కోట్లకు పడగలెత్తిన సబ్‌రిజిస్ట్రార్
విశాఖపట్నం: సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణ దాస్ ఆస్తులపై మంగళవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు జరిపారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా స్థిర, చరాస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.
విశాఖలోని అక్కయ్యపాలెంలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి వద్ద ఉంచి లంచం తీసుకుంటూ రామకృష్ణదాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. అప్పటి నుంచి అతని ఆస్తుల వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విశాఖలోని రామకృష్ణదాస్ నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు.
రవీంద్రనగర్‌లో సొంతింట్లో నిర్వహించిన సోదాలో ఓ బ్యాంక్ లాకర్లో రూ.15 లక్షల నగదు, ఏటికొప్పాకలో 4 ఎకరాల స్థలం, దార్లపూడిలో 3.20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, శ్రీకాకుళంలో సుమారు 3 ఎకరాల భూమి పత్రాలు సోదాల్లో లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రామకృష్ణదాస్పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.