Virtual network
-
నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది?
మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. జపాన్‌లో మంచి ఆదరణ ఉన్న వీట్యూబింగ్ (వర్చువల్ యూట్యూబ్ స్టార్స్) మన దేశంలోకి ప్రవేశించింది. పాపులర్ కావడానికి రెడీగా ఉంది... వెండిరంగు జుట్టు, వెరైటీ కళ్లద్దాలతో ఆకట్టుకునే జాక్నిఎక్స్ తన యూట్యూబ్ చానల్లో పాపులర్ వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. జాక్నిఎక్స్కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతడి ఆటను, మాటను అమితంగా ఇష్టపడుతుంటారు. నిజానికి జాక్నిఎక్స్ నిజం కాదు. దక్షిణాదికి చెందిక ఒక స్టూడెంట్ సృష్టించిన డిజిటల్ అవతార్! మన దేశంలో 90కి పైగా వీట్యూబ్ అవతార్స్ ఉన్నాయి. సాధారణంగా వీట్యూబ్ అవతార్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ ఫీచర్స్‌తో కనిపిస్తుంటాయి. ‘వీట్యూబింగ్’ అనేది 2016లో జపాన్‌కు పరిచయమైంది. స్ట్రీమ్గేమ్స్, ఇంటర్నెట్ ట్రెండ్స్, మ్యూజిక్, ఆర్ట్...ఇలా రకరకాల విభాగాల్లో వీట్యూబ్ అవతార్స్ వీక్షకులను వినోదపరుస్తున్నాయి. ‘వీట్యూబర్స్’ అనే పదం జపాన్‌లోనే పుట్టింది. రికు తజుమితో జపాన్‌లో ‘వీట్యూబర్స్’ ట్రెండ్ అగ్రస్థాయికి చేరుకుంది. 26 సంవత్సరాల రికు తజుమి జపాన్‌లోని యంగెస్ట్ బిలియనీర్లలో ఒకరు కావడానికి కారణం ‘ఎనీ కలర్’ అనే స్టార్టప్. యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే 21 సంవత్సరాల వయసులో ఇచికర (శూన్యం నుంచి) అనే ఎంటర్టైన్మెంట్ స్టార్టప్‌ను మొదలు పెట్టాడు రికు. ఆ తరువాత దీని పేరును ‘ఎనీ కలర్’గా మార్చాడు. వీట్యూబర్స్ ప్రపంచంలో ‘ఎనీ కలర్’ అగ్రస్థానంలోకి దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘ఏ న్యూ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్’ అనే నినాదంతో నిజజీవితానికి చెందిన వందమంది వర్చువల్ క్యారెక్టర్స్‌ను ఇది సృష్టించింది. యూజర్స్, క్రియేటర్స్‌కు మధ్య సరిహద్దులు లేకుండా చేయడమే తన విధానం అని చెబుతోంది. ఎన్నో వీట్యూబర్స్ ఏజెన్సీలకు ‘ఎనీ కలర్’ మాతృసంస్థగా ఉంది. ‘కోవిడ్ సమయంలో మన దేశంలో ఊపందుకున్న వర్చువల్ యూట్యూబర్ ధోరణి మెయిన్‌స్ట్రీమ్ పాపులారిటీకి దగ్గరలో ఉంది’ అంటున్నాడు వీట్యూబర్ టాలెంట్ ఏజెన్సీ ‘ప్రాజెక్ట్ స్టార్‌స్కేప్’ ఫౌండర్ వేణు జీ జోషి. ‘వీట్యూబింగ్ అనేది ప్రైవసీని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. మీ ముఖం బాగాలేదు, మీ గొంతు బాగలేదు... వంటి విషపూరితమైన ట్రోలింగ్ నుంచి బయటపడవచ్చు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఏమో అనే సంశయం లేకుండా ధైర్యంగా కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు’ అంటుంది అసలు పేరే ఏమిటో తెలియని దిల్లీకి చెందిన వర్చువల్ అవతార్ సకుర. వర్చువల్ అవతార్స్ పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అవతార్ పరిచయం ఇలా ఉంటుంది: ‘రెండు వందల సంవత్సరాల వయసు ఉన్న ఈ బాలికకు అపారమైన మాంత్రిక శక్తులు ఉన్నాయి’ చాలామంది మోడల్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తుండగా కొందరు మాత్రం పురాణాలలోని చిత్ర విచిత్ర పాత్రలను ఎంచుకుంటున్నారు. 19 సంవత్సరాల వీట్యూబర్ ‘మియో’ సగం మనిషి, సగం భూతంతో కూడిన అవతార్‌ను సృష్టించుకుంది. కొందరు తమ అవతార్లకు తామే గొంతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం గొంతులో వైవిధ్యం కోసం వాయిస్ మాడ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇండియన్ వీట్యూబ్ కమ్యూనిటీస్ కోసం రెడిట్‌లో ప్రత్యేకమైన పేజీ నిర్వహిస్తున్న హర్ష్ ‘వీట్యూబర్స్’కు వీరాభిమాని. ‘వీట్యూబర్ను చూస్తే స్నేహితుడిని చూసినట్లుగానే ఉంటుంది. వారి షోలో భాగమైతే రియాలిటీ షోలో భాగమైనట్లు అనిపిస్తుంది’ అంటున్నాడు హర్ష్. అభిమానం, విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా అప్‌కమింగ్ వీట్యూబర్స్ కోసం ‘వర్చువలిజం’లాంటి కంపెనీలు వచ్చాయి. వీట్యూబర్గా మారాలని, తమను తాము నిరూపించుకోవాలనే ఆసక్తి యూత్‌లో పెరిగింది. ఇదీ చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’ -
పేరు వర్చువల్ డేటింగ్...తీరు చీటింగ్!
సాక్షి, హైదరాబాద్: అనుభవాల కోసం ఆరాటం, అడ్వంచరస్ అనుబంధాలపై ఆసక్తి...సిటీజనులను తొలుత డేటింగ్ తర్వాత చీటింగ్ వైపు నడిపిస్తున్నాయి. సిటిజనుల్లోని బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ వారధిగా మోసాలకు తెగబడుతున్న సంస్థలు, వ్యక్తులు ఎందరో.. ‘డియర్ సర్ వెల్కమ్ టూ డేటింగ్ సర్వీసెస్.. ఆర్యూ ఫీలింగ్ అలోన్ ఫైండ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లొకాలిటీ ఫర్ డేటింగ్, చాటింగ్, మీటింగ్... ఫర్ డిటైల్స్ ప్లీజ్ కాంటాక్ట్ నెం...’ అంటూ శ్రీనగర్‌కాలనీ వాసి సత్యేష్కి ఓ మొబైల్ సందేశం వచ్చింది. ఆ నెంబర్‌కి కాల్ చేస్తే.. తాము కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న తరహా ఒంటరి మహిళల కాంటాక్ట్ నెంబర్లు అందిస్తామని అవతలనుంచి ఓ అమ్మాయి చెప్పింది. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై సహా ఏ నగరంలో కావాలంటే ఆ నగరంలో కాంటాక్టస్ ఇస్తామని చెప్పింది. మొత్తం 48 మంది నెంబర్లు ఇస్తామని, వారితో కావాల్సిన రిలేషన్ ఏర్పరచుకోవచ్చునంది. దీనికి గాను రూ.2100కి మించి తమకేమీ చెల్లించనక్కర్లేదంది. చదవండి: ఢిల్లీ గ్యాంగ్.. లక్షలు వసూల్! ► ఉప్పల్‌లో నివసించే కాంత్కి ఎఫ్బీలో పరిచయమైన ఓ మహిళ ఫోన్సెక్స్కి రమ్మంటూ మెసెంజర్ ద్వారా ఆహ్వానించింది. అతను ఓకే అన గానే అలా సెక్స్ చాట్ చేయడానికి తనకు పావుగంటకు ఇంత చొప్పున చెల్లించాలని కోరింది. ► కూకట్పల్లి నివాసి రాజ్‌కి ఓ డేటింగ్ సైట్ ద్వారా పరిచయమైన పద్మ...అనే మహిళ కలవడానికి మాదాపూర్‌లోని ఖరీదైన కాస్మెటిక్స్ విక్రయ షోరూమ్ దగ్గరకు రమ్మంది. అక్కడ అతనితో కబుర్లు చెబుతూ రూ.8 వేల విలువైన షాపింగ్ చేసింది. బిల్ చెల్లించే టైమ్‌లో కాస్త డబ్బు తగ్గిందని రాజ్ మొత్తం బిల్ పే చేసేస్తే షాప్ బయటకు వెళ్లగానే ఇస్తానని నమ్మబలికి బయటకు రాగానే మస్కా కొట్టి తప్పించుకుంది. కరోనా తర్వాత పుంజుకుంది.. లాక్‌డవున్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి డిజిటల్ ప్ర పంచాన్ని మరింతగా నగరవాసులకు సన్నిహితం చేశా యి. ఎక్కువ సేపు డిజిటల్ లోకంలో నివసించే అవసరాన్ని, అలవాటుని నేర్పించాయి. అవే ఇప్పుడు చీటర్స్కి వరంలా మారుతోంది. ముఖ్యంగా టీనేజర్స్, సింగిల్స్ ఎక్కువగా వీరి వలలో పడుతున్నారు. ప్రతి రో జూ ఒక నగరవాసి అయినా డేటింగ్ పేరిట దోపిడీకి గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన డేటింగ్ సేవల సమాచారం...పలువుర్ని చీటింగ్ బాధితులుగా మిగులుస్తోంది. బలహీన మనస్తత్వం ఉన్న మగవాళ్ల నుంచి డబ్బులు గుంజడమే థ్యేయంగా సాగుతున్న ఈ దందా తీవ్రత సదరు బలహీనత స్థాయిని బట్టి మారుతోంది. వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకున్నవారికి కూడా ఇది లాభసాటిగా మారింది. ఇలాంటి వారికి వేల రూపాయలు సమర్పించుకుని ఆనక తాము మోసపోయామని తెలిసినా కూడా కిక్కురుమనకుండా ఊరుకుంటున్నవారు నగరంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. చిక్కరు.. దొరకరు.. ఈ మోసాలకు పాల్పడుతున్నవారు టెక్నికల్‌గా అప్రమత్తంగా ఉంటున్నారు. వాట్సాప్‌లో చాట్ డిలీట్ కాదు కాబట్టి టెలిగ్రామ్ వాడడం వంటి అనేక జాగ్రత్తలను పాటిస్తూ.. సైబర్ చట్టాలకు చిక్కకుండా ఈ దోపిడీ సాగుతోంది. ఈ నేపధ్యంలో వీరి వలలో పడకుండా ఉండడానికి స్వీయ నియంత్రణే శరణ్యమని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు. -
ఫేస్బుక్ సమర్పించు.. వరల్డ్రూమ్
కరోనా భయం నీడలా వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో ప్రముఖ సంస్థలు కొన్ని ‘ఫిజికల్ వర్క్‌స్పేస్ ముఖ్యం కాదు’ అంటున్నాయి. ‘వర్చువల్ మీటింగ్’కు జై కొడుతున్నాయి. వర్చువల్ మీటింగ్ సాఫ్ట్వేర్లకు మంచి మార్కెట్ ఉన్న ఇలాంటి సమయంలో ‘నేనున్నానని’ అంటూ హరైజన్ వర్క్‌రూమ్స్ బీటాతో ముందుకు వచ్చింది బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్. చాలా కాలంగా వీఆర్ (వర్చువల్ రియాలిటీ) –ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) మీద దృష్టి పెట్టిన ఫేస్‌బుక్‌కు ‘హరైజన్ రూమ్స్’ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా మారింది. ‘ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం చూపించాలనేది మా ప్రయత్నం’ అంటున్నాడు సీయివో మార్క్ జుకర్ బర్గ్. హరైజన్ వర్క్‌రూమ్స్ ఉపయోగించడానికి ‘వర్క్‌రూమ్’ ఎకౌంట్‌తో పాటు ఓకులస్ క్వెస్ట్ హెడ్సెట్ తప్పనిసరి. అవతార్ వెర్షన్లో గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించుకోవచ్చు. ఎక్కడో ఉన్నవారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లు కాకుండా అందరూ ఒకేచోట, ఒకేగదిలో ఉన్నట్లుగా ఉంటుంది. జర్నలిస్ట్ ఎలెక్స్ హీత్ హరైజన్ రూమ్స్ గురించి ఇలా అంటున్నారు... ‘మార్క్ జుకర్‌బర్గ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాను. అయితే ఇది వీఆర్ కాన్ఫరెన్స్. యు–ఆకారంలోని టేబుల్ చుట్టూ నాతో పాటు ఎందరో రిపోర్టర్లు కూర్చున్నారు. జుకర్‌బర్గ్ అవతార్ మా ముందు ప్రత్యక్షమయ్యాడు. హరైజన్ వర్క్‌రూమ్స్ న్యూ యాప్‌ను పరిచయం చేశాడు. అందరం ఒకేదగ్గర, ఒకే చోట ఉన్నట్లుగా అనిపించింది. ఇదొక అద్భుతమైన అనుభవం. వీఆర్ ఎక్స్పీరియన్స్ కిక్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో వీఆర్ ప్రేమికులను మాత్రమే కాదు దాని గురించి అంతగా తెలియని వారిని కూడా ఈ సాఫ్ట్వేర్ ఆకట్టుకుంటుంది’ ‘ప్రపంచంలో ఆ మూల ఒకరు, ఈ మూల ఒకరు ఉండవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న అందరినీ ఒకే రూమ్‌లోకి తీసుకువస్తున్నాం. ఇది సృజనాత్మక ఆలోచనలకు విశాలమైన వేదిక. ప్రయోగాల కేంద్రం’ అంటుంది ఫేస్బుక్ ప్రచార వీడియో.‘ఏ ప్లేస్ టు ట్రై సమ్‌థింగ్ న్యూ’ అని నొక్కి వక్కాణిస్తుంది. ఆ కొత్తదనం అనుభవంలోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందేమోగానీ... హరైజన్ వర్క్రూమ్స్పై చాలా అంచనాలే ఉన్నాయి. స్పెషియల్ హలిగ్రాఫిక్ కొలబొరేషన్ ప్లాట్‌ఫా మ్కు ఇది ఏ రకంగా భిన్నమైనదో వేచిచూద్దాం. మెటవర్స్ అంటే? జుకర్‌బర్గ్ మాటల్లో ‘మెటవర్స్’ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇంతకీ ఏమిటీ మెటవర్స్? స్థూలంగా చెప్పాలంటే... కలెక్టివ్ వర్చువల్ షేర్డ్ స్పేస్. నీల్ స్టీఫెన్సన్ తన సైన్స్–ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్’లో ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ నవలలో మనుషులు ‘అవతార్’ల ఆకారంలో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతుంటారు. గ్రీకు పదం ‘మెటా’ (అవతలి వైపు)కు ప్రత్యామ్నాయం మెటవర్స్. ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే... మెటవర్స్కు కంటెంట్ సర్వీసెస్, ఇంటర్‌ఛేంజ్ టూల్స్, స్టాండర్డ్స్, వర్చువల్ ప్లాట్‌ఫామ్స్, నెట్వర్కింగ్ కంప్యూట్, హార్డ్‌వేర్... అనేవి మూలస్తంభాలు. చదవండి : గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే? -
ఆన్లైన్ మీటింగ్.. ఇక నో చీటింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: వర్చువల్ సమావేశాలకు అనుమతి లేకుండా రహస్యంగా హాజరయ్యే వారిని గుర్తించొచ్చని పంజాబ్‌లోని రోపర్ ఐఐటీ ప్రొఫెసర్ అభినవ్ ధాల్ తెలిపారు. ‘ఫేక్‌బస్టర్’ అనే ప్రత్యేకమైన డిటెక్టర్‌ను రోపర్ ఐఐటీ, ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎవరినైనా అపఖ్యాతిపాలు చేయడానికి లేదా ఎగతాళి చేయడానికి సోషల్ మీడియాలో నకిలీ ముఖాలతో పోస్టులు పెట్టినా కూడా కనుగొనవచ్చు. ప్రస్తుతం మహమ్మారి కారణంగా, అధికారిక సమావేశాలు చాలావరకు ఆన్లైన్లో జరుగుతున్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ సమయంలో ఒకరిస్థానంలో వేరే వాళ్లు పాల్గొన్నా లేదా అక్రమంగా ఉపయోగించుకున్నా సమావేశ నిర్వాహకుడికి ఈ డిటెక్టర్ సాయంతో తెలిసిపోతుంది. ఉదాహరణకు మోసగాడు మీ సహోద్యోగులలో ఒకరి తరపున వెబ్‌నార్ లేదా వర్చువల్ సమావేశానికి హాజరైతే ఈ టూల్ ద్వారా అతణ్ని గుర్తించవచ్చు. ‘‘అధునాతన కృత్రిమ మేధస్సు పద్ధతుల వల్ల సోషల్ మీడియాలో ఎన్నో అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. ఇటువంటివి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. మరింత వాస్తవికంగా మారతాయి. ఇలాంటి మోసాలను గుర్తించకపోతే కష్టమే. మోసగాళ్ల వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయి’’ అని ఫేక్బస్టర్ను అభివృద్ధి చేసిన నలుగురు వ్యక్తుల బృందంలో ఒకరైన ప్రొఫెసర్ అభినవ్ ధాల్ తెలిపారు. ఈ పరికరం 90 శాతానికి పైగా కచ్చితత్వాన్ని సాధించిందన్నారు. మిగతా ముగ్గురు సభ్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్ రామనాథన్ సుబ్రమణియన్ , ఇద్దరు విద్యార్థులు వినీత్ మెహతా, పారుల్ గుప్తా ఉన్నారు. గత నెలలో అమెరికాలో ఇంటెలిజెంట్ యూజర్ ఇంటర్ఫేసెస్పై నిర్వహించిన 26వ అంతర్జాతీయ సమావేశంలో ‘‘ఫేక్ బస్టర్: ఏ డీప్ ఫేక్స్ డిటెక్షన్ టూల్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్ సినారియోస్’’ అనే పత్రాన్ని సమర్పించారు. నకిలీ వార్తలు, అశ్లీలత, ఇతర ఆన్లైన్ విషయాలను వ్యాప్తి చేయడానికి తారుమారు చేసిన మీడియా కంటెంట్‌ను విస్తృతంగా వాడినట్టు గుర్తించామని ప్రొఫెసర్ ధాల్ తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని అన్నారు. ముఖ కవళికలను మార్చగల స్పూఫింగ్ టూల్స్ ద్వారా మోసగాళ్లు ద్వారా వీడియో–కాలింగ్ సమావేశాల్లోకి చొరబడ్డారని ఆయన అన్నారు. ఈ నకిలీ ముఖ కవళికలను గుర్తించడం కష్టమేనని, ఆ వ్యక్తి నిజమైన వారే అనుకుంటామని పేర్కొన్నారు. ఫలితంగా తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయన్నారు. ఇవి కూడా చదవండి: డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్ YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి! -
ఒక్క క్లిక్‌తో పెళ్లి కుమార్తెలా మెరవవచ్చు..
ఇంటి నుంచే ఆన్లైన్ షాపింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంట్లో ఉండే నేరుగా షాపును సందర్శించవచ్చు. అందులో తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆ డ్రెస్‌లో తాము ఎలా ఉంటామో చూసుకోవచ్చు. అదే వర్చువల్ రియాలిటీ. మన దేశీయ ప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా భారతదేశంలో మొదటి వర్చువల్ డిజైనర్ స్టోర్‌ను ఇటీవల ప్రారంభించాడు. కరోనా తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో అతి ముఖ్యమైనదిగా వర్చువల్ రియాలిటీని చెప్పుకోవచ్చు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లి డ్రెస్సులను ధరించాలని, బాలీవుడ్ తరహా పెళ్లి నృత్యాలు చేయాలని చాలామంది అనుకుంటారు. అలా ఆలోచిస్తే.. ఈ దుకాణాన్ని మీరు ఒక్క క్లిక్‌తో తెరవచ్చు. ఆకట్టుకునే పంజాబీ పాట ‘మహే డి తప్పే’ కి దాని (వర్చువల్) తలుపులు తెరుస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఒక గది నుండి మరొక గదికి వెళ్ళినప్పుడు సంగీతం మారుతుంటుంది. ఈ వర్చువల్ స్టోర్‌లో పర్యటించి మీరు ఆ స్టోర్‌లో పెళ్లి కూతురులా మెరిసిపోవచ్చు. షేర్వానీల వరసలు.. కంప్యూటర్ మౌస్ క్లిక్ చేస్తూ వెళుతుంటే .. మిమ్మల్ని లేలేత రంగుల డిజైనర్ లెహెంగాలు, షెర్వానీల వరుసల నుండి పోల్కీ ఆభరణాలతో మెరిసే ప్రదర్శనకు తీసుకెళుతుంది. మీ కంప్యూటర్ తెరపై కనిపించే ప్రతి డ్రెస్‌పై క్లిక్ చేయవచ్చు, ఫాబ్రిక్, ఎంబ్రాయిడరీ, ధరల గురించి చాలా వివరంగా తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని మల్హోత్రా డిజైన్ స్టోర్‌కి ఇది వర్చువల్ అవతార్. దిగ్గజ కుతుబ్ మినార్‌కు ఎదురుగా ఉంది. ‘ఇది భారతదేశంలో నా మొదటి వర్చువల్ స్టోర్. 2019 లో ఈ స్టోర్‌ను రీ డిజైనింగ్ చేశాం. దీని విస్తీర్ణం 15,000 చదరపు అడుగులు. దేశంలో డిజైనర్ విభాగంలో అతిపెద్ద స్టోర్ ఇది‘ అని మల్హోత్రా చెప్పారు. లాక్డౌన్ నేర్పిన వేగం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఈ వర్చువల్ ప్రక్రియను వేగవంతం చేసింది అంటాడు మల్హోత్ర. ‘ఈ వర్చువల్ స్టోర్ అంతటా ఉన్నట్టే. ఎప్పుడైనా, ఎక్కడైనా అన్ని రోజులు, అన్ని సమయాల్లో పనిచేస్తుంది. మేం ఈ ప్రదేశంలో లేకపోయినా మా డిజైన్లు కస్టమర్లను చేరుకుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా మేం వినియోగదారుల నుంచి మంచి బలమైన నమ్మకాన్ని పొందగలం‘ అని తన వర్చువల్ విధానం గురించి తెలియజేస్తారు మల్హోత్రా. లాక్డౌన్ సమయంలో వినియోగదారుల నుంచి ఫోన్ కాల్స్ అందుకున్న మల్హోత్రా తనను నేరుగా కలవడానికి, వారి దుస్తులను చూడాలనుకునే వధువులకు ఉపయోగంగా ఉండే మాధ్యమాన్ని వెతికారు. అప్పుడే ఈ డిజిటల్ వైపు మొగ్గుచూపారు. వర్చువల్ ఉపయోగాలను వివరిస్తూ ‘నేను ఆర్డర్ల కోసం, నా కొత్త డిజైన్స్ పరిచయం చేయడానికి వేరే వేరే ప్రాంతాలు తిరగనక్కరలేదు. ఇది వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనుభవాన్ని అందిస్తుంది. దీని నుంచి మిడిల్ ఈస్ట్, కెనడా, అమెరికా వంటి దేశాలలో మా ఉనికిని బలోపేతం చేయాలని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. మొత్తంమీద కరోనా వైరస్ కొత్త కొత్త వాటిని పరిచయం చేసింది. అందరి దృష్టి డిజిటల్ వైపు మరింత సారించేలా చేసింది. ఇప్పటికే ఫ్యాషన్ షోలు వర్చువల్ వైపుగా మళ్లాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్టోర్స్ కూడా చేరాయి. -
సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రపంచంలోనే భారతదేశం వెలుపల తెలుగు వారి కోసమే స్థాపించబడిన అతి కొద్ది ప్రాచీన సంస్థలలో ఒక్కటైన సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటికప్పుడు తన జవసత్వాలను కూడగట్టుకొంటూ, దిన దిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ 46వ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గాన గంధర్వుడు పద్మ భూషణ్ బాల సుబ్రహ్మణ్యానికి, నాట్యమయూరి పద్మశ్రీ శోభా నాయుడికి ఘన నివాళి అర్పిస్తూ.. అంతర్జాల వేదికపై సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవం, దీపావళి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: సింగపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆధ్యాంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. అంతేకాకుండా 45 వసంతాల సమాజ ప్రస్థానాన్ని, మధురానుభూతులను , గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను బుర్రకధ రూపకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో 3000 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి సందేశం, పూర్వపు కార్యనిర్వాహక సభ్యుల ఉపన్యాసాలు, చెప్పుకోండి చూద్దాం, పాటలు, రాజు కామెడీ, బుర్రకథలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకి, గాయని సత్యకి, మిమిక్రీ రాజుకి, యాంకర్ నవతకి, బుర్రకథ విజయకుమార్ బృందానికి , ఆర్కెస్ట్రా వెంకటేష్ బృందానికి, తమ బిజీ షెడ్యూల్లో కొంత విలువైన సమయాన్ని వెచ్చించి, అమూల్యమైన సందేశం అందించిన ఇండియన్ హై కమీషనర్ ఇన్ సింగపూర్ పి. కుమరన్, సింగపూర్ తెలుగు సమాజం వారు ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్స్ విషయంలో వారు చేసిన సహాయ సహకారాలకు సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సమాజ కీర్తిని, ప్రజలకు మెరుగైన సేవల్ని అత్యున్నత స్థాయిలో ఇవ్వటానికి తమ కమిటీ నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. సింగపూర్‌లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని , ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని కోరారు. తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీఎస్ పూర్వ కార్యదర్శులు, కోశాధికారులు 45 ఏళ్లుగా సమాజంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ సందేశాలు పంపినందుకు, కార్యక్రమానికి మా వెన్నంటి ఉన్న స్పాన్సర్లు శుభోదయం గ్రూప్‌కు, లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు,హమారా బజార్‌కు, సెక్రటరీ సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. రమ్య బెహెరా పాడిన అమ్మవారి పాటను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన శుభోదయం మీడియాకు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి కృతఙ్ఞతలు తెలియజేశారు. -
అవి వర్చువల్ నీటి అలలు
-
అబ్బురపరిచే వర్చువల్ నీటి అలలు
సియోల్: నీటి అలలు వేగంగా ఓ భవనంలోని గాజు గదిలోకి దూసుకుపోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి ఓ అద్భుతమైన దృశ్యం దక్షిణ కొరియా దేశంలో చూడవచ్చు. అవి నిజమైన నీటి అలలు కావు.. వర్చువల్ అలలు. సియోల్ నగరంలోని ఓ పెద్ద భవనంలో ఉన్న గాజు గదిలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ అవుట్ డోర్ హై డెఫినేషన్ స్క్రీన్ ప్రోగ్రామ్ చేయబడింది. దీంతో నీటి అలలు ఎగిసిపడుతున్నట్లు కనిపిస్తున్న వర్చువల్ స్క్రీన్ చూపరులను అబ్బురపరుస్తోంది. అనామోర్ఫిక్ ఎలుషన్గా వర్ణించబడిన ఈ వర్చువల్ అలలు 80 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవైన తెరపై ప్రతి గంటకు ఒకసారి నిజంగా నీటి అలలు ఎగిసిపడినట్లు దర్శనమిస్తాయి. అనామోర్ఫిక్ ఎలుషన్ దృశ్యం కనిపించాలంటే నిర్దిష్టమైన కోణంలో చూడాలి. ఆశ్చర్యపరిచే ఈ ఆర్ట్‌ను డిస్ట్రిక్ట్ అనే సంస్థ రూపొందించింది. ఈ సంస్థకు ఆర్ట్# వన్ వేవ్‌గా పేరు ఉన్న విషయం తెలిసిందే. ‘మా సంస్థ నుంచి పలు సృజనాత్మకమైన కళలను సృష్టించాలనుకుంటున్నాం’ అని డిస్ట్రిక్ట్ సంస్థ డైరెక్టర్ జూన్ లీ స్టఫ్ తెలిపారు. (మృత్యుశకటం.. భీతావహ వాతావరణం) శామ్సాంగ్ స్మార్ట్ ఎల్ఈడీ టెక్నాలజీని ఉపయోగించి 1620 చదరపు మీటర్ల స్మార్ట్ స్క్రీన్‌లో ఈ అలలకు సంబంధించిన ఆర్ట్‌ను ఇన్స్టాలేషన్ చేయబడింది. ఈ తెరను తయారు చేయడానికి సుమారు రెండు నెలలు సమయం పట్టినట్లు డిస్ట్రిక్ట్ సంస్థ పేర్కొంది. ఇక ఈ స్క్రీన్ రెజల్యూషన్ 7,840 x 1,952 పిక్సెల్స్ ఉంది. ఈ వర్చవల్ తెర అలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే నాలుగు లక్షలు మంది ఈ వీడియోను విక్షించగా, నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. వర్చువల్ తెర తయారు చేయటం వెనకు అద్భుతమైన నైపుణ్యం దాగి ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘దక్షిణ కొరియన్లు ఇంత సాంకేతికతో భవిష్యత్తులో ఇంకా ఎంత ముందుకెళుతారోనని అసూయగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
టెలికం రంగంలోకి ఏరోవాయిస్
వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా కార్యకలాపాలు ⇒ ఏప్రిల్ 14న 3 సర్కిల్స్‌లో షురూ ⇒ రూ. 300 కోట్ల పెట్టుబడులు చెన్నై: ప్రవాస భారతీయుడు శివకుమార్ కుప్పుసామికి చెందిన యాడ్‌పే మొబైల్ పేమెంట్ సంస్థ తాజాగా ఏరోవాయిస్ పేరిట టెలికం సర్వీసులు ప్రారంభించనుంది. వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా (వీఎన్‌వో) వచ్చే నెల ప్రారంభించే ఈ సేవల ద్వారా తొలి ఏడాదిలో అయిదు లక్షల కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. మొబైల్ సర్వీసులపై దాదాపు రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నట్లు యాడ్‌పే మొబైల్ పేమెంట్ వ్యవస్థాపక సీఈవో శివకుమార్ కుప్పుసామి తెలిపారు. ముందుగా తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి సర్కిల్స్‌లో ఏప్రిల్ 14న కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. తమకంటూ ప్రత్యేకంగా స్పెక్ట్రం లేనందున ఇతర టెల్కోలకు కొంత మొత్తం చెల్లించి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోనున్నట్లు శివకుమార్ చెప్పారు. తాను ఇప్పటికే స్విట్జర్లాండ్, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా తదితర దేశాల్లోని పలు టెలికం కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. భారత్‌లో ఏరోవాయస్ కార్యకలాపాలను తానే స్వయంగా పర్యవేక్షించనున్నట్లు శివకుమార్ చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్ వంటి పూర్తి స్థాయి టెలికం ఆపరేటర్లకు ఇవి రిటైలర్లుగా వ్యవహరించే వీఎన్‌వోలు.. మొబైల్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ వంటి టెలికం సంబంధ సేవలను అందిస్తాయి. వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో) మార్గదర్శకాలు ప్రకటించిన అనంతరం గతేడాది సెప్టెంబర్‌లో టెలికం శాఖకు 70 పైగా దరఖాస్తులు వచ్చాయి.