సాక్షి, న్యూఢిల్లీ : అధికారం కోసం హిందుత్వను విడిచిపెట్టారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ విమర్శల దాడి చేయగా, అయోధ్యలో ఆగస్ట్ 5న జరిగే రామమందిర భూమిపూజకు శివసేన అధిపతిని ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మంగళవారం స్పష్టం చేసింది. భూమిపూజకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ ఆహ్వానించలేదని, ప్రోటోకాల్‌ను అనుసరించి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. రామమందిర ఉద్యమంతో శివసేన ఎన్నడూ మమేకం కాలేదని ఆయన అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా వ్యవహరిస్తున్నందున శివసేన చీఫ్ హోదాలోనూ ఆయనను ఆహ్వానించలేదని చెప్పారు. చదవండి : వీహెచ్‌పీ మోడల్‌లోనే మందిర్..
ఏ రాష్ట్ర సీఎంనూ ఈ కార్యక్రమానికి పిలవడంలేదని వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ-భూమిపూజ చేపట్టాలని ఠాక్రే గతంలో సూచించారు. శంకుస్ధాపన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనపై అలోక్ కుమార్ స్పందిస్తూ గతంలో హిందుత్వ పార్టీ అయిన శివసేన దిగజారుడుతనం బాధాకరమని అన్నారు. హోంమంత్రిత్వ శాఖ పొందుపరిచిన కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ కొద్దిమందితోనే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో జరిగే రామమందిర శంకుస్ధాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కొద్దిమందినే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని, ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment