గ్రామీణ వార్తలకు చోటేదీ..?
► మీడియా రంగంలోకి కార్పొరేట్ల రాకతో రాబడి వార్తలకే ప్రాధాన్యం
►రామన్ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్
►హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వి.హనుమంతరావు స్మారకోపన్యాసం
హైదరాబాద్: మీడియా రంగంలోకి కార్పొ రేట్ల ప్రవేశంతో ప్రధాన దినపత్రికలు, టెలివిజన్ చానళ్లలో గ్రామీణ, వ్యవసాయ వార్తలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 52వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘గ్రామీణ భారతంపై మీడియా దృష్టి’ అంశంపై వి.హను మంతరావు స్మారక ఉపన్యాసం ఇచ్చారు. సాయి నాథ్ మాట్లాడుతూ, 2012–16 మధ్య కాలంలో ప్రధాన దినపత్రికల మొదటి పేజీలు, టీవీ చానళ్ల ప్రైమ్టైమ్లలో వ్యవసాయంపై కేవలం 0.18 శాతం, గ్రామాలకు సంబంధించి 0.61 శాతం మాత్రమే కవరేజీ లభించిందని చెప్పారు. కార్పొరేట్ మీడియా ప్రధానంగా రెవెన్యూ రాబడి ఉన్న వార్తలనే ప్రచురిస్తోందని ఆరోపించారు.
ధ్వంసమవుతున్న ప్రజల జీవనం
ఆధ్యాత్మిక పర్యాటకం పేరుతో సహజ నదుల ప్రవాహాలకు పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారని, ప్రజల జీవనాన్ని ధ్వంసం చేస్తున్నారని సాయినా థ్ మండిపడ్డారు. గోదావరి నదీ పరివాహకం లోని సహజ వాగులు, వంకలు, చెరువులకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన నిర్మాణాల కారణంగా తొలిసారిగా మహరాష్ట్రలోని రామకుం డ పూర్తిగా ఎండి పోయిందన్నారు. ‘నాసిక్‌లో ద్రాక్ష తోటల పెంపకం బాగుంటుంది. ద్రాక్ష తోటలతో అక్కడి కూలీలకు ఏటా సుమారు 30 లక్షల నుంచి 40 లక్షల పనిదినాలు దొరుకుతా యి.
కాని జాతీయ కుంభమేళా కోసం ఆ ప్రాం తం నుంచి పెద్ద ఎత్తున నీటిని తరలించడంతో ద్రాక్ష తోటల పెంపకంపై ప్రభావం పడి రైతులు, కూలీలు ఇబ్బందుల పాలయ్యారు’ అని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు (నగదు లేక) ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు. నగదు లావాదేవీలను ఆపడం సాధ్యం కాదని గుర్తించిన కేంద్రం తిరిగి కొత్తనోట్లను మార్కెట్ లోకి విడుదల చేసిందని చెప్పారు. స్మారకో పన్యాసం అనంతరం సాయినాథ్‌ను ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు.
సమాజంలో పెరిగిన అసమానతలు
గత 20 ఏళ్లలో సమాజంలో అసమాన తలు బాగా పెరిగాయని సాయినాథ్ చెప్పారు. 1995 నుంచి ఇప్పటి వరకు 3.10 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకు న్నారని, ఆ సంఖ్యను తక్కువ చేసి చూపేం దుకు రైతు కాలమ్‌ను కౌలు రైతులు, వ్యవ సాయ కూలీలు, ఇతరులుగా నేషనల్ క్రైమ్ బ్యూరో విభజించిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా పశువుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతోందని, ఆవుల సంరక్షణ పేరుతో అల్ప సంఖ్యాక ప్రజలను లక్ష్యంగా చేసుకొని కేంద్రం తెచ్చిన నూతన నిబంధనలు దళితు లకు పెనుభారంగా మారగా, ఇతర వెనుక బడిన తరగతులు, మహారాష్ట్రలో మరాఠాల జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసేవిగా ఉన్నా యని ఆరోపించారు.