visaka agency
-
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..
సాక్షి, సీలేరు: ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలో.. పదము కదిపితే ఎన్నెన్ని లయలో.. అందమైన భానోదయాలు.. ఆహ్లాదకరమైన సాయంత్రాలు.. పచ్చని కొండల్ని పెనవేసుకుపోయిన మంచు తెరలు.. ధవళ కాంతులతో మెరిసిపోయే జలపాతాలు.. సెలయేళ్లు.. అడుగడుగునా అందాలు ఆవిష్కృతమయ్యే ఆ మనోహర లోకం విశాఖ మన్యం. శీతాకాలం కావడంతో సీలేరు పరిసర ప్రాంతాల్లో దట్టంగా కురుస్తున్న మంచువానతో ప్రకృతి కనువిందు చేస్తోంది. తెల్లవారుజామున సూర్యోదయం నుంచి సాయంత్రం సంధ్యవేళ వరకు ప్రకృతి ఆవిష్కరించే అందాలు పర్యాటకుల్ని పరవశింపజేస్తున్నాయి. సాయంత్రం సంధ్య వేళ బలిమెల జలాశయం సీలేరు గుంటవాడ, బలిమెల జలాశయాల్లో పడమటి సంధ్యారాగం మధురాతి మధురం. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో డుడుమ జలపాతం మైమరపిస్తే.. రెండు కొండల మధ్య నుంచి పొగమంచు పర్యాటకులను ఆహా్వనిస్తుంటుంది. అదే సమీప ప్రాంతంలో గిరిప్రియ వంతెన కూడా కనువిందు చేస్తుంది. శీతాకాలం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. సీలేరులో అందమైన శుభోదయం తెల్లారుజామున మంచు తెరల్లో సీలేరు జలాశయం డుడుమ జలపాతం వద్ద మంచు అందాలు -
బ్లడ్ అలెర్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఏదైనా ఆపద రానుందని తెలిస్తే అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు. ఇప్పుడు విశాఖకు ‘బ్లడ్’ అలెర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విశాఖపట్నంలో రోజురోజుకు రక్తానికి డిమాండ్ పెరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచే కాదు.. పొరుగు జిల్లాలు, పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు, క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరికి అవసరమైన రక్తాన్ని ఇక్కడ ఉన్న బ్లడ్‌బ్యాంకులు సమకూరుస్తున్నాయి. విశాఖలో శస్త్రచికిత్సలు, ప్రసవాలు, డెంగీ బాధితులు, అవయవ మార్పిడులు పెరుగుతున్నాయి. ఒకపక్క రక్తదాతలు పెరుగుతున్నా అంతకు మించి డిమాండ్ పెరుగుతోంది. ఇలా ఏటా 10 శాతం చొప్పున రక్తదాతల అవసరం పెరుగుతూ వస్తోంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం జనాభాలో ఒక శాతం రక్తం నిల్వలు అవసరమవుతాయి. జిల్లా జనాభా 44 లక్షలుంది. ఈ లెక్కన ఏటా 44 వేల యూనిట్ల రక్తం సరిపోతుంది. కానీ ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి విశాఖ వచ్చే రోగులు/క్షతగాత్రుల తాకిడితో ఇప్పుడు లక్ష యూనిట్లకు పైగా రక్తం కావలసి వస్తోంది. వీటిని సమకూర్చడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ.. విశాఖలో 17 బ్లడ్ బ్యాంకులున్నాయి. ఇవి పెరుగుతున్న రక్తం డిమాండ్‌కు అనుగుణంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలతో ఈ బ్లడ్ బ్యాంకులు అవగాహన కుదుర్చుకున్నాయి. ఏటా రెండు సార్లు ఈ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తపు నిల్వలను సమకూర్చుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా విరివిగా రక్తదానానికి ముందుకొస్తున్నారు. ఇలా సగటున ఏటా 85 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నాయి. ఒకసారి సేకరించిన రక్తం 30 రోజులకు మించి నిల్వ ఉండదు. అందువల్ల రక్త సేకరణ జరిగాక ఆ 30 రోజుల్లోగా వినియోగించకపోతే వృథా అయిపోతుంది. కొన్నిసార్లు ఎక్కువ రక్తం యూనిట్లు అవసరం పడడం, మరికొన్ని సార్లు అంతగా డిమాండ్ లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏ ఏడాది సేకరణ ఎంత ? సంవత్సరం యూనిట్లు 2016–17 82,390 2017–18 82,339 2018–19 97,626 మూడు నెలల్లో సేకరించిన యూనిట్లు మార్చి 6,984 ఏప్రిల్ 6,314 మే 7,539 2018 ఎపిడమిక్ సీజన్లో.. ఆగస్ట్ 11,532 సెప్టెంబర్ 11,150 అక్టోబర్ 6,418 వ్యాధుల సీజన్ మొదలు.. వర్షాలతో పాటు వ్యాధుల సీజనూ మొదలవుతోంది. దోమకాటుతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభించనున్నాయి. వీటి బారిన పడిన వారికి ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోతాయి. వీరికి తక్షణమే రక్తం ఎక్కించి ప్రాణం కాపాడవలసి ఉంటుంది. వర్షాకాలం సీజన్లో విశాఖ నగరం, ఏజెన్సీలో ఏటా పెద్ద సంఖ్యలో ఈ జ్వర మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి ప్లేట్లెట్లు శరవేగంగా పడిపోయి. రోగి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. వీరికి రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి రోగికి ఎక్కిస్తారు. కొన్ని జబ్బుల వారికి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా వంటివి అవసరమవుతాయి. వీటిని కూడా రక్తం నుంచి సెపరేట్ చేసి అవసరమైన వారికిస్తారు. మిగిలిన రక్తాన్ని హిమోగ్లోబిన్ అవసరమున్న వారికిస్తారు. ఏజెన్సీలో రక్తహీనత, తలసేమియా, ఎనీమియా, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో బాధపడే వారు అధికంగా ఉంటారు. వీరికి రక్తం ఎక్కించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఇప్పుడు వ్యాధుల సీజను ప్రారంభం కావడంతో మరో నాలుగు నెలల పాటు రెట్టింపు రక్తపు నిల్వలు కావలసి ఉంటుంది. సాధారణ రోజుల్లో నెలకు ఐదారు వేల యూనిట్ల రక్తం అవసరం ఉండగా ఈ ఎపిడమిక్ సీజనులో రెట్టింపు సంఖ్యలో అంటే.. 12 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో 22 వేలకు పైగా యూనిట్ల రక్తం నిల్వ ఉంది. కొరత రాకుండా చూస్తున్నాం విశాఖ ఆస్పత్రులకు రక్తం అవసరం ఉండే రోగులు, క్షతగాత్రులు ఎక్కువగా వస్తుంటారు. రక్తదాతల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తక్షణమే సమకూర్చే చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీ విద్యార్థులే కాదు.. 80 శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో డెంగీ తదితర రోగులకు సరిపడినన్ని ప్లేట్లెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. పాడేరులో త్వరలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటవుతోంది. అక్కడున్న బ్లడ్ స్టోరేజి యూనిట్‌ను ముంచంగిపుట్టుకు తరలిస్తాం. జిల్లాలో మొబైల్ బ్లడ్ కలెక్షన్ వాహనాన్ని నర్సీపట్నం, అనకాపల్లిల్లో అందుబాటులో ఉంచాం. ఎపిడమిక్ సీజన్లో రక్తం కొరత రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. – రోణంకి రమేష్, ఏడీఎంహెచ్‌వో -
మీనాది హత్యే!
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ కటాఫ్ ఏరియా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు భవానీ, నిరసన నేతలు బషీద్ ఆరోపించారు. మీనాను పోలీసులు ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసినా లొంగకపోవడంతో 12వ తేదీన కాల్చి చంపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతంలో అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్నారన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమను మావోయిస్టులు చంపారని అన్నారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా కొరాపుట్, మల్కన్‌గిరి అడవుల్లో కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా చేసుకుని మీనాని చంపారని తెలిపారు. 303 సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలుపుతూ అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ అంతిమయాత్రలో వరంగల్ పౌరహక్కుల కార్యకర్త రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎల్సీ అధ్యక్షుడు లక్ష్మణ్, మీనా కుటుంబ సభ్యులు సత్యం, భాస్కర్, గాజర్ల రవి, అశోక్, అనిత తదితరులు పాల్గొన్నారు. నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలింపు అలాగే మల్కన్‌గిరి పోలీసుల అదుపులో ఉన్న సుమారు నలుగురు మావోయిస్టులను ఆదివారం కోర్టుకు తరలించినట్టు ఎస్పీ జోగ్గా మోహన్ తెలిపారు. వీరిలో జయంతి అలియాస్ అంజన, గ్లోరి, రాధిక, సుమ అలియాస్ గీత, రాజేష్ కోరా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్! -
ఎన్కౌంటర్: కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు హతం
-
కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్!
సాక్షి, విశాఖ ఏజెన్సీ : ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బాక్సైట్ పోరాటంలో గిరిజనులకు అండ
అనంతగిరి, డుంబ్రిగుడ (అరకులోయ): బాక్సైట్ పోరాటంలో గిరిజనులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం గాలికొండ వ్యూ పాయింట్ నుంచి బాక్సైట్ కొండను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రకృతికి విఘాతం కల్గించే పనులకు పాల్పడితే సహించేది లేదని, గిరిజనులకు అండగా పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం ఎగుశోభ పంచాయతీ భీసుపురం గ్రామంలో గిరిజనులతో ముఖముఖి మాట్లాడారు. హుద్‌హుద్ తుపాను సాయం చాలా మందికి అందలేదని గిరిజనులు ఆయనకు వివరించారు. బాక్సైట్ తీయడం వల్ల సుమారు 300 గ్రామాల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, బాక్సైట్ తీసేందుకు ఇచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయించేలా చూడాలని కోరారు. బాక్సైట్‌పై గిరిజనులు పోరాటం సాగించాలని.. అండగా నిలబతామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంత్రాక్స్ బాధితులకు పరామర్శ కునిడి, పోతంగి, తోటవలస, కొత్తవలస గిరిజన గ్రామాలను సందర్శించిన పవన్‌కల్యాణ్.. పోతంగిలో ఆంత్రాక్స్ బాధితులను పరామర్శించారు. గిరిజన ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, గిరిజన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. డుంబ్రిగుడలోని కస్తూర్బాగాం«ధీ బాలికల పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. -
విశాఖ మన్యంలో పెరిగిన చలి తీవ్రత
విశాఖపట్నం: విశాఖజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా జి.మాడుగులలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే అనంతగిరిలో 12, జి.కె.వీధిలో 12, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మిరియాల సాగు.. బాగు
పాడేరు : మన్యంలో మిరియాల సాగు విస్తరిస్తోంది. గిరిజన రైతులు కాఫీలో అంతర పంటగా దీనిని సాగు చేస్తున్నారు. కాఫీ తోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లపై మిరియాల మొక్కలను పెంచుతున్నారు. ఎకరా కాఫీ తోటలో సుమారు 100 మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు సుమారు 60 నుంచి 70 కిలోల దిగుబడి వస్తోంది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్. కిలో రూ. 500 నుంచి రూ. 600ల వరకు ధర లభిస్తోంది. కాఫీలో అంతర పంటగా వీటి సాగుకు ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. హు ద్హుద్ ధాటికి సుమారు 40వేల ఎకరాల్లో కాఫీ తోటలకు నష్టం వాటిల్లింది. నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లు కూలిపోవడంతో మిరియాల పంటకూ నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో కొత్తగా కాఫీ తోటలు వేసే రైతులకు ఎకరాకు100 చొప్పున మిరి యా మొక్కలను కూడా ఇస్తున్నారు. 25 లక్షల మిరియాల మొక్కల పంపిణీ.. ఏజెన్సీలో ఈ ఏడాది కాఫీ రైతులకు 25లక్షల మిరియాల మొక్కలను ఐటీడీఏ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరిస్తున్నారు. 15వేల ఎకరాల్లో పాతతోటలను పునరుద్ధరిస్తున్నారు. ఈ 25వేల ఎకరాల్లో అంతర పంటగా ఎకరానికి 100 చొప్పున మిరియాల మొక్కలను సరఫరా చేస్తున్నారు. మిరియాల సాగులో సస్యరక్షణ పద్ధతులను ఉద్యానాధికారి రాజాసాహేబ్ వివరించారు. సస్య రక్షణ... మిరియాల మొక్కలపై పురుగుల గు డ్లు కనిపించిన వెంటనే నీలస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, దశవర్ణి కషాయాలను పిచికారీ చేసుకోవాలి. పురుగుల గుడ్లు కనిపించకపోతే పిచికారీ చే యాల్సి న అవసరం లేదు. మొక్కలకు తెగులు ఆశిస్తే 5లీటర్ల పులిసిన మజ్జిగ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట కోత మిరియాల మొక్కలు మే, జూన్ నెల ల్లో పూతకు వస్తాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చెట్ల నుంచి మిరియాల గుత్తులను కత్తిరించుకోని సూర్యకాంతిలో ఆరబెట్టుకోవాలి. రెండు లేదా మూడు రోజులు సూర్యకాంతిలో ఉంచాలి. నాణ్యమైన ఎండు మిరియాల దిగుబడి కోసం చెట్టు నుంచి మిరియాల గుత్తుల కోతకు సరైన సమయాన్ని నిర్ణయించుకోవడం చాల అవసరం. సెప్టెంబర్‌లో నాటుకోవాలి సిల్వర్‌ఓక్ చెట్లకు 75 సెంటీమీటర్ల దూరంలో అడుగు లోతు గుంత తీసి మిరియాల మొక్కలను నాటుకోవాలి. మొక్క చుట్టూ నీరు నిల్వ ఉండకుండా వాటి చుట్టూ మట్టిని గట్టిగా నొక్కి జీవామతం జల్లి ఎండుటాకులతో అచ్ఛాదనం చేయాలి. మిరియాల తీగలకు సూర్యకాంతి, వేడిగాలులు తగలకుండా చూడాలి. వీటి తీగలపై 15రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామతాన్ని పిచికారీ చేయాలి. -
ఆందోళన బేఖాతరు.. బాక్సైట్ తవ్వకాలకు ఓకే
-
ఆందోళన బేఖాతరు.. బాక్సైట్ తవ్వకాలకు ఓకే
విశాఖపట్నం: ఆందోళనలు, నిరసనలు పట్టించుకోకుండా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మైనింగ్‌కు అనుమతిస్తూ జీవో నంబర్.97ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. దీని ప్రకారం నర్సీపట్నంలోని రిజర్వ్ ఫారెస్ట్ డివిజన్లోని 1212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఏపీఎండీసీకి మైనింగ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి మైనింగ్ కార్యక్రమాలు జరపాలని ఇందులో పేర్కొంది. దీంతోపాటు గిరిజనులు అధికంగా ఉండే చితపల్లి, జర్రెల అటవీ ప్రాంతంలో కూడా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు అక్కడ ఉన్న గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. చాలా ఏళ్లుగా ఇక్కడ బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిని పట్టించుకోకుండా తాజాగా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, గిరిజన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో ఎదురు చూడాల్సిందే.