బంజారాహిల్స్ పోలీసుల బందోబస్తు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఓ టీవీ చానెల్‌లో శ్రీరాముడు, సీతలపై చర్చావేదిక సందర్భంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రతినిధులు సదరు చానెల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఈ ఘటనపై చానెల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీఎ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు వెస్ట్‌జోన్ ఇన్‌చార్జి డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు నేతృత్వంలో భారీగా బలగాలను మోహరించారు. అప్పటికే వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు భారీగా పోలీసు స్టేషన్ బయట గుమిగూడారు. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఒకవైపు భారీగా మోహరించిన పోలీసులు, మరో వైపు న్యాయం చేయాలంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కూడా స్టేషన్‌కు వచ్చారు. ఎట్టకేలకు అరెస్ట్ చేసిన కార్యకర్తలను విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment