సాక్షి, హైదరాబాద్: తిరుమలలో వీఐపీ దర్శనాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా వీఐపీ చిట్టీలను తగ్గిస్తూ చివరకు పూర్తిగా రద్దుచేయాలని భావి స్తోంది. ఇటీవల ఏపీ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ రెండుసార్లు తిరస్కరించింది. సోమవారం మంత్రిమండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువచ్చారు. దేవాదాయ మంత్రి బుధవారం టీటీడీ అధికారులను హైదరాబాద్‌కు పిలిచి తిరుమలపై సమీక్ష నిర్వహించారు.
గత కొన్నేళ్లుగా తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య ఏ మేరకు ఉందో అంచనా వేశారు. రానున్న కాలంలో రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాకు వచ్చారు. వీఐపీ చిట్టీలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని, దర్శన సమయం 30 గంటలకు పైగా పడుతోందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ సమయాన్ని సాధ్యమైనంతమేర తగ్గించాలన్న అభిప్రాయానికి వచ్చారు. నడకదారి భక్తుల సంఖ్య పెరగటం కూడా టీటీడీకి ఇబ్బందిగా మారుతోంది. శీఘ్రదర్శనం టికెట్లు కూడా ఇకపై ఆన్‌లైన్లో మాత్రమే విక్రయించనున్నారు. తిరుమలకు చేరుకున్న భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లకోసం ప్రత్యేక ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. కాగా దేవాలయాలన్నిటినీ సమాచారహక్కు చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయాలు భక్తుల కానుకలతో నడుస్తున్నాయన్న ఉద్దేశంతో తొలుత ఈ చట్టం పరిధిలోకి చేర్చలేదు.
తిరుమలలో వీఐపీ చిట్టీలకు చెల్లుచీటీ...
Published Thu, Jul 24 2014 2:29 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM
Advertisement
Advertisement