VIP visits
-
శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు
తిరుమల: వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం లభిస్తుంది. 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించి జూలై, ఆగస్టు నెలల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్సైట్ https://tiru patibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరుమలలో శ్రీవారిని శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రికి 81,833 మంది దర్శించుకున్నారు. హుండీలో కానుకల రూపంలో రూ.3.31 కోట్లు సమర్పించారు. శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టికెట్లు లేని భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. -
వీఐపీ దర్శనం చేయిస్తా..!
ఇంద్రకీలాద్రి (విజయవాడ వెస్ట్) : అందరికీ గ్రూప్గా వీఐపీ దర్శనం చేయిస్తా... అంతరాలయంలోకి పంపుతాను... మామూలుగా అయితే టికెటు రూ.300... మీరు ఐదుగురికి రూ.వెయ్యి ఇవ్వండి చాలు.. అమ్మవారిని దగ్గర నుంచి కూడా చూడవచ్చు... అంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న ముఠా ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తిరుగుతోంది. ఈ ముఠాలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఘాట్ రోడ్డులోని పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలలో పని చేసిన కొంత మంది వ్యక్తులు ఈ విధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం ఓ భక్తుల బృందాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కొంత మంది భక్తులను పూర్ణా అనే వ్యక్తి కలిశాడు. అందరికీ వీఐపీ దర్శనం చేయిస్తానని డీల్ మాట్లాడుకున్న తర్వాత వారిని అంతరాలయంలో దర్శనానికి పంపుతానని చెప్పి వారిని క్యూ లైన్లోకి పంపాడు. అయితే వారు అంతరాలయంలోకి కాకుండా ముఖ మండప దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పూర్ణా కనిపించలేదు. దీంతో ఆగ్రహించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో వెతికారు. కొద్దిసేపు తర్వాత పూర్ణా కనిపించడంతో వారు నిలదీశారు. దీంతో వారి మధ్య వాదోపవాదనలు జరగడంతో పోలీసులు పూర్ణాను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ సిబ్బంది పాత్రపై ఆరా... ముఠాకు సహకరిస్తున్న ఆలయ సిబ్బందిపైనా ఈవో ఆరా తీస్తున్నట్లు సమాచారం. నకిలీ టికెట్లు, టికెట్ల రీసైకిలింగ్పై దృష్టి పెట్టడంతో కొందరు సిబ్బంది రూటు మార్చి ఈ ముఠాతో చేతులు కలిపారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిబ్బంది సహకారం లేకుండా ఇటువంటి దర్శనాలు సాధ్యం కాదనేది ఆలయ ఉన్నతాధికారుల మాట. -
‘30,31ల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు’
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ, 30వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జనవరి 1వ తేదీ నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 30, 31 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తిరుమల జేఈవో కె.ఎస్. శ్రీనివాసరాజు చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రద్దీ కారణంగా ఆది, సోమవారాల్లో కూడా ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. ఏకాదశి దర్శనంకోసం ప్రముఖుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ నుంచి పద్మావతి అతిథిగృహాల్లోని గదుల కేటాయింపులు నిలిపేస్తామన్నారు. దాతలు, వీఐపీ సిఫారసులకు గదుల జారీ నిలిపివేసి సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామన్నారు. ఏకాదశి, ద్వాదశిల్లో రూ.25 చొప్పున ఆలయం వెలుపల కౌంటర్లలో రోజుకు రెండు లక్షల లడ్డూలు విక్రయిస్తామని, అవసరమైతే మరో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో భక్తుడికి రెండు లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పారు. -
'ఇకపై ఆన్లైన్లో మాత్రమే విక్రయం'
తిరుపతి : వెంకన్నసామాన్య భక్తులకు కష్టాలు తీరనున్నాయి. తిరుపతి దర్శనం టిక్కట్ల కోసం ఇక రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తిరుమలకు చేరుకున్న భక్తులకు శీఘ్ర దర్శనం టికెట్ల కోసం టీటీడీ ప్రత్యేక ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. శీఘ్రదర్శనం టికెట్లు కూడా ఇకపై ఆన్లైన్లో మాత్రమే విక్రయించనున్నారు. ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం త్వరలో కల్పిస్తామని తిరుమల జేఈవో శ్రీనివాస రాజు మంగళవారం తెలిపారు. అలాగే తిరుమలలో వీఐపీ దర్శనాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా వీఐపీ సిఫార్సు లేఖలను తగ్గిస్తూ చివరకు పూర్తిగా రద్దు చేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు కూడా వెల్లడించారు. -
తిరుమలలో వీఐపీ చిట్టీలకు చెల్లుచీటీ...
సాక్షి, హైదరాబాద్: తిరుమలలో వీఐపీ దర్శనాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా వీఐపీ చిట్టీలను తగ్గిస్తూ చివరకు పూర్తిగా రద్దుచేయాలని భావి స్తోంది. ఇటీవల ఏపీ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ రెండుసార్లు తిరస్కరించింది. సోమవారం మంత్రిమండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువచ్చారు. దేవాదాయ మంత్రి బుధవారం టీటీడీ అధికారులను హైదరాబాద్కు పిలిచి తిరుమలపై సమీక్ష నిర్వహించారు. గత కొన్నేళ్లుగా తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య ఏ మేరకు ఉందో అంచనా వేశారు. రానున్న కాలంలో రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాకు వచ్చారు. వీఐపీ చిట్టీలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని, దర్శన సమయం 30 గంటలకు పైగా పడుతోందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ సమయాన్ని సాధ్యమైనంతమేర తగ్గించాలన్న అభిప్రాయానికి వచ్చారు. నడకదారి భక్తుల సంఖ్య పెరగటం కూడా టీటీడీకి ఇబ్బందిగా మారుతోంది. శీఘ్రదర్శనం టికెట్లు కూడా ఇకపై ఆన్లైన్లో మాత్రమే విక్రయించనున్నారు. తిరుమలకు చేరుకున్న భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లకోసం ప్రత్యేక ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. కాగా దేవాలయాలన్నిటినీ సమాచారహక్కు చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయాలు భక్తుల కానుకలతో నడుస్తున్నాయన్న ఉద్దేశంతో తొలుత ఈ చట్టం పరిధిలోకి చేర్చలేదు.