ఓర్వకల్లు: ఓర్వకల్లు–గడివేముల మండలాల మధ్య పెద్ద ఎత్తున నిర్మిస్తున్న సోలార్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌తో పాటు గ్రీన్‌కోర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్‌కుమార్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గని, బ్రాహ్మణపల్లె, శకునాల గ్రామాల రెవెన్యూ పరిధిలో దాదాపు 5వేల ఎకరాల్లో నిర్మిస్తున్న గ్రీన్‌కోర్, స్టాంకప్ బ్యాంక్, అదాని, అజారు కంపెనీల ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులను వారు పరిశీలించారు.
ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన పిల్లకాల్వల ద్వారా వర్షపు నీరు వృథా కాకుండా సమీపంలోని చెరువులను అనుసంధానం చేయాలని ఆయా కంపెనీల ప్రతినిధులకు సూచించారు. అనంతరం విద్యుత్ సోలార్ కూలింగ్ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. సబ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన స్విచ్‌బోర్డులను పరిశీలించారు. 33/220 కేవీ వివరాలను ట్రాన్స్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంతో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేఎండీ కొల్లీన్ మల్లేష్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ గౌరుశంకర్, ఈఈ కృష్ణమ నాయుడు, కర్నూలు ఆర్‌డీఓ హుసేన్ సాహెబ్, కర్నూలు, ఓర్వకల్లు తహసీల్దార్లు తిప్పేనాయక్, శ్రీనాథ్ పాల్గొన్నారు.