రయత్నంలోనే కావడం గమనార్హం. దీనికి కేవలం రెండురోజుల సమయం పట్టింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అతిచిన్న మిక్సీ తయారు చేసినందుకు 2019 మార్చి 16న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతనిపై వ్యాసం వెలువడింది. మళ్లీ అదే ఏడాది అతిచిన్న మజ్జిగ చిలికే యంత్రం తయారుచేసి రెండోసారి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కాడు. నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్ట్స్ విభాగంలో విజయమోహన్‌ను జాతీయ స్థాయిలో రాష్ట్రీయ యువ గౌరవ అవార్డుతో సత్కరించింది. 2018 మార్చి 21న ఢిల్లీలోని ఆంధ్రా భవన్లో జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర మంత్రులు విజయ్‌గోయల్, రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ యువకుడిని తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇన్క్రెడిబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడుకు చెందిన ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ ఎచీవర్ బుక్ అఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు. 2017 ఆగస్ట్‌లో ఒకే ఒక్క బియ్యపుగింజపై శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని సూక్ష్మదర్శిని సాయం లేకుండా 3 గంటల వ్యవధిలో చెక్కినందుకు నేషనల్ రికార్డ్స్ బుక్ పురస్కారం లభించింది. 2017 సెప్టెంబర్‌లో మూడు బియ్యపు గింజలపై మూడు భాషల్లో జాతీయ గీతాన్ని 10 గంటల వ్యవధిలో రాసినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 2015లో 33 రోజుల్లోనే 1,33,333 గింజలపై సాయిరాం నామావళిని రాసి ఔరా అనిపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. గిన్నిస్ సాధించాలన్న నా కల నిజమైంది. ఆనందంగా ఉంది. ఈ కళలో ఇంకా సాధించాలి, మరింత ప్రయోగాత్మకంగా ముందుకెళ్లాలని ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఏ వస్తువు చూసినా దానిని ఏదో చేయాలనే ఆలోచన వచ్చేది. ఇదే ఉత్సాహం నన్ను ఈ కళకు పరిచయం చేసింది. బియ్యపు గింజలపై బొమ్మలు చెక్కేవారు ప్రపంచం మొత్తంగా ఎవరూ లేరు. అదీ సూక్ష్మదర్శిని లేకుండా చిన్న సూది మొనతో చెక్కుతాను. అందువల్లే గిన్నిస్ సాధ్యమైంది. –కొప్పినీడి విజయమోహన్ -
సర్వే పనితీరు మార్చుకోవాలి
విజయనగరం కంటోన్మెంట్: రాష్ట్ర స్థాయిలో సర్వే శాఖ పనితీరును మార్చుకోవాలని సర్వే శాఖ కమిషనర్ సీహెచ్.విజయమోహన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సర్వేయర్లతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రైతుల భూముల వివరాల్లో పేర్లు మార్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉద్యోగుల వారసులు కూడా ఈ విషయంలో ఇబ్బందులు పడే ప్రమాదముందన్నారు. రైతుకు భూమే వెన్నెముకనీ, రికార్డుల్లో పేర్లు మారిపోతే ఎలా అని ప్రశ్నించారు. రైతులే వారి భూమిని సబ్ డివిజన్ చేసుకుని విక్రయించుకునే నూతన విధానాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ ప్రక్రియ నిలిచిపోయిందనీ, ఇంకా జిల్లాలో చేయాల్సిన 32 వేల ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించేందుకు ఏపీ శాక్తో మాట్లాడుతానన్నారు. మొత్తం సర్వే ప్రక్రియంతా ఆన్లైన్లోనే నడవాలన్నారు. నెలాఖరు గడువు జిల్లాలో వివిధ గ్రీవెన్స్ పిటిషన్లు, సర్వే అప్లికేషన్లు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు నెలల్లోనే తాను వస్తానని అప్పటికి ఎటువంటి పెండింగ్ ఉండకూడదన్నారు. సమీక్షలో ఆర్డీడీ డి.బి.డి.బి.కుమార్, ఏడీ ఎం.గోపాల రావు, పర్యవేక్షకులు రాంబాబు, కార్యాలయ అధికారులు, జిల్లా సర్వేయర్లు పాల్గొన్నారు. -
సోలార్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయండి
ఓర్వకల్లు: ఓర్వకల్లు–గడివేముల మండలాల మధ్య పెద్ద ఎత్తున నిర్మిస్తున్న సోలార్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌తో పాటు గ్రీన్‌కోర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్‌కుమార్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గని, బ్రాహ్మణపల్లె, శకునాల గ్రామాల రెవెన్యూ పరిధిలో దాదాపు 5వేల ఎకరాల్లో నిర్మిస్తున్న గ్రీన్‌కోర్, స్టాంకప్ బ్యాంక్, అదాని, అజారు కంపెనీల ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన పిల్లకాల్వల ద్వారా వర్షపు నీరు వృథా కాకుండా సమీపంలోని చెరువులను అనుసంధానం చేయాలని ఆయా కంపెనీల ప్రతినిధులకు సూచించారు. అనంతరం విద్యుత్ సోలార్ కూలింగ్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. సబ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన స్విచ్‌బోర్డులను పరిశీలించారు. 33/220 కేవీ వివరాలను ట్రాన్స్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంతో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేఎండీ కొల్లీన్ మల్లేష్, ట్రాన్స్‌కో ఎస్ఈ గౌరుశంకర్, ఈఈ కృష్ణమ నాయుడు, కర్నూలు ఆర్డీఓ హుసేన్ సాహెబ్, కర్నూలు, ఓర్వకల్లు తహసీల్దార్లు తిప్పేనాయక్, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
మీరైనా కరుణించండి..
కర్నూలు రూరల్: నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అదిగో..ఇదిగో అంటూ అధికారులు తప్పించుకుని తిరుగుతున్నారు. కొత్తగా వచ్చిన మీరైనా మాపై దయ ఉంచి అపరిష్కృత సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని ప్రజలు కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ విజయమోహన్‌ను కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసి అశోక్‌కుమార్, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ పీడీ రామసుబ్బులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న సుదర్శన్‌రెడ్డి బదిలీ అయిన విషయం విదితమే. ఆయన నుంచి బాధ్యతలు తీసుకున్న కొత్త కలెక్టర్ విజయమోహన్ జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం పెట్టుకోవడంతో ప్రజాదర్బార్ సుమారు గంటన్నర పైగా ఆలస్యంగా మొదలైంది. సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారితో సునయన ఆడిటోరియం నిండిపోయింది. రెవెన్యూ అధికారులు కాస్త దృష్టి పెడితే ఆర్థిక అంశాలతో పాటు, న్యాయబద్ధమైన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే అధికారులు జాప్యం చేయడంతో ఏదో ఒక రోజు సారోళ్లు స్పందించకపోరా అనే ఆశతో ప్రజలు ప్రతి వారం అర్జీలు చేతపట్టుకొని జిల్లా కేంద్రానికి వ్యయ ప్రయాసలు కోర్చి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టర్ వచ్చాడని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకొని తమ సమస్యలు ఏకరువు పెట్టారు. అయితే అధికారులు వినతులను తీసుకుంటున్నారే తప్ప ఎలాంటి పరిష్కార మార్గాలు చూపకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. వితంతు పింఛన్ కోసం ఆరేళ్లుగా తిరుగుతున్నా... - శకుంతలమ్మ, గోనెగండ్ల నా భర్త రంగప్ప 2008వ సంవత్సరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వితంతు పింఛన్ కోసం మండల, జిల్లా కేంద్రంలో జరిగే ప్రజాదర్బార్ కార్యక్రమాలకు ఆరేళ్లుగా తిరుగుతున్నా. ఇప్పటికి 20కి పైగా వినతులు ఇచ్చాను. అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు వ్యక్తులు పింఛన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారు. కొత్త కలెక్టరైనా పింఛన్ ఇప్పిస్తారనే ఆశతో వచ్చాను. ప్రభుత్వ భూములు ఇచ్చి ఆదుకోవాలి... బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామానికి చెందిన దళిత మహిళలు ప్రభుత్వం భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ప్రజాదర్బార్‌లో వినతులు ఇచ్చారు. సర్వే నంబర్లు 771/1, 772/1, 773/3లలో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమి ఉందని, అయితే ఆ భూమి నంద్యాల మండలం శాబోలు గ్రామానికి చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉందని అధికారుల దృష్టికి తెచ్చారు. మా గ్రామం పరిధిలో ఉన్న భూమి మాకే ఇప్పించాలని కలెక్టర్ విజయమోహన్కి వినతి పత్రం అందజేశారు.