
సాక్షి, న్యూఢిల్లీ : విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మెట్రో రైల్ విధానానికి అనుగుణంగా విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణానికి తిరిగి ప్రతిపాదన పంపిచాల్సిందిగా సెప్టెంబర్ 2017లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని చెప్పారు. పట్టణ రవాణ అనేది పట్టణాభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగమని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారమని పేర్కొన్నారు. పట్టణ రవాణా వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని మంత్రి తెలిపారు.
విద్యా హక్కు చట్టం ఉల్లంఘనలు లేవు
అత్యధిక ప్రాధమిక పాఠశాలలు విద్యా హక్కు చట్టానికి (ఆర్టీఈ) లోబడే నడుస్తున్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు. ‘ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రాధమిక పాఠశాలకు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే భవనంతోపాటు ప్రతి టీచర్‌కి ఒక క్లాస్ రూమ్ ఉండాలి. అవరోధాలు లేని ప్రవేశమార్గం ఉండాలి. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా మరుగు దొడ్లు, నీటి వసతితోపాటు మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి బడి ఆవరణలోనే వంట గది, ఆట స్థలం, బడి చుట్టూ ప్రహరీ గోడ ఉండాలి’ మంత్రి చెప్పారు.
విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకమైన సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఎంతగానో తోడ్పడుతున్నట్లు మంత్రి వివరించారు. 2001లో ఎస్‌ఎస్‌ఏ ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రానికి 4,455 ప్రాధమిక పాఠశాలలను మంజూరయ్యాయి. అలాగే 70,204 తరగతి గదుల నిర్మాణానికి, 7.143 స్కూళ్ళలో నీటి వసతి ఏర్పాటుకు, 36,906 స్కూళ్ళలో మరుగు దొడ్డి సౌకర్యం కల్పించడానికి ఎస్‌ఎస్‌ఏ కింద ఆమోదం ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment