పక్కా ప్రణాళికతో పుష్కరాలు
ముమ్మరంగా రోడ్ల అభివృద్ధి పనులు
కలెక్టర్ బాబు ఏ ఆదేశం
విజయవాడ పుష్కర యాత్రికులు సులువుగా పుష్కరఘాట్లకు చేరుకునే విధంగా రహదారుల నిర్మాణానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం కృష్ణా పుష్కర ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. తొలుత రైల్వే శాఖ ద్వారా చేపట్టే పనులను సమీక్షించారు. విజయవాడ స్టేషన్‌కు అదనంగా, గుణదల, కృష్ణాకెనాల్ స్టేషన్ విస్తరణ, అలాగే పదో నంబర్ ఫ్లాట్‌ఫాం విస్తరణ అంశాలను డీఆర్ఎం ఆశోక్‌కుమార్‌తో చర్చించారు. సీసీ కెమేరాలు ఏర్పాటు, రైల్వే టికెట్ కౌంటర్లు ఏర్పాట్ల అంశాలను సమీక్షించారు. అనంతరం ముక్త్యాల, వేదాద్రి, సాగరసంగమం వరకు ఉన్న ఘాట్ల మరమ్మతులు, వాటిని చేరుకోవడానికి రోడ్లు విస్తరణ, ఘాట్లలో టాయ్ లెట్స్ ఏర్పాట్లు గురించి పంచాయతీరాజ్, ఆర్‌ఆండ్‌బీ అధికారులతో చర్చించారు.
డాల్ఫిన్ హౌస్ నుంచి సాగర సంగమం వరకు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ ఎస్ఈని ఆదేశించారు. ముక్త్యాల, వేదాద్రి ఘాట్లకు అప్రోచ్ రోడ్లు విస్తరణ అంచనాలను పరిశీలించారు. హైదరాబాద్, ఏలూరు, గుంటూరు, బందరు వైపు నుంచి విజయవాడకు వచ్చే యాత్రికుల వాహనాలను ఏఏ రూట్లకు మళ్లించాలి, ఏఏ రోడ్లు విస్తరించాలో సూచించాలని పోలీస్, ఆర్ ఆండ్ బీ. అధికారులను ఆయన కోరారు. విజయవాడ నగరంలో దుర్గాఘాట్ చాలా ప్రాముఖ్యమైనదని సుమారు 3.5 కోట్ల భక్తులు రావచ్చునని కలెక్టర్ చెప్పారు. అలాగే పవిత్ర సంగమం, ముక్త్యాల, వేదాద్రీ సాగర సంగమం ముఖ్యమైన ప్రాంతాలుగా పేర్కొన్నారు. నగరంలో 12 నుంచి 15 పుష్కర నగర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యాత్రికులు కోసం కేశఖండనశాల కూడా పుష్కరనగర్‌లో ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు.
పుష్కరనగర్‌కు చేరుకున్న యాత్రికులు కాలకృత్యాలు తీర్చుకుని, మినీబస్‌లో పుష్కరఘాట్లకు వెళ్లి పుణ్యస్నానమాచరించి పిండప్రదానాలు పూర్తిచేసుకుని తిరిగి మినీ బస్‌లలో పుష్కర నగర్‌లకు చేరుకుంటారని తెలిపారు. పుష్కర నగర్లో ఆర్.టి.సి రైల్వే టికెట్ కౌంటర్లు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. అక్కడనుంచి వారివారి ప్రాంతాలకు తిరిగి వెళ్లతారన్నారు. పుష్కరఘాట్లలోగాని ఇతర ప్రాంతాల్లో ఎటువంటి షాపులు ఉండవన్నారు. పుష్కర నగర్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
కృష్ణాపుష్కరాల నిర్వహణలో మూడు అంశాలు ముఖ్యమైనవన్నారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, యాత్రికులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, రవాణా(బస్, రైలు ప్రయాణ సౌకర్యాలు) కల్పనలో పూర్తిస్థాయిలో శ్రద్ధవహించాలని కలెక్టర్ కోరారు. పవిత్ర సంఘమం (ఫెర్రీ) వద్ద నమోనా దేవాలయాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పవిత్ర సంగమం, ఫెర్రీ, దుర్గాఘాట్లు అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న నమోనాలను మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా ఎస్పీ జి.విజయ్ కుమార్, విజయవాడ నగర డీసీపీలు అశోక్ కుమార్, నరసింహారావు, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి. సృజన, డీఆర్వో సి.హెచ్.రంగయ్య, ఇరిగేషన్ ఎస్ఈ రామకృష్ణ, పంచాయతీరాజ్ ఎస్ఈ సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాకాధికారిణి ఆర్.నాగమల్లేశ్వరి పాల్గొన్నారు.