Vinegar
-
ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!
బరువు తగ్గడం నుంచి చర్మం, జుట్టు సంరక్షణ దాకా ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చళ్లు, మెరినేడ్స్ లాంటి వాటిల్లో కూడా విరివిగా వాడతారు. అయితే దీనిని తరచుగా ఉపయోగించడం మంచిదేనా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆపిల్ సైడర్ వెనిగర్(ACV) ఆపిల్ జ్యూస్ ఈస్ట్‌తో కలిపి పులియబెట్టి తయారు చేస్తారు. ఎక్కువగా డ్రెస్సింగ్, మెరినేడ్స్, పచ్చళ్ళలో వాడతారు. యాపిల్ సైడర్ వెనిగర్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు.అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల దుష్ర్పభావాలు కూడా ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, చికాకు కలుగుతాయి. అందుకే దీని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈస్ట్ ఆపిల్‌లోని చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి సమస్యలొస్తాయి. అలాగే గ్యాస్ట్రోపరేసిస్‌తో బాధపడేవారిలో కడుపులోని నరాలు సరిగ్గా పనిచేయవు. గ్యాస్ట్రోపరేసిస్ (గుండెల్లో మంట, ఉబ్బరం వికారం) లక్షణాలు, టైప్-1డయాబెటీస్, ఇన్సులిన్ తీసుకునేవారిలో జీర్ణం ఆలస్యమవుతుంది కొన్ని మూత్రవిసర్జన మందులు, మధుమేహం మందులు, డిగోక్సిన్ ఇన్సులిన్-స్టిమ్యులేటింగ్ మందులు వాడేవారికి ఆపిల్ సైడర్ వెనిగర్‌తో రియాక్షన్ రావచ్చు. సుదీర్ఘ కాలం పాటు దీన్ని తీసుకుంటే బ్లడ్‌లో పొటాషియం స్థాయిలు ప్రభావితవుతాయి. తద్వారా ఎముకల బలహీనత రావచ్చు. దీంట్లోని ఎసిడిక్ యాసిడ్ మూలంగా పళ్ల ఎనామిల్ పాడయ్యే అవకాశం. పిల్లల్లో గొంతుమంట వచ్చే అవకాశం. తలపై ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్( తరచుగా వాడటం వల్ల నల్లటి జుట్టు వాడిపోతుంది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు. ఈ నేపథ్యంలో చర్మం లేదా జుట్టుకు వాడేటపుడు మోతాదు నియంత్రణ పాటించాలి. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ కంటే ఎక్కువ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించ కూడదు. రోజుకు గరిష్టంగా 2 టేబుల్ స్పూన్లు (30 ఎంఎల్) మించ కూడదు. దీనికి అలర్జీలు సాధారణంగా రావు. ఒకవేళ వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. -
Beauty Tips: యాపిల్ సైడర్ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం!
యాపిల్ సైడర్ వెనిగర్ బరువుని నియంత్రణలో ఉంచడంతోపాటు చర్మం, జుట్టుని కూడా చక్కగా సంరక్షిస్తుంది. యాపిల్ సైడర్‌వెనిగర్‌ను ముఖానికి రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. ►వెనిగర్‌లో మూడొంతుల నీళ్లు కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరుపులీనుతూ కనిపిస్తుంది. ►యవ్వనంలో ఉన్న చాలామందికి మొటిమలు, నల్లమచ్చలు వేధిస్తుంటాయి. ►మొటిమలు మచ్చలపైన వెనిగర్ రాస్తే మచ్చలు ఇట్టే పోతాయి. ►వెనిగర్‌లోని పీహెచ్ స్థాయులు తక్కువగా ఉండడం చర్మానికి హాని లేకుండా సంరక్షిస్తుంది. కేశ పోషణ సైతం.. ►ముఖ చర్మానికి మాయిశ్చర్ అందించడంలో టోనర్లు చక్కగా పనిచేస్తాయి. ►మార్కెట్లో దొరికే వివిధ రకాల టోనర్ల కంటే యాపిల్ సైడర్ వెనిగర్ మంచి టోనర్‌గా బాగా పనిచేస్తుంది. ►సైడర్లో కొన్ని నీళ్లు కలిపి టోనర్‌లా వాడుకోవచ్చు. ►కాలుష్యం, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల.. చర్మం పొడిబారి చుండ్రు వచ్చేస్తుంది. ►అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చుండ్రు మాత్రం వదలదు. ►యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల చుండ్రుని నియంత్రణలో ఉంచుతాయి. ►వెనిగర్‌లో నీళ్లు కలిపి కుదుళ్ల నుంచి జుట్టువరకు పట్టిస్తే జుట్టుకు పోషణ అంది వెంట్రుకలు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి. చదవండి: Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
సింపుల్ క్లీనింగ్ టిప్స్: జిడ్డు మరకలా? ద్రాక్ష, నిమ్మకాయ, ఇంకా బ్రెడ్‌తో..
సింక్, బాత్ టబ్‌లకు అంటుకున్న మొండి, జిడ్డు మరకలను తొలగించడానికి ద్రాక్ష పండు, నిమ్మకాయ, వెనిగర్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ► ద్రాక్షపండును సగానికి ముక్కలు కోయాలి. బాత్‌టబ్ లేదా సింక్‌పై ఉప్పు చల్లాలి. వాటి మీద ద్రాక్ష పండు సగం ముక్కతో రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ► వెనిగర్‌ను సింక్ టాప్, బాత్ టబ్లపై చల్లి, గంట సేపు వదిలి, తర్వాత సోప్వాటర్ని ఉపయోగించి కడిగితే బాగా శ్రుభపడతాయి. ► కాఫీ ఫిల్టర్ శుభ్రపడాలంటే అందులో బ్లాటింగ్ పేపర్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వేయాలి. అటూ ఇటూ పదే పదే తిప్పాలి. (చదవండి: Health Tips: పాలమీగడలో ఏలకులను కలుపుకుని చప్పరిస్తే..) ► గోడలపైన వేలి ముద్రల మరకలు నూనె జిడ్డుగా కనిపిస్తుంటాయి. వీటిని వదిలించడానికి బ్రెడ్ స్లైస్‌ను తీసుకొని, మరకలపైన రబ్ చేసి, తుడవాలి. దీంతో నూనె మరకలు తగ్గిపోతాయి. అదే బ్రెడ్‌తో పగిలిన గ్లాసు ముక్కలను తీయడానికి కూడా ఉపయోగించవచ్చు. ► స్టౌ పై జిడ్డు మరకలు సాధారణంగా అవుతుంటాయి. నిమ్మరసం రాసి, బ్రెడ్ లేదా స్పాంజితో తుడవాలి. (చదవండి: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా) -
చుండ్రు నివారణకు
►వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ►చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.. ►ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ►కప్పు నీళ్లలో 2–3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. ►కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది. -
తళతళా... మిలమిలా...మీ చేతుల్లోనే...
ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం అంత సులభం కాదు. దాని కోసం సరైన ఉత్పత్తులు, పరికరాలు వాడడం చాలా అవసరం. నిత్యం ఇంటిని శుభ్రపరుచుకోవాలి కాబట్టి, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్నిచ్చే విధానాన్ని ఎంచుకోవడం అవసరం. అలా కాకుండా మార్కెట్లో దొరికే రకరకాల క్లీనర్లను కొంటే, ఇల్లు కాస్తా హోటల్ లాగానో, హాస్పిటల్ లాగానో అనిపిస్తుంది. ఇంటి గచ్చును శుభ్రం చేసుకోవడానికి వాడే సర్ఫేస్ క్లీనర్‌ను సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాత్రలు కడగడానికి వాడే ద్రావణాన్ని రెండు టేబుల్‌స్పూన్లు తీసుకొని, రెండు కప్పుల నీళ్ళు కలిపి, స్ప్రే బాటిల్లో దాచుకుంటే అదే సర్ఫేస్ క్లీనర్. గాజు సామాన్లను క్లీన్ చేసుకొనే ద్రావణాన్ని కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక వంతు వినెగర్‌కు ఒక వంతు నీళ్ళు కలిపి, ఓ స్ప్రే బాటిల్లో ఉంచుకొంటే, అది గాజు సామాన్లను శుభ్రం చేయడానికి పనికొస్తుంది. అలాగే, చేతికి రబ్బరు తొడుగులు, ఇంట్లో దుమ్మూ ధూళి దులపడానికి ఓ చేతి గుడ్డ అవసరం. ఉప్పు, వంట సోడా, వినెగర్, నిమ్మకాయ లాంటివి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తోడ్పడతాయి. ఉప్పు - కప్పులు, మగ్గులు టీ, కాఫీ మరకలతో ఎబ్బెట్టుగా తయారైతే, వాటిలో కొద్దిగా ఉప్పు చల్లి, అలా కాసేపు ఉంచేయాలి. ఆ తరువాత వాటిని రుద్ది, కడిగితే మరక మాయం. కప్పులు, మగ్గులు తేమగా ఉన్నప్పుడు ఈ పని చేస్తే మరింత సులభంగా పని జరుగుతుంది. కూరలు తరిగే పీట క్రిమిరహితంగా ఉండాలంటే, దాని మీద కొద్దిగా ఉప్పు చల్లి, కొన్ని నిమిషాల తరువాత బాగా రుద్ది, నీటితో కడిగేయాలి. అల్యూమినియమ్ ఫ్రేమ్‌లను శుభ్రం చేయాలంటే, తడి గుడ్డ మీద కొద్దిగా ఉప్పు చల్లి, దానితో ఆ ఫ్రేమ్‌లను తుడవాలి. చీమలు, ఈగల బెడద లేకుండా ఉండాలంటే, నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, దానితో గచ్చు తుడిస్తే సరి. వంట సోడా - వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద పడ్డ మరకలను పోగొట్టాలంటే, సమపాళ్ళలో వంటసోడా, ఉప్పు కలిపి, పేస్ట్‌లా తయారు చేసి, తుడవాలి. ఇంట్లోని చెత్తబుట్టలు, యాష్ట్రేలు వాసన రాకుండా ఉండాలంటే, శుభ్రం చేశాక, కొద్దిగా వంట సోడా వాటిలో చల్లాలి. ఫ్రిజ్ తీయగానే వాసన రాకుండా ఉండాలంటే, మధ్య అరలో ఓ చిన్న గిన్నెలో వంటసోడా పోసి, ఉంచాలి. స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే, వంటసోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి తయారు చేసిన పేస్ట్‌తో రుద్దాలి. పాత టూత్‌బ్రష్‌తో టైల్స్ మీద రుద్దవచ్చు. వినెగర్ - కొన్నిసార్లు తూముల్లో ఏదైనా అడ్డుపడినట్లయి, నీళ్ళు పోకవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక్కో కప్పు ఉప్పు, వినెగర్, వంట సోడాలను తీసుకొని, ఆ మిశ్రమాన్ని తూము దగ్గర వేసి, అలా ఓ రాత్రి అంతా ఉంచేయాలి. తెల్లారాక, ఓ రెండు మగ్గుల వేడి వేడి నీళ్ళు అక్కడ పోస్తే, తూముల్లో అడ్డు తొలగిపోతుంది. అలాగే, కొన్నిసార్లు షవర్‌హెడ్‌లో ఏదో అడ్డుపడినట్లయి, నీళ్ళు సరిగ్గా రావు. దాన్ని ఊడదీసి, రాత్రి తెల్లవార్లూ వినెగర్‌లో ముంచి, ఉండాలి. తెల్లవారాక బలమైన బ్రష్‌తో దాన్ని రుద్దాలి. గాజు సామాన్లను కడిగేటప్పుడు నీటికి, కొద్దిగా వినెగర్ కలిపితే చాలు. సామాన్లు తళతళా మెరిసిపోతాయి.