ఇంద్రకీలాద్రి (విజయవాడ వెస్ట్) : అందరికీ గ్రూప్‌గా వీఐపీ దర్శనం చేయిస్తా... అంతరాలయంలోకి పంపుతాను... మామూలుగా అయితే టికెటు రూ.300... మీరు ఐదుగురికి రూ.వెయ్యి ఇవ్వండి చాలు.. అమ్మవారిని దగ్గర నుంచి కూడా చూడవచ్చు... అంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న ముఠా ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తిరుగుతోంది. ఈ ముఠాలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఘాట్ రోడ్డులోని పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలలో పని చేసిన కొంత మంది వ్యక్తులు ఈ విధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు.
ఇదే తరహాలో గురువారం ఓ భక్తుల బృందాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కొంత మంది భక్తులను పూర్ణా అనే వ్యక్తి కలిశాడు. అందరికీ వీఐపీ దర్శనం చేయిస్తానని డీల్ మాట్లాడుకున్న తర్వాత వారిని అంతరాలయంలో దర్శనానికి పంపుతానని చెప్పి వారిని క్యూ లైన్‌లోకి పంపాడు. అయితే వారు అంతరాలయంలోకి కాకుండా ముఖ మండప దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పూర్ణా కనిపించలేదు. దీంతో ఆగ్రహించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో వెతికారు. కొద్దిసేపు తర్వాత పూర్ణా కనిపించడంతో వారు నిలదీశారు. దీంతో వారి మధ్య వాదోపవాదనలు జరగడంతో పోలీసులు పూర్ణాను అదుపులోకి తీసుకున్నారు.
ఆలయ సిబ్బంది పాత్రపై ఆరా...
ముఠాకు సహకరిస్తున్న ఆలయ సిబ్బందిపైనా ఈవో ఆరా తీస్తున్నట్లు సమాచారం. నకిలీ టికెట్లు, టికెట్ల రీసైకిలింగ్‌పై దృష్టి పెట్టడంతో కొందరు సిబ్బంది రూటు మార్చి ఈ ముఠాతో చేతులు కలిపారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిబ్బంది సహకారం లేకుండా ఇటువంటి దర్శనాలు సాధ్యం కాదనేది ఆలయ ఉన్నతాధికారుల మాట.
Comments
Please login to add a commentAdd a comment