విజ్జి స్టేడియం పనులు వేగవంతం
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఆదేశం
విజయనగరం మున్సిపాలిటీ : విజ్జి స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన విజ్జి స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 2 కిలోమీటర్ల వాటర్ ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళ్లి పనుల ప్రగతిని పరిశీలించారు.
చిల్ట్రన్ పార్కు, లాన్‌టెన్నిస్, ఇంటర్నేషనల్ స్కేటింగ్ రింక్ ఏర్పాటుపై డీఎస్డీఓని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వి.వి.రామచంద్రరాజు జ్ఞాపకార్థం ఏటా 14 ఏళ్ల క్రీడాకారులకు ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం రూ. లక్ష మొత్తాన్ని సేకరించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు పాల్గొన్నారు.