మిరియాల సాగు.. బాగు
మిరియాల సాగు.. బాగు
Published Mon, Aug 22 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
పాడేరు : మన్యంలో మిరియాల సాగు విస్తరిస్తోంది. గిరిజన రైతులు కాఫీలో అంతర పంటగా దీనిని సాగు చేస్తున్నారు. కాఫీ తోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లపై మిరియాల మొక్కలను పెంచుతున్నారు. ఎకరా కాఫీ తోటలో సుమారు 100 మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు సుమారు 60 నుంచి 70 కిలోల దిగుబడి వస్తోంది. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్. కిలో రూ. 500 నుంచి రూ. 600ల వరకు ధర లభిస్తోంది. కాఫీలో అంతర పంటగా వీటి సాగుకు ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. హు ద్‌హుద్ ధాటికి సుమారు 40వేల ఎకరాల్లో కాఫీ తోటలకు నష్టం వాటిల్లింది. నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లు కూలిపోవడంతో మిరియాల పంటకూ నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో కొత్తగా కాఫీ తోటలు వేసే రైతులకు ఎకరాకు100 చొప్పున మిరి యా మొక్కలను కూడా ఇస్తున్నారు.
25 లక్షల మిరియాల మొక్కల పంపిణీ..
ఏజెన్సీలో ఈ ఏడాది కాఫీ రైతులకు 25లక్షల మిరియాల మొక్కలను ఐటీడీఏ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరిస్తున్నారు. 15వేల ఎకరాల్లో పాతతోటలను పునరుద్ధరిస్తున్నారు. ఈ 25వేల ఎకరాల్లో అంతర పంటగా ఎకరానికి 100 చొప్పున మిరియాల మొక్కలను సరఫరా చేస్తున్నారు. మిరియాల సాగులో సస్యరక్షణ పద్ధతులను ఉద్యానాధికారి రాజాసాహేబ్ వివరించారు.
సస్య రక్షణ...
మిరియాల మొక్కలపై పురుగుల గు డ్లు కనిపించిన వెంటనే నీలస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, దశవర్ణి కషాయాలను పిచికారీ చేసుకోవాలి. పురుగుల గుడ్లు కనిపించకపోతే పిచికారీ చే యాల్సి న అవసరం లేదు. మొక్కలకు తెగులు ఆశిస్తే 5లీటర్ల పులిసిన మజ్జిగ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పంట కోత
మిరియాల మొక్కలు మే, జూన్ నెల ల్లో పూతకు వస్తాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చెట్ల నుంచి మిరియాల గుత్తులను కత్తిరించుకోని సూర్యకాంతిలో ఆరబెట్టుకోవాలి. రెండు లేదా మూడు రోజులు సూర్యకాంతిలో ఉంచాలి. నాణ్యమైన ఎండు మిరియాల దిగుబడి కోసం చెట్టు నుంచి మిరియాల గుత్తుల కోతకు సరైన సమయాన్ని నిర్ణయించుకోవడం చాల అవసరం.
సెప్టెంబర్‌లో నాటుకోవాలి
సిల్వర్‌ఓక్ చెట్లకు 75 సెంటీమీటర్ల దూరంలో అడుగు లోతు గుంత తీసి మిరియాల మొక్కలను నాటుకోవాలి. మొక్క చుట్టూ నీరు నిల్వ ఉండకుండా వాటి చుట్టూ మట్టిని గట్టిగా నొక్కి జీవామతం జల్లి ఎండుటాకులతో అచ్ఛాదనం చేయాలి. మిరియాల తీగలకు సూర్యకాంతి, వేడిగాలులు తగలకుండా చూడాలి. వీటి తీగలపై 15రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామతాన్ని పిచికారీ చేయాలి.
Advertisement