అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు. బియ్యపు గింజపై కళాఖండాలు చెక్కి ఔరా! అనిపిస్తాడు. పెన్సిల్ మొనపై రాటుదేలిన తన పనితనంతో బొమ్మ చెక్కితే భూతద్దం పెట్టి చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటికే తన కళాతృష్ణతో రెండు సార్లు లిమ్కా బుక్ రికార్డులకెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి విజయమోహన్ తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ అబ్బురపరిచాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు చెక్కి గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. సూక్ష్మకళలో కొన్నేళ్ల నుంచి అద్భుతాలు సృష్టిస్తున్న అతను బియ్యపు గింజలపై వివిధ కళాఖండాలు చెక్కడంలో దిట్ట. బియ్యపు గింజ ఎంత చిన్నగా ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి గింజపై వేల కొద్దీ బొమ్మలు చెక్కిన ఘనత ఆయనది. ప్రస్తుతం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయ అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ ఎలాంటి సూక్ష్మదర్శిని వాడకుండా చిన్నపాటి సూదిమొనతో ఈ అద్భుతాలు సృష్టించడం విశేషం. – నరసాపురం
బియ్యపు గింజలు, నువ్వుల గింజలు, కొబ్బరి పీచు ఇలా ఈ సూక్ష్మమోహనుడు పనితనానికి కాదేదీ అనర్హం. దేనిపైనైనా అద్భుతంగా బొమ్మలు చెక్కిచూపిస్తాడు. పదేళ్ల వయస్సులో పనికిరాని వస్తువులతో బొమ్మలు చేయడంతో ప్రారంభమైన ఇతని విజయ ప్రస్థానం ఈ రోజు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచం మొత్తంగా సూక్ష్మ కళాకారులు ఎంతో మంది ఉండగా.. బియ్యపు గింజపై బొమ్మలు చెక్కే వారు చాలా అరుదు. బియ్యపు గింజలపై పేర్లు రాయడం వంటివి చాలామంది చేస్తుంటారు. అయితే ఆ దశను మోహన్ దాటి మరింత ముందుకు వెళ్లాడు. ఇంత వరకూ బియ్యపు గింజలపై 3 వేల వరకూ బొమ్మలు చెక్కాడు.
తల్లి గర్భంలో ఉన్న శిశువు, ప్రియురాలి హృదయం, దేశ నాయకులు ఇలా.. ఒక్కో బియ్యపుగింజపై ఒక్కో అద్భుత ఆకారాన్ని సృష్టించాడు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా.. ఒకే బియ్యపుగింజపై శ్రీరామ పట్టాభిషేకం దృశ్యం మొత్తం చెక్కడం ఆ యువకుడి ప్రతిభకు మరో తార్కాణం. పెన్సిల్ మొనలు, సుద్దముక్కలపై 5 వేల పైనే బొమ్మలు చెక్కాడు. నువ్వుల గింజ, కొబ్బరిపీచులో ఒక లేయర్‌పై బొమ్మలు వేస్తాడు. భవిష్యత్‌లో కొబ్బరిపీచు లేయర్‌పై కూడా బొమ్మ చెక్కే ప్రయత్నం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన విజయమోహన్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఢిల్లీ పిలిపించుకుని అభినందించారు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్)
తొలి ప్రయత్నంలోనే గిన్నిస్ రికార్డు
బియ్యపు గింజలపై బొమ్మలే కాదు కాకుండా చెట్ల ఆకులపై సూదితో చిల్లులు పెడుతూ ఎవరి ఆకారాన్ని అయినా చెక్కేస్తాడు. అగ్గిపుల్లలు, కోడిగుడ్డు గుల్లలు, ఖాళీ బీరుబాటిళ్లు, పనికిరాని చెక్క ముక్కలు అతని కంటిలో పడితే అందాలు చిందే వస్తువులుగా మారిపోతాయి. ఇంజినీరింగ్ పూర్తిచేసి 2019 అక్టోబర్‌లో గ్రామసచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అయినా తన ప్రవృత్తిని వదిలిపెట్టకుండా బొమ్మలు చెక్కడం కొనసాగిస్తూ గిన్నిస్ రికార్డు సాధించాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు ఎలాంటి అతుకులు లేకుండా చెక్కి గిన్నిస్ సాధించాడు. అదీ తొలిప్రయత్నంలోనే కావడం గమనార్హం. దీనికి కేవలం రెండురోజుల సమయం పట్టింది.
ఎన్నో అవార్డులు, రివార్డులు
అతిచిన్న మిక్సీ తయారు చేసినందుకు 2019 మార్చి 16న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతనిపై వ్యాసం వెలువడింది. మళ్లీ అదే ఏడాది అతిచిన్న మజ్జిగ చిలికే యంత్రం తయారుచేసి రెండోసారి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కాడు. నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్ట్స్ విభాగంలో విజయమోహన్‌ను జాతీయ స్థాయిలో రాష్ట్రీయ యువ గౌరవ అవార్డుతో సత్కరించింది. 2018 మార్చి 21న ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర మంత్రులు విజయ్‌గోయల్, రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ యువకుడిని తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇన్‌క్రెడిబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడుకు చెందిన ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ ఎచీవర్ బుక్ అఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు. 2017 ఆగస్ట్‌లో ఒకే ఒక్క బియ్యపుగింజపై శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని సూక్ష్మదర్శిని సాయం లేకుండా 3 గంటల వ్యవధిలో చెక్కినందుకు నేషనల్ రికార్డ్స్ బుక్ పురస్కారం లభించింది. 2017 సెప్టెంబర్‌లో మూడు బియ్యపు గింజలపై మూడు భాషల్లో జాతీయ గీతాన్ని 10 గంటల వ్యవధిలో రాసినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 2015లో 33 రోజుల్లోనే 1,33,333 గింజలపై సాయిరాం నామావళిని రాసి ఔరా అనిపించాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. గిన్నిస్ సాధించాలన్న నా కల నిజమైంది. ఆనందంగా ఉంది. ఈ కళలో ఇంకా సాధించాలి, మరింత ప్రయోగాత్మకంగా ముందుకెళ్లాలని ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఏ వస్తువు చూసినా దానిని ఏదో చేయాలనే ఆలోచన వచ్చేది. ఇదే ఉత్సాహం నన్ను ఈ కళకు పరిచయం చేసింది. బియ్యపు గింజలపై బొమ్మలు చెక్కేవారు ప్రపంచం మొత్తంగా ఎవరూ లేరు. అదీ సూక్ష్మదర్శిని లేకుండా చిన్న సూది మొనతో చెక్కుతాను. అందువల్లే గిన్నిస్ సాధ్యమైంది.
–కొప్పినీడి విజయమోహన్
Comments
Please login to add a commentAdd a comment