తళతళా... మిలమిలా...మీ చేతుల్లోనే...
ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం అంత సులభం కాదు. దాని కోసం సరైన ఉత్పత్తులు, పరికరాలు వాడడం చాలా అవసరం. నిత్యం ఇంటిని శుభ్రపరుచుకోవాలి కాబట్టి, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్నిచ్చే విధానాన్ని ఎంచుకోవడం అవసరం. అలా కాకుండా మార్కెట్‌లో దొరికే రకరకాల క్లీనర్లను కొంటే, ఇల్లు కాస్తా హోటల్ లాగానో, హాస్పిటల్ లాగానో అనిపిస్తుంది.
ఇంటి గచ్చును శుభ్రం చేసుకోవడానికి వాడే సర్ఫేస్ క్లీనర్‌ను సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాత్రలు కడగడానికి వాడే ద్రావణాన్ని రెండు టేబుల్‌స్పూన్లు తీసుకొని, రెండు కప్పుల నీళ్ళు కలిపి, స్ప్రే బాటిల్‌లో దాచుకుంటే అదే సర్ఫేస్ క్లీనర్.
గాజు సామాన్లను క్లీన్ చేసుకొనే ద్రావణాన్ని కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక వంతు వినెగర్‌కు ఒక వంతు నీళ్ళు కలిపి, ఓ స్ప్రే బాటిల్‌లో ఉంచుకొంటే, అది గాజు సామాన్లను శుభ్రం చేయడానికి పనికొస్తుంది. అలాగే, చేతికి రబ్బరు తొడుగులు, ఇంట్లో దుమ్మూ ధూళి దులపడానికి ఓ చేతి గుడ్డ అవసరం.
ఉప్పు, వంట సోడా, వినెగర్, నిమ్మకాయ లాంటివి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తోడ్పడతాయి. ఉప్పు - కప్పులు, మగ్గులు టీ, కాఫీ మరకలతో ఎబ్బెట్టుగా తయారైతే, వాటిలో కొద్దిగా ఉప్పు చల్లి, అలా కాసేపు ఉంచేయాలి. ఆ తరువాత వాటిని రుద్ది, కడిగితే మరక మాయం. కప్పులు, మగ్గులు తేమగా ఉన్నప్పుడు ఈ పని చేస్తే మరింత సులభంగా పని జరుగుతుంది.
కూరలు తరిగే పీట క్రిమిరహితంగా ఉండాలంటే, దాని మీద కొద్దిగా ఉప్పు చల్లి, కొన్ని నిమిషాల తరువాత బాగా రుద్ది, నీటితో కడిగేయాలి.
అల్యూమినియమ్ ఫ్రేమ్‌లను శుభ్రం చేయాలంటే, తడి గుడ్డ మీద కొద్దిగా ఉప్పు చల్లి, దానితో ఆ ఫ్రేమ్‌లను తుడవాలి. చీమలు, ఈగల బెడద లేకుండా ఉండాలంటే, నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, దానితో గచ్చు తుడిస్తే సరి.
వంట సోడా - వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద పడ్డ మరకలను పోగొట్టాలంటే, సమపాళ్ళలో వంటసోడా, ఉప్పు కలిపి, పేస్ట్‌లా తయారు చేసి, తుడవాలి. ఇంట్లోని చెత్తబుట్టలు, యాష్‌ట్రేలు వాసన రాకుండా ఉండాలంటే, శుభ్రం చేశాక, కొద్దిగా వంట సోడా వాటిలో చల్లాలి.
ఫ్రిజ్ తీయగానే వాసన రాకుండా ఉండాలంటే, మధ్య అరలో ఓ చిన్న గిన్నెలో వంటసోడా పోసి, ఉంచాలి. స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే, వంటసోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి తయారు చేసిన పేస్ట్‌తో రుద్దాలి. పాత టూత్‌బ్రష్‌తో టైల్స్ మీద రుద్దవచ్చు.
వినెగర్ - కొన్నిసార్లు తూముల్లో ఏదైనా అడ్డుపడినట్లయి, నీళ్ళు పోకవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక్కో కప్పు ఉప్పు, వినెగర్, వంట సోడాలను తీసుకొని, ఆ మిశ్రమాన్ని తూము దగ్గర వేసి, అలా ఓ రాత్రి అంతా ఉంచేయాలి. తెల్లారాక, ఓ రెండు మగ్గుల వేడి వేడి నీళ్ళు అక్కడ పోస్తే, తూముల్లో అడ్డు తొలగిపోతుంది. అలాగే, కొన్నిసార్లు షవర్‌హెడ్‌లో ఏదో అడ్డుపడినట్లయి, నీళ్ళు సరిగ్గా రావు. దాన్ని ఊడదీసి, రాత్రి తెల్లవార్లూ వినెగర్‌లో ముంచి, ఉండాలి. తెల్లవారాక బలమైన బ్రష్‌తో దాన్ని రుద్దాలి. గాజు సామాన్లను కడిగేటప్పుడు నీటికి, కొద్దిగా వినెగర్ కలిపితే చాలు. సామాన్లు తళతళా మెరిసిపోతాయి.