వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్లడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు కొందరు. కొందరు మాత్రం కాస్త ఆగి వెనక్కి చూసి ఆగిపోయిన వారికి ఆసరాగా నిలుస్తారు. అండగా నిలబడతారు. జకైట్‌సొనో జమీర్ రెండో కోవకు చెందిన మహిళ.
‘కాఫీ లేడీ ఆఫ్ నాగాలాండ్’గా పేరు తెచ్చుకున్న జమీర్ విజయవంతమైన వ్యాపారిగా ఎదగడం వెనుక కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను తట్టుకొని నిలబడిన పట్టుదల ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేకపోవడంతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది జమీర్‌కు. కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ఏదైనా చిన్నవ్యాపారమో, ఉద్యోగమో చేయాలనుకుంది. కాని ఏం చేయాలి? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఆ సమయంలోనే ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది జమీర్.
తోట నుంచి కప్పు వరకు కాఫీ ప్రస్థానాన్ని ఆ వర్క్‌షాప్‌లో చెప్పారు. కాఫీ రుచిగా ఉండడానికి ఎన్ని విషయాలు దోహద పడతాయో అనే విషయం తనకి ఆసక్తికరంగా అనిపించింది. కాఫీ ఎలా పుడుతుందో తెలుసుకున్న క్లాసులోనే ‘బిజినెస్ ఐడియా’ పుట్టింది! ఈ క్లాస్‌ల స్ఫూర్తితో ‘ఫార్మర్ స్క్వేర్’అనే కేఫ్‌ను దిమపూర్‌లో మొదలుపెట్టింది. అయితే మొదలుపెట్టిన కొన్ని నెలలకే ఆ కేఫ్ మూతపడింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిరాశ చీకట్లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో తన కోసం మరో ద్వారం తెరుచుకుంది.
జర్మనీకి సంబంధించిన ఒక డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏజెన్సీ ‘హర్ అండ్ నౌ’ అనే సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. మరొకరైతే ‘కాఫీకో దండం. వ్యాపారం మనకు అచ్చిరాదు’ అని వెళ్లకుండా ఉండేవారేమో! కాని జమీర్ ఈ కార్యక్రమాల్లో భాగం కావడం ద్వారా తాను చేసిన తప్పులు, చేయకూడని తప్పులు, వ్యాపార వ్యూహం ఎలా ఉండాలి? మనదైన ప్రత్యేకత ఏమిటీ, ప్రాడక్ట్ మార్కెటింగ్ ప్లాన్స్ ఎలా ఉండాలి....ఇలా రకరకాల విషయాలు తెలుసుకుంది.
‘ఫార్మర్ స్క్వేర్’తో మరోసారి బరిలోకి దిగింది. ఈసారి మాత్రం తన కల తనని నిరాశ పరచలేదు.
‘లెస్ ఈజ్ మోర్’ అనేది తన కీలక వ్యాపార సూత్రంగా మారింది. తాజా గ్రౌండ్ కాఫీని అందించడంలో ‘ఫార్మర్ స్క్వేర్’ కేఫ్‌లకు మంచి పేరు వచ్చింది. పక్కన ఉన్న రాష్ట్రాలకు కూడా వ్యాపారం విస్తరించింది.
తన విజయంతో సంతృప్తి పడకుండా తనలాంటి వారిని మరింత మందిని తయారుచేసే పనిలో ఉంది జమీర్. ఆర్థికంగా వెనకబడిన మహిళలకు కాఫీ నిపుణుల చేత వర్క్‌షాప్‌లు నిర్వహించడమే కాదు వ్యాపారం ఎలా చేయాలి? నష్టాలు రాకుండా ఎలా చూడాలి... ఇలా రకరకాల విషయాలు నేర్పిస్తుంది. మరోవైపు కాఫీ పంటల సాగులో మహిళలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ‘క్వాలిటీ కాఫీ కల్చర్’ అనేది ఆమె ఎజెండాగా మారింది.
‘రకరకాల కారణాల వల్ల తీవ్రమైన నిరాశాæనిస్పృహల్లో ఉన్న సమయంలో, పెద్దగా ఆసక్తి లేకపోయినా సరే కాఫీ వర్క్‌షాప్‌కు వెళ్లాను. అక్కడ కేవలం సాంకేతిక విషయాలు మాత్రమే నేర్చుకున్నానంటే పొరపాటు. మనో బలాన్ని ఇచ్చే విషయాలు అనేకం విన్నాను. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి నన్ను నేను నిరూపించుకోవాలనే ఉత్సాహంలో ఉన్నాను’ అంటుంది నలభై రెండు సంవత్సరాల కికాన్.
జమీర్ కృషి వృథా పోలేదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది!
Comments
Please login to add a commentAdd a comment