viswa hindu parishath
-
అయోధ్య భూమి పూజ: విశ్వ హిందూ పరిషత్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏ రకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ పరిషత్ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను విశ్వ హిందూ పరిషత్ విడుదల చేసింది. అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవం ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని దానిలో వివరించారు. దీని ప్రకారం ఆగష్టు 5 వ తేదీ(బుధవారం) ప్రధాని నరేంద్రమోదీ సాధు సంతులు, వేద పండితులు, ట్రష్టు సభ్యులు, ఇతర విశిష్ట అతిధులతో కలిసి రామ జన్మభూమిలో శ్రీరామునికి విశేషమైన పూజలు చేస్తారు. ఈ చారిత్రకమైన ఘట్టాన్ని మొత్తం భారతదేశమే కాక యావత్ ప్రపంచం దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశం నలుమూలలలోని పవిత్ర నదులనుంచి సేకరించిన జలాలను, పుణ్య క్షేత్రాల నుంచి సేకరించిన మృత్తికను ఈ పూజా కార్యక్రమంలో వినియోగించనున్నారు. 2020 ఆగష్టు 5 బుధవారం రోజున ఉదయం 10.30 గంటలకు సాధుసంతులు వారి వారి పీఠాల్లో, ఆశ్రమాల్లో, దేశ విదేశాలలో నివసిస్తున్న భక్తులందరూ వారి వారి గృహాల్లో లేదా వారికి దగ్గరలో ఉండే దేవాలయాల్లో, ఆశ్రమాల్లో కలిసి కూర్చుని వారి వారి ఇష్ట దేవతల భజన, కీర్తన, జపము, అర్చనలు చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చెయ్యాలని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే రామ భక్తులకు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఉంటే అయోధ్యలో జరుగుతున్న పూజా కార్యక్రమం టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తున్న సమయంలో చుట్టుప్రక్కల వారందరూ కలిసి వీక్షించే విధంగా ఆడిటోరియంలో గాని, హాల్ లో గాని పెద్ద తెరను ఏర్పాటు చేసుకుని వీక్షించే ప్రయత్నం చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా ఇళ్ళను, ఆశ్రమాలను, పీఠాలను వీలైనంత అందంగా ఉండేటట్లు అలంకరణ చేసి అందరికి ప్రసాద వితరణ చెయ్యండి అని ఆయన విన్నవించారు. అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించండి అని రామ భక్తులను కోరారు. రామమందిర నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉండేందుకు ఎంతవరకు విరాళం ఇవ్వగలరో అంత ఇవ్వడానికి సంకల్పం చెయ్యండి అని అన్నారు. ప్రస్థుత పరిస్థితిలో భక్తులు అయోధ్య రావటం చాలా కష్ట సాధ్యమైనందున ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు, ఎవరి ఆశ్రమాల్లో వాళ్ళు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపించండి అని పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాలన్నిటినీ అధికంగా ఉపయోగించుకొని ఈ విశేష కార్యక్రమంలో సమాజంలోని వ్యక్తులందరూ భాగస్వామ్యం అయ్యేటట్లు చూడండి అన్ని కోరారు. పైన పేర్కొన్న వివిధ రకాలైన పద్దతులలో కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ప్రభుత్వము, స్థానిక అధికారులు విధించిన నియమాలను అందరూ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మిలింద్ పరాండే సూచించారు. చదవండి: భూమి పూజకు ముహూర్తం..పూజారికి బెదిరింపు కాల్స్ -
భూమి పూజ : ఉద్ధవ్ ఠాక్రేకు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : అధికారం కోసం హిందుత్వను విడిచిపెట్టారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ విమర్శల దాడి చేయగా, అయోధ్యలో ఆగస్ట్ 5న జరిగే రామమందిర భూమిపూజకు శివసేన అధిపతిని ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మంగళవారం స్పష్టం చేసింది. భూమిపూజకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ ఆహ్వానించలేదని, ప్రోటోకాల్‌ను అనుసరించి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. రామమందిర ఉద్యమంతో శివసేన ఎన్నడూ మమేకం కాలేదని ఆయన అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా వ్యవహరిస్తున్నందున శివసేన చీఫ్ హోదాలోనూ ఆయనను ఆహ్వానించలేదని చెప్పారు. చదవండి : వీహెచ్‌పీ మోడల్లోనే మందిర్.. ఏ రాష్ట్ర సీఎంనూ ఈ కార్యక్రమానికి పిలవడంలేదని వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ-భూమిపూజ చేపట్టాలని ఠాక్రే గతంలో సూచించారు. శంకుస్ధాపన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనపై అలోక్ కుమార్ స్పందిస్తూ గతంలో హిందుత్వ పార్టీ అయిన శివసేన దిగజారుడుతనం బాధాకరమని అన్నారు. హోంమంత్రిత్వ శాఖ పొందుపరిచిన కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ కొద్దిమందితోనే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో జరిగే రామమందిర శంకుస్ధాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కొద్దిమందినే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని, ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర పేర్కొంది. -
యాదాద్రిపై నీ బొమ్మలెందుకు?
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి ఆలయ ప్రాకారలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ చెక్కడంపై వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావి నూతల శశిధర్ మండిపడ్డారు. ఈ చర్య హిందువులందరినీ బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, మహాత్మ గాంధీ, ఇందిరా, రాజీవ్ గాంధీల బొమ్మలతో పాటు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చారిత్రక గుర్తులు ప్రతిబింబించేలా ఆలయ గోపుర, ప్రాకారాలపై శిల్పులు బొమ్మలు చెక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీని వల్ల ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బ తింటుందని ఆగమ శాస్త్ర పండితులు భావిస్తోన్న నేపథ్యంలో ఆయనపై విధంగా స్పందించారు. చారిత్రాత్మక ఘటనలను చెక్కడం ద్వారా యాదాద్రి పవిత్రతను కాపాడాలి గానీ, ధార్మిక ప్రదేశాల్లో రాజకీయ పార్టీల చిహ్నాలు ఎందుకని ప్రశ్నించారు. ఇది కేసీఆర్ అహంకారానికి, పతనానికి నిదర్శనమన్నారు. ఇలాంటి నీచ పనులు మానుకోకుంటే, పుణ్య క్షేత్రాలను కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల ధర్నా పవిత్ర యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు తొలిగించాలంటూ బీజేపీ నాయకులు శుక్రవారం ధర్నాకు దిగారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగమ శాస్త్రాలను గాల్లో కలిపేసి కేసీఆర్ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. -
బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఓ టీవీ చానెల్లో శ్రీరాముడు, సీతలపై చర్చావేదిక సందర్భంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు, ప్రతినిధులు సదరు చానెల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఈ ఘటనపై చానెల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్పీఎ, బజరంగ్దళ్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు వెస్ట్‌జోన్ ఇన్చార్జి డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు నేతృత్వంలో భారీగా బలగాలను మోహరించారు. అప్పటికే వీహెచ్‌పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు భారీగా పోలీసు స్టేషన్ బయట గుమిగూడారు. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఒకవైపు భారీగా మోహరించిన పోలీసులు, మరో వైపు న్యాయం చేయాలంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కూడా స్టేషన్‌కు వచ్చారు. ఎట్టకేలకు అరెస్ట్ చేసిన కార్యకర్తలను విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
తొగాడియాను కర్ణాటకలో కాలు పెట్టనివ్వం
కర్ణాటక హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్ వెల్లడి బెంగళూరు : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా విశ్వహిందూపరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాను కర్ణాటకలో అడుగుపెట్టనివ్వబోమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ప్రసంగాలను అనుమతించబోమని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ స్పష్టం చేశారు. బెంగళూరులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుత్తూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో ప్రవీణ్ తొగాడియా పాల్గొని ప్రసంగించారని, అనంతరం ఆయా ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని మరే ప్రాంతంలోనూ ఈ తరహా పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే ప్రవీణ్ తొగాడియాపై నిషేధం విధించాల్సి వస్తోందని, ఇందులో మరే దురుద్దేశం లేదని అన్నారు. జర్మనీలోని ఓ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్‌షిప్ చేయడానికి వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధికి ‘అత్యాచారాల దేశం’ నుంచి వచ్చిన వారంటూ గుర్తింపువేసి ఇంటర్న్‌షిప్‌లో చేర్చుకునేందుకు నిరాకరించడం బాధాకరమని అన్నారు.