ఇంజనీర్ దంపతుల ఆత్మహత్య
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో నమ్మిన వారు మోసం చేయడమే కాక వేధింపులకు పాల్పడడంతో ఇంజనీర్ దంపతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... రామనగర జిల్లా ఐజూరు హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న విజయానందశెట్టి(45), లక్ష్మి(37) దంపతులు.
బెంగళూరు శివారులోని రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలలో విజయానందశెట్టి బయోమెట్రిక్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని ఆర్థిక లావాదేవీలలో చిక్కుకున్న వీరు పలువురికి పోస్ట్ డెటెడ్ చెక్కులు, నగలు ఇచ్చి, తమ అప్పు తీరిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలని కోరారు. తర్వాత వారికి నగదు చెల్లించినా చెక్కులు, నగలు వాపస్ ఇవ్వకుండా వేధించడమే కాక పరువు తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై మనస్థాపం చెందిన విజయానందశెట్టి బుధవారం రాత్రి ఇంటికి చేరుకుని తన భార్యతో చాలా సేపు చర్చించాడు.
సమాజంలో పరువు పోతుందని భావించి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని డెత్ నోట్ రాశారు. అందులో తాము ఎలా మోసపోయింది వివరించి ఇద్దరూ సంతకాలు చేశారు. తర్వాత తన స్నేహితుడికి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విజయానందశెట్టి ఎస్ఎంఎస్ పెట్టాడు. విషం తాగి లక్ష్మి బెడ్‌పై కుప్పకూలిపోయింది. అదే బెడ్రూంలో ఫ్యాన్‌కు విజయానందశెట్టి ఉరి వేసుకున్నాడు.
ఎస్ఎంఎస్ అందుకున్న స్నేహితుడు, మరికొందరితో కలిసి హుటాహుటినా అక్కడకు చేరుకునే లోపు ఇద్దరూ మరణించారు. డెత్‌నోట్‌లో తాము ఎవరికి అపకారం చేయలేదని పేర్కొన్నారు. రాజరాజేశ్వరి మెడికల్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఇద్దరి మృతదేహాలను రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలకు అప్పగించాలని రాసిపెట్టారు. డెత్‌నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.