వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే...
- ప్రత్యామ్నాయ రైల్లో వెళ్లే సౌకర్యం
- వికల్ప్ పథకాన్ని విస్తరించిన రైల్వే
న్యూఢిల్లీ: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం ఎంపిక చేసిన రూట్లలో రైల్వే శాఖ కొత్త ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైల్లో గమ్యానికి చేర్చేందుకు వికల్ప్ పథకాన్ని సోమవారం విస్తరించింది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని వారి ఇష్టం మేరకు వేరే రైల్లో వెళ్లవచ్చు. ఈ పథకం మెయిల్/ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వర్తిస్తుంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో చెల్లుబాటుకాదు. వికల్ప్ కింద ప్రత్యామ్యాయ వసతి కల్పించాక ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అనుమతించరు. చార్జీలో తేడాలున్నా రీఫండ్ ఇవ్వరు.ఎలాంటి అదనపు చార్జీలు కూడా ఉండవు.
జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి..
► తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే సగం మొత్తం వెనక్కిస్తారు. ప్రస్తుతం ఇందులో రీఫండ్ సౌకర్యం లేదు.
► తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పు. ఏసీ బుకింగ్‌లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ ఉదయం 11 నుంచి 12 వరకు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో కేవలం మొబైల్ టికెట్లనే అనుమతిస్తారు.
► ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుకింగ్ రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో బోగీల సంఖ్య పెంపు. దీనివల్ల ఎక్కుమంది కన్ఫర్మ్ టికెట్స్ పొందొచ్చు.
► సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయం. ఇవి రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మాదిరి తక్కువ స్టాప్‌లు ఉంటాయి. ► ప్రీమియం సర్వీసు రైళ్లకు ముగింపు. రైళ్లలో ప్రయాణికులకు గమ్యస్థానం వచ్చేటప్పుడు అప్రమత్తం చేసేందుకు ‘వేకప్ కాల్’ సౌకర్యం.
లెవెల్ క్రాసింగ్‌ల వద్ద హెచ్చరికలు.. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు రైల్వే సాంకేతికత సహాయంతో హెచ్చరికలు చేసే కొత్త విధానాన్ని అవలంబించనుంది. సీసీ కెమెరాలు, రేడియో పౌనఃపున్యం ఆధారంగా పనిచేసే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు. అన్రిజర్వ్డ్ రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్‌ను ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్లో పైలట్ ప్రాజెకు ్టకింద ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్లాట్‌పాం టికెట్, అన్రిజర్వ్డ్ టికెట్, సీజన్ టికెట్లను కొనొచ్చు. రైల్వేలో ట్రాక్ మరమ్మతులకు ట్రాక్‌మెన్, కీమెన్ల కోసం తేలికైన టూల్ కిట్‌ను రైల్వే తీసుకొచ్చింది.