ఫెర్రర్ సేవలు చిరస్మరణీయం
చిలమత్తూరు : పేదల దేవుడు ఫెర్రర్ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక ప్రభుత్వ డీవీఅండ్ఆర్ జూనియర్ కళాశాల ఆవరణలో ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ విగ్రహావిష్కరణ శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశాల ఫెర్రర్ విగ్రహావిష్కరణ చేసి పూలమాల వేసి, నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పొదుపు మహిళా సంఘాల నిర్వహణ, నీటిని నిల్వ చేయడం కోసం ఎన్నో పథకాలు నిర్వహించిన మహనీయుడన్నారు.
ప్రభుత్వ డీవీఅండ్ఆర్ జూనియర్ కళాశాల భవన నిర్మాణాల కోసం రూ.కోటి విరాళంగా ఇచ్చిన ఘనత ఆర్డీటీకి దక్కిందన్నారు. జిల్లాలో పలు కళాశాలలు, పాఠశాలల కోసం భవనాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అనంతరం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌజియాబాను, సర్పంచ్ శ్రీకళ, సంస్థ రీజినల్ డైరెక్టర్లు కృష్ణవేణి, రాజశేఖర్రెడ్డి, మీనాక్షి, సుదర్శన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.