vijayendhra prasad
-
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్స్‌గా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ 'మాత్రు'. శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు.ప్రధాన తారాగణం అంతా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించింది. అలీ, దేవి ప్రసాద్, ఆమని, రవి కాలే, నందిని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ఎడిటర్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. -
మహేశ్ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్
RRR సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తారని అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో మహేశ్ బాబుతో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కానీ ఆ సినిమాకు సంబంధించిన పలు వార్తలు నెట్టంట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్లో అడుగుపెడుతున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిందని ప్రకటించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో SSMB29 ప్రాజెక్ట్‌పై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మహేశ్- రాజమౌళి సినిమా 'ఇండియానా జోన్స్'లా ఉంటుందని క్లారటీ ఇచ్చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదని చెప్పారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని పేర్కొన్నారు. అలాగని ఇది పీరియాడికల్ మూవీ కాదని ముందే చెప్పాశారు. ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాతో మహేశ్ బాబు ఇమేజ్ భారీగా పెరుగుతుందని పాన్ ఇండియా రేంజ్లో ఈ ఒక్క సినిమాతోనే గుర్తింపురావాలని తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 'ఇండియానా జోన్స్' గురించి తెలుసా..? యాక్షన్, అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడేవారందరికీ 'ఇండియానా జోన్స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాల ద్వారా సుమారు 15 వేల కోట్ల రూపాయాలు కలెక్షన్స్ వచ్చాయి. 1981లో 'రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్'తో మొదలైన ఈ ఫ్రాంఛైజీలో మొత్తం నాలుగు చిత్రాలు వచ్చాయి. ఈ సిరీస్‌లో ఆఖరి సినిమా కూడా 2023లో విడుదలైంది. 'ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ'తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. 'ఇండియానా జోన్స్' అన్ని సిరీస్‌లకు చిత్రాలకు హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించారు. రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్ కూడా స్పీల్బర్గ్ అని తెలిసిందే. -
దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తిక విషయాలు చెప్పిన ఆయన తండ్రి
దర్శకుడు అవ్వాలన్నది రాజమౌళి ఆలోచనే అని తనది కాదని ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇటీవల ఓ షోకు అతిథిగా వచ్చిన ఆయన దర్శక ధీరుడు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజమౌళిని డైరెక్టర్ చేయాలని నేనేప్పుడు అనుకోలేదు. ఆ ఆలోచన తనకే వచ్చింది. తను ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత డిగ్రీలో బీఎస్సీ చదవాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. అది తెలిసి తాను డిగ్రీ చదవనని నాతో చెప్పాడు. ఆర్థిక పరిస్థితి కూడా సహకరించకపోయేసరికి నేను ఏం చెప్పలేకపోయాను. ఇక ఖాళీగా చెన్నై రోడ్లపై బలాదూర్‌గా తిరుగుతూ ఉండేవాడు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కొద్ది రోజులకు నేనే రాజమౌళిని పిలిచి ఏం చేద్దామనుకుంటున్నావ్ అని అడగడంతో వెంటనే డైరెక్షన్‌పై ఆసక్తి ఉందని, అదే చేస్తానని చెప్పాడన్నారు. దీంతో దర్శకుడు కావడమంటే అంత తేలికైన విషయం కాదని, డైరెక్షన్‌కు సంబంధించిన అన్ని శాఖలపై పట్టుండాలి.. అప్పుడే నిన్ను డైరెక్షన్ డిపార్టుమెంటులో పెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారని చెప్పి ముందుగా అవి నేర్చుకొమ్మని వివరించానన్నారు. ‘దాంతో రాజమౌళి ముందుగా ఎడింగ్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత కీరవాణి దగ్గర మ్యూజిక్‌పై అవగాహన పెంచుకున్నాడు. ఇక నా దగ్గర కూర్చుని కథలపై శ్రద్ద పెట్టాడు. అంతేగాక ఒక కథలో ఎక్కడ ఏయే విషయాలు చెప్పాలి, ఎలా వివరించాలి అనే విషయాలపై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు పిలిచి తనకు శాంతినివాసం సీరియల్లో అవకాశం ఇచ్చారు’ అని ఆయన తెలిపారు. -
RRR Movie: ఫైట్ సీన్‌కి కన్నీళ్లొస్తాయి!
‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలోని పోరాట సన్నివేశా లను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని అంటున్నారు ఈ చిత్రరచయిత కె.వి.విజయేంద్రప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఈ చిత్రవిశేషాల గురించి ఇటీవల ఓ సందర్భంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమా గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్‌ను చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ సందడి చేస్తుంటారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో ఒక రకమైన బాధ దాగి ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది. ఫస్ట్ టైమ్ ఫైట్ సీక్వెన్సెస్‌కి ఎమోషన్ అవుతారు ప్రేక్షకులు’’ అన్నారు. -
ఇద్దరి లోకం ఒకటే
యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటున్నారు. ఆయన హీరోగా జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘దిల్’రాజు మనవడు మాస్టర్ ఆరాన్‡్ష గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరా లను తెలియజేస్తాం’’ అన్నారు. -
నేనే చేయమని అడుగుతా : బాహుబలి రచయిత
బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలతో పాటు ఇతర దర్శకులకు కూడా కథలు అందిస్తూ బిజీగా ఉన్నాడు విజయేంద్ర ప్రసాద్. అయితే ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ స్టార్ రైటర్. శంకర్ తన సినిమాకు మిమ్మల్ని కథ ఇవ్వమని అడిగితే ఇస్తారా అన్న ప్రశ్నకు ' అదేం ప్రశ్న..? ఆయన నన్ను అడగటం కాదు.. నేనే కథ రెడీ చేసి, ఆ కథతో సినిమా చేయమని శంకర్ ను కోరుతా' అంటూ సమాధానం ఇచ్చారు. అంతే కాదు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమాకు సీక్వల్స్ రాస్తున్నట్టుగా తెలిపారు. పర్ఫెక్ట్ సీక్వల్ కాకపోయినా.. తన కథ ఒకే ఒక్కడు లైన్ లోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కథ బాలీవుడ్ సినిమా కోసం రెడీ చేస్తున్నట్టుగా తెలిపారు. -
తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్..!
స్టార్ ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు కూడా భారీ బడ్జెట్ సినిమాలతో పరిచయం అవ్వాలంటే భయపడతారు. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, అఖిల్ లాంటి హీరోలు అలా భారీ బడ్జెట్ సినిమాలతో పరిచయమయ్యి నష్టపోయారు. ఈ ఇద్దరు హీరోలు పరిచయం అయ్యింది దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలతోనే. ఇప్పుడు ఈ రికార్డ్ లన్నింటినీ బ్రేక్ చేస్తూ తన తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్‌తో బరిలో దిగుతున్నాడు ఓ యంగ్ హీరో. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ కుమార్ జాగ్వర్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 75 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరిస్తున్న జాగ్వర్ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు. కన్నడ మార్కెట్ పరంగా చూస్తే మాత్రం ఇంత భారీ బడ్జెట్ చాలా పెద్ద రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సినిమాలకు కథ అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్, ఈ సినిమాకు కథ అందిస్తుండగా, బాలకృష్ణ హీరోగా మిత్రుడు సినిమాను తెరకెక్కించిన మహదేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్న జాగ్వర్ ఫస్ట్ లుక్‌ను ఈ నెల 31న కన్నడ, తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు. -
రాజమౌళి నెక్ట్స్ సినిమా అదే
ప్రస్తుతం, టాలీవుడ్లోనే కాదు జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో వినిపించే తెలుగు దర్శకుడి పేరు రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి సొంతం చేసుకున్న రాజమౌళి, ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బాహుబలి 600 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బాహుబలి 2 కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాల తరువాత రాజమౌళి చేయబోయే సినిమా ఏంటి అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి ఓ హిందీ సినిమాకు వర్క్ చేయనున్నాడు. కానీ ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు కాదు, కేవలం క్రియేటివ్ డైరెక్టర్‌గా తన సహాయం అందించనున్నాడు. ఇటీవల ఘాయల్ వన్స్ అగైన్ సినిమాతో నిరాశపరిచిన సన్నీడియోల్ త్వరలో మేరా భారత్ మహాన్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సక్సెస్ సినిమాల కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసమే రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్‌గా మారుతున్నాడట. గతంలో విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన రాజన్న సినిమా కోసం కూడా కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన జక్కన్న ఇప్పుడు మేరా భారత్ మహాన్ సినిమా కోసం మరోసారి తండ్రికి సాయం చేయడానికి రెడీ అవుతున్నాడు.