ఇంటి నుంచే ఆన్‌లైన్ షాపింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంట్లో ఉండే నేరుగా షాపును సందర్శించవచ్చు. అందులో తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆ డ్రెస్‌లో తాము ఎలా ఉంటామో చూసుకోవచ్చు. అదే వర్చువల్ రియాలిటీ. మన దేశీయ ప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా భారతదేశంలో మొదటి వర్చువల్ డిజైనర్ స్టోర్‌ను ఇటీవల ప్రారంభించాడు. కరోనా తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో అతి ముఖ్యమైనదిగా వర్చువల్ రియాలిటీని చెప్పుకోవచ్చు.
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లి డ్రెస్సులను ధరించాలని, బాలీవుడ్ తరహా పెళ్లి నృత్యాలు చేయాలని చాలామంది అనుకుంటారు. అలా ఆలోచిస్తే.. ఈ దుకాణాన్ని మీరు ఒక్క క్లిక్‌తో తెరవచ్చు. ఆకట్టుకునే పంజాబీ పాట ‘మహే డి తప్పే’ కి దాని (వర్చువల్) తలుపులు తెరుస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఒక గది నుండి మరొక గదికి వెళ్ళినప్పుడు సంగీతం మారుతుంటుంది. ఈ వర్చువల్ స్టోర్‌లో పర్యటించి మీరు ఆ స్టోర్‌లో పెళ్లి కూతురులా మెరిసిపోవచ్చు.
షేర్వానీల వరసలు..
కంప్యూటర్ మౌస్ క్లిక్ చేస్తూ వెళుతుంటే .. మిమ్మల్ని లేలేత రంగుల డిజైనర్ లెహెంగాలు, షెర్వానీల వరుసల నుండి పోల్కీ ఆభరణాలతో మెరిసే ప్రదర్శనకు తీసుకెళుతుంది. మీ కంప్యూటర్ తెరపై కనిపించే ప్రతి డ్రెస్‌పై క్లిక్ చేయవచ్చు, ఫాబ్రిక్, ఎంబ్రాయిడరీ, ధరల గురించి చాలా వివరంగా తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని మల్హోత్రా డిజైన్ స్టోర్‌కి ఇది వర్చువల్ అవతార్. దిగ్గజ కుతుబ్ మినార్‌కు ఎదురుగా ఉంది. ‘ఇది భారతదేశంలో నా మొదటి వర్చువల్ స్టోర్. 2019 లో ఈ స్టోర్‌ను రీ డిజైనింగ్ చేశాం. దీని విస్తీర్ణం 15,000 చదరపు అడుగులు. దేశంలో డిజైనర్ విభాగంలో అతిపెద్ద స్టోర్ ఇది‘ అని మల్హోత్రా చెప్పారు.
లాక్‌డౌన్ నేర్పిన వేగం
దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఈ వర్చువల్ ప్రక్రియను వేగవంతం చేసింది అంటాడు మల్హోత్ర. ‘ఈ వర్చువల్ స్టోర్ అంతటా ఉన్నట్టే. ఎప్పుడైనా, ఎక్కడైనా అన్ని రోజులు, అన్ని సమయాల్లో పనిచేస్తుంది. మేం ఈ ప్రదేశంలో లేకపోయినా మా డిజైన్లు కస్టమర్లను చేరుకుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా మేం వినియోగదారుల నుంచి మంచి బలమైన నమ్మకాన్ని పొందగలం‘ అని తన వర్చువల్ విధానం గురించి తెలియజేస్తారు మల్హోత్రా. లాక్డౌన్ సమయంలో వినియోగదారుల నుంచి ఫోన్ కాల్స్ అందుకున్న మల్హోత్రా తనను నేరుగా కలవడానికి, వారి దుస్తులను చూడాలనుకునే వధువులకు ఉపయోగంగా ఉండే మాధ్యమాన్ని వెతికారు. అప్పుడే ఈ డిజిటల్ వైపు మొగ్గుచూపారు.
వర్చువల్ ఉపయోగాలను వివరిస్తూ ‘నేను ఆర్డర్ల కోసం, నా కొత్త డిజైన్స్ పరిచయం చేయడానికి వేరే వేరే ప్రాంతాలు తిరగనక్కరలేదు. ఇది వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనుభవాన్ని అందిస్తుంది. దీని నుంచి మిడిల్ ఈస్ట్, కెనడా, అమెరికా వంటి దేశాలలో మా ఉనికిని బలోపేతం చేయాలని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. మొత్తంమీద కరోనా వైరస్ కొత్త కొత్త వాటిని పరిచయం చేసింది. అందరి దృష్టి డిజిటల్ వైపు మరింత సారించేలా చేసింది. ఇప్పటికే ఫ్యాషన్ షోలు వర్చువల్ వైపుగా మళ్లాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్టోర్స్ కూడా చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment