Vijayawada Metro project
-
‘విజయవాడ మెట్రో రైలు ప్రతిపాదనే రాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మెట్రో రైల్ విధానానికి అనుగుణంగా విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణానికి తిరిగి ప్రతిపాదన పంపిచాల్సిందిగా సెప్టెంబర్ 2017లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని చెప్పారు. పట్టణ రవాణ అనేది పట్టణాభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగమని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారమని పేర్కొన్నారు. పట్టణ రవాణా వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని మంత్రి తెలిపారు. విద్యా హక్కు చట్టం ఉల్లంఘనలు లేవు అత్యధిక ప్రాధమిక పాఠశాలలు విద్యా హక్కు చట్టానికి (ఆర్టీఈ) లోబడే నడుస్తున్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు. ‘ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రాధమిక పాఠశాలకు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే భవనంతోపాటు ప్రతి టీచర్‌కి ఒక క్లాస్ రూమ్ ఉండాలి. అవరోధాలు లేని ప్రవేశమార్గం ఉండాలి. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా మరుగు దొడ్లు, నీటి వసతితోపాటు మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి బడి ఆవరణలోనే వంట గది, ఆట స్థలం, బడి చుట్టూ ప్రహరీ గోడ ఉండాలి’ మంత్రి చెప్పారు. విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకమైన సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఎంతగానో తోడ్పడుతున్నట్లు మంత్రి వివరించారు. 2001లో ఎస్ఎస్ఏ ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రానికి 4,455 ప్రాధమిక పాఠశాలలను మంజూరయ్యాయి. అలాగే 70,204 తరగతి గదుల నిర్మాణానికి, 7.143 స్కూళ్ళలో నీటి వసతి ఏర్పాటుకు, 36,906 స్కూళ్ళలో మరుగు దొడ్డి సౌకర్యం కల్పించడానికి ఎస్ఎస్ఏ కింద ఆమోదం ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. -
విజయవాడ మెట్రోకు రూ. 2600 కోట్ల రుణం
రూ.300 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి: విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ రూ.2600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. జర్మనీ ప్రతినిధుల బృందంతో నాలుగు రోజుల నుంచి జరుపుతున్న చర్చలు ఫలించాయని గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు విలువలో 20 శాతం, రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించనున్నదన్నారు. జర్మనీ రుణం విడుదలయ్యేలోపు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో భూసేకరణ చేపట్టనున్నామన్నారు.ప్రభుత్వ భవనాల సముదాయం మాస్టర్ ప్లాన్‌పై నార్మన్ ఫోస్టర్స్తో చర్చించేందుకు ఈనెల 22న సీఆర్డీఏ కమిషనర్‌తో కలసి లండన్ వెళుతున్నానని, 28వ తేదీన ఆ దేశ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్‌ను అందించనున్నారని తెలిపారు. -
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు
అమరావతి : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ పనులకు డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సోమవారం టెండర్లు పిలిచింది. ఏలూరు, బందరు రోడ్డుల్లో 26 కిలోమీటర్ల నిర్మించే కారిడార్ల డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్‌తోపాటు ఎలివేటెడ్ బ్రిడ్జి, మధ్యలో కిలోమీటరుకు ఒక స్టేషన్, ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారాల నిర్మాణం, ఫ్లంబింగ్ పనులన్నింటినీ కలిపి రూ.1800 కోట్ల అంచనాతో చేపట్టాల్సివుంటుందని పేర్కొంది. ఏలూరు రోడ్డు కారిడార్‌కు రూ.969 కోట్లు, బందరు రోడ్డు కారిడార్‌కు రూ.831 కోట్ల అంచనాతో విడిగా టెండర్లు పిలిచింది. స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించిన టెండరు పత్రాలను డిసెంబర్ ఐదు నుంచి 16వ తేదీ వరకూ విక్రయిస్తారు. జనవరి 12 నుంచి 16వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలి. త్వరలో నిడమానూరులో కోచ్ డిపో, రెండు కారిడార్లలో ట్రాక్ నిర్మాణం, విద్యుత్ తదితర పనులకు విడిగా టెండర్లు పిలవనుంది.