మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
అరకు కాఫీకి కొత్త రుచి తీసుకొచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
2014–19 మధ్యలో కాఫీ రైతులను నిర్లక్ష్యం చేసిన టీడీపీ సర్కార్
వైఎస్సార్‌సీపీ హయాంలో 2,258 ఎకరాల కాఫీ తోటలకు సేంద్రీయ ధ్రువీకరణ
విదేశాలకు సొంత బ్రాండ్‌తో అరకు కాఫీని ఎగుమతి చేసే స్థాయికి జీసీసీ
చింతపల్లిలో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు
కాఫీకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించిన జగన్ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం : ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉంది. లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న జీసీసీ.. ఆదివాసీ రైతు సోదర,సోదరీమణుల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తోంది.
ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా ఉంటుంది. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించింది. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి’’
ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలివీ. ప్రధాని ప్రశంసల వెనుక కాఫీకి రుచి తీసుకొచ్చి.. ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో గత ఐదేళ్లలో అనేక కృషి సల్పింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
2014–19 కాలంలో రాష్ట్రంలోని ప్రతి విభాగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కీ అదే దుస్థితి పట్టించారు. ఇక కోలుకోలేదనుకున్న సంస్థకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. జీసీసీనే నమ్ముకున్న గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఉత్పత్తుల కొనుగోలు దగ్గర నుంచి.. విక్రయాల వరకూ తిరుగులేని శక్తిగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. కాఫీ తోటలకు పునరుజ్జీవం పోశారు. ఫలితంగా చంద్రబాబు కాలంలో టర్నోవర్ కంటే.. ఈ ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్‌ని జీసీసీ సొంతం చేసుకుంది.
తొలిసారిగా కాఫీతోటలకు సేంద్రీయ ధృవీకరణ లభించడంతో పాటు.. ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే విదేశాలకు కాఫీని సొంతంగా ఎగుమతి చేసేందుకూ సిద్ధమవుతోంది. 2014–15 నుంచి 2018–19 వరకూ రూ.1209 కోట్లు మాత్రమే ఉన్న జీసీసీ టర్నోవర్ ఒక్కసారిగా గేర్ మార్చింది. గత సీఎం వైఎస్ జగన్ జీసీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2019–20 నుంచి 2023–24 మధ్య కాలంలో రెట్టింపై ఏకంగా టర్నోవర్ రూ.2,303 కోట్లకు చేరుకుంది.
మేడిన్ ఆంధ్రా పేరుతో...
ఓ వైపు అరకు కాఫీ టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆర్గానిక్‌గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఈ తోటల్లో ఏడాదికి 71, 258 మెట్రిక్ టన్నుల కాఫీపండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో 2,258.55 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీవోపీ) స్టాండర్డ్స్ సర్టిఫికెట్ తీసుకోగా.. జీకేవీధి క్లస్టర్ ఇప్పటికే రెండుసార్లు స్కోప్ సర్టిఫికెట్ దక్కించుకుంది. మూడో ఏడాదీ సేంద్రీయ సాగుకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది.
ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో టై–అప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతూ వస్తోంది. డౌనూరులో క్యూరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2,27,021 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. మొత్తం 93,521 మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు, వీరిలో 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు.
వీరి వద్ద నుంచి సేకరించిన బీన్స్‌ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్‌స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తుంటారు. ఇకపై ఇక్కడి నుంచే చేసేలా క్యూరింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్‌లోకి పంపించేందుకు అవకాశం ఉంది.
తొలిసారిగా భారీగా ధరలు పెంపు
గిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిల్ని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులు పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పార్చ్‌మెంట్ కాఫీ కిలోకి రూ.285, చెర్రీ కాఫీ కిలోకి రూ.145 మార్కెట్ ధరగా ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడిని నిరోధించింది. 2023–24లో ఇప్పటి వరకూ 564.48 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి రూ.13.39 కోట్లు కాఫీ రైతు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసింది.
2019–24 మధ్యలో అరకు కాఫీ ఎదిగిందిలా..
⇒ 2018–19 కాలంలో రూ.799.58 లక్షల కాఫీ కొనుగోలు చేయగా.. 2023–24 నాటికి రూ.1339.05 లక్షల కాఫీ కొనుగోలు చేసింది.
⇒ డౌనూరులో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని స్థాపించేందుకు రూ.3 కోట్లుని ప్రభుత్వం మంజూరు చేయగా 2023 అక్టోబర్ 20న అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి.
⇒ కాఫీ తోటల నిర్వహణకు జీసీసీ ద్వారా గిరిజన రైతులకు ఏటా రూ.1.05 కోట్ల రుణాల్ని, వ్యవసాయ కార్యక్రమాల అమలుకు రూ.1.06 కోట్ల క్రెడిట్ రుణాల్ని పంపిణీ చేశారు.
⇒ వివిధ నగరాలు, పట్టణాల్లో అరకు కాఫీ పేరుతో అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశారు.
⇒ దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు, రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు.
⇒ సేంద్రీయ పద్ధతుల్లో పండుతున్న కాఫీ ఘుమఘుమలకు విదేశీయులు ఫిదా అవుతోంది. విదేశీ విపణిలో పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇకపై సొంతంగా ఎగుమతులు చేపట్టాలని జీసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఎక్స్‌పోర్ట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు.
గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీ
అల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగానని చెప్పారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తోంది. –జి. సురేష్ కుమార్, జీసీసీ ఉపాద్యక్షుడు, ఎండీ
Comments
Please login to add a commentAdd a comment